తోటమాలి లేక అక్కడ గులాబీ తోటలు ఎండిపోతున్నాయా? కేడర్ డీలా పడిపోతోందా? నడవడానికి మేం సిద్ధం…. నడిపించే నాయకుడు ఎక్కడంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయా? ఆ ఉమ్మడి జిల్లాలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలను పార్టీ అధిష్టానం విస్మరిస్తోందా? రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలు అక్కడ తూతూమంత్రంగా జరుగుతున్నాయా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కథ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని కీలకమైన నియోజకవర్గాలను బీఆర్‌ఎస్ వదిలేసిందా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇక్కడి మూడు సెగ్మెంట్స్‌కు చెందిన గులాబీ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. కానీ… రెండేళ్లుగా ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌లు లేరు. పార్టీ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చేవెళ్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు.
ఆ రెండిటితో పాటు ఇటీవల తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో… మూడు చోట్ల గులాబీ తోటకు దిక్కు మొక్కులేకుండా పోయిందంటూ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య పార్టీ మారాక శేరిలింగంపల్లి, చేవెళ్ళ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో రెండు చోట్ల పార్టీ కార్యకర్తలు నారాజ్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్‌లో. సమస్యలు తీర్చే సంగతేమోగానీ… నియోజకవర్గాల్లో కనీసం మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందన్న ఆవేదనవ్యక్తం అవుతోంది శేరిలింగంపల్లి, చేవెళ్ళలో. సేనాధిపతి లేని సైన్యంతో యుద్ధం చేయడం ఎలాగన్నది వాళ్ళ క్వశ్చన్.
ఇక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అయితే… త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ అన్ని వర్గాల ఓటర్లు ఉంటారు. అయినాసరే…. రెండేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యక్రమాలను పర్యవేక్షించే దిక్కు లేకుండా పోయింది. పై స్థాయిలో నాయకులు ఎవరూ లేక, పట్టించుకోకున్నా… కింది లెవల్‌లో కేడర్ మాత్రం తమకు చేతనైంది చేసుకుంటూ పోతోంది. అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లారు. ఆయనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
వాటికి మాజీ ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఆయన సంగతి తేలేదాకా…. ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే వాళ్ళు ఎవరూ లేరు. జిల్లాలకు అధ్యక్షులను నియమించినా వారు కూడా నియోజకవర్గ మంచి చెడులపై దృష్టి పెట్టడం లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడినా… అక్కడ పార్టీ భాద్యతలను సబితా ఇంద్రారెడ్డి కొడుకు పటోళ్ల కార్తీక్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇటీవల మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో బాధితుల పక్షాన నిర్వహించిన ప్రోగ్రామ్‌ను లీడ్ తేశారాయన. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో… తాత్కాలికంగానైనా బాధ్యతలను ఎవరికీ అప్పగించకపోవడంతో ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాయి గులాబీ శ్రేణులు. ఆయా నియోజకవర్గాల్లో సమర్థులైన నాయకులను గుర్తించి బాద్యతలు ఇస్తే రాబోయే ఎన్నికల్లో విజయం వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు నాయకులు. ఆ నియోజకవర్గాల్లో గులాబీ సైన్యానికి సేనాధిపతులను ఎప్పటికి నియమిస్తారో చూడాలి.
