కారు రిపేర్ వర్క్స్ మొదలయ్యాయా? మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గులాబీ అధిష్టానం పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడుతున్నా….. లోలోపల అంతర్మథనం జరుగుతోందా? కొన్ని జిల్లాల విషయంలో పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం మొదలైందా? ఆయా జిల్లాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందన్న భయం కూడా పెరుగుతోందా? ఏయే ఉమ్మడి జిల్లాలను ప్రత్యేకంగా భావిస్తోంది బీఆర్‌ఎస్? అక్కడున్న పరిస్థితులేంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెర మీదికి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ళకు పార్టీ సింబల్స్‌తో నిర్వహించినవి కావడంతో…అధికార,ప్రతిపక్షాల బలాలు, బలహీనతల మీద చర్చ జరుగుతోంది. ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నా… ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మాత్రం కాస్త లోతుల్లోకి వెళ్తోందట. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్‌లో ఎన్నికలు జరిగిన తీరును ఎక్కడికక్కడే పోస్ట్‌మార్టం చేస్తూ… బలాలకంటే ఎక్కువగా బలహీనతల మీదే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి కొన్ని జిల్లాలో మంచి ఫలితాలు వస్తే…. మరికొన్ని చోట్ల మరీ దారుణంగా ఉంది. అస్సలు ఒక్క మున్సిపల్ ఛైర్మన్ సీటు కూడా దక్కించుకోలేని జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ బోర్లాపడిపోయింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఒక్క మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్‌నుగాని దక్కించుకోలేకపోయింది కారు పార్టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి 8 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ జీరో. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎలక్షన్స్ జరగ్గా….ఇక్కడ కూడా కారు ఖాతా తెరవలేదు.
ఇక మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ రెండు జిల్లాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది పార్టీ. ఆ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు చాలా తక్కువమంది అప్పుడు గెలిచారు. దీంతో కళ్లు తెరిచిన పార్టీ అదిష్టానం ఆయా మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డిసైడైందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి నిజామాబాద్‌లో 9 సెగ్మెంట్స్ ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… ఈ పరిధిలో దాదాపు 25 నియోజకవర్గాలవుతాయి. దీంతో ఈ రెండు జిల్లాలను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని భావిస్తున్న పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారట. రెండు చోట్ల మరోసారి జీరో ఫలితాలు రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. మిగతా చోట్ల అంతో ఇంతో ప్రభావం చూపగలుగుతున్నా…. ఇక్కడ మాత్రం వరుస ఎన్నికల్లో ఎందుకు పార్టీ డీలపడుతోందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడున్న ఇబ్బందులేంటి? వాటిని అధిగమించడం ఎలాగన్న అంశం మీద దృష్టి పెట్టిందట గులాబీ అధిష్టానం.
మాజీ మంత్రులకు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లకు మధ్య గ్యాప్ లేకుండా చూడడం, ఏ ఎన్నికలైనా సమన్వయం చేసుకుంటూ వెళ్లడం లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ ఎన్నికలను లైట్ తీసుకునప్పటికీ…. రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో మాత్రం అలర్ట్‌గా ఉండాలని, ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో మరోసారి జీరో ఫలితాలు రాకూడదని ఇప్పటికే స్థానిక నాయకత్వానికి ఆదేశాలు వెళ్లాయట. 19 నియోజకవర్గాలున్న ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఫలితాలు ఇలాగే వస్తుంటే… వాటి ప్రభావం పక్క జిల్లాల మీద కూడా పడుతుందని, అప్పుడు సమస్య తీవ్రత పెరుగుంతదన్నది బీఆర్‌ఎస్ అధినాయకత్వం భయం. అందుకే…. ఇలా జీరో ఫలితాలు వచ్చే నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదని భావిస్తున్నారట. వీటితోపాటు ఒక్క మున్సిపాలిటీని మాత్రమే గెలుచుకున్న ఉమ్మడి జిల్లాలపై కూడా ఓ కన్ను వేశారు పార్టీ పెద్దలు. ఉమ్మడి నల్గొండ , మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో సింగిల్ నంబర్‌కే పరిమితమైంది పార్టీ. అందుకే… ఇక నుంచి ఈ తరహా జిల్లాలను స్పెషల్ కేటగిరీలో పెట్టి రిపేర్ వర్క్స్ మొదలుపెట్టాలనుకుంటున్నారట.
