తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా? బీఆర్‌ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టేసిందా? పాత సీసాలో కొత్త నీళ్ళు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోందా? అసలు ఏ సెంటిమెంట్‌ని తిరిగి రగల్చ బోతోంది గులాబీ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి రావాలన్న ప్లాన్‌లో ఉంది బీఆర్ఎస్. ఇంకా మూడేళ్ళ టైం ఉన్నందున ఇప్పట్నుంచే మొదలుపెడితే… అప్పటికి తిరిగి జనం మనసులో స్థానం సంపాదించవచ్చన్నది పార్టీ పెద్దల ప్లాన్‌గా తెలుస్తోంది. అందుకోసం ఇక డైరెక్ట్‌గా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగడంతో… ఇక పొలిటికల్ సెగలు మొదలైపోయినట్టేనని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. తాజాగా పార్టీ నేతలతో భేటీ అయిన కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో మరో ఉద్యమానికి తెర లేపాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల చుట్టూ… సరికొత్త చర్చలు మొదలయ్యాయి. గతంలో రాష్ట్ర సాధన ఉద్యమానికి నీళ్ళు, నిధులు, నియామకాలే ప్రధాన అజెండాగా ఉండేది. అందులో కూడా అన్నిటికంటే ఎక్కువగా నీళ్ల సెంటిమెంట్‌ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ చేయగలిగారన్నది విస్తృతాభిప్రాయం. రాష్ట్ర సాధన తర్వాత కూడా అదే ఊపుతో అధికారంలోకి వచ్చింది బీఆర్‌ఎస్. రెండు టర్మ్‌ల అధికారం తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చేసింది గులాబీ పార్టీ. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టడానికి కలిసి వచ్చే అన్ని అంశాలను వెతుకుతోందట గులాబీ అధిష్టానం.
అందులో భాగంగానే మళ్లీ సెంటిమెంట్ అస్త్రానికి పదును పెట్టే ప్లాన్‌లో కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో గ్రామాల్లో, ముఖ్యంగా రైతులు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఉండడం వల్లే రూరల్ ప్రాంతంలో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయిందన్న అభిప్రాయం అందరిలో ఉంది. అందుకే… పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకుంటూ…. అదే గ్రామీణ ప్రాంత, అదే రైతులకు తిరిగి దగ్గరయ్యే ప్రయత్నాలను మొదలు పెట్టారట. అందులో భాగంగానే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి సంబంధించిన కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నారట. తెలంగాణ రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు కేసీఆర్. రైతుల కోసం తిరిగి ఉద్యమ బాట పట్టాలని, అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సభల ద్వారా తిరిగి నీళ్ల సెంటిమెంట్‌ను రగిల్చి రైతులకు దగ్గర కావాలన్న ప్రయత్నం మొదలైందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణలో కీలక జిల్లాలుగా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం, రైతులకు దగ్గరవడం లాంటివి కలిసి వస్తాయన్నది బీఆర్‌ఎస్ పెద్దల లెక్క. అందుకే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అంటూ….బహిరంగ సభల్లో నీళ్ళ అంశాన్నే హైలైట్ చేయబోతున్నట్టు సమాచారం. గతంలోని సక్సెస్ ఫార్ములానే మరోసారి తెర మీదికి తెచ్చి… రాజకీయంగా తిరిగి సత్తా చాటాలన్నది గులాబీ ప్లాన్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి…. ఈ టైంలో కచ్చితంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్నది కేసీఆర్ లెక్క అట. అయితే దీనికి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్‌లో మరో రకమైన అభిప్రాయం కూడా ఉంది. అది అప్పట్లో వర్క్ అయిన ఫార్ములా. మళ్ళీ ఇప్పుడు అలాగే ఎఫెక్టివ్‌గా ఉంటుందా లేదా అన్నది ఫీల్డ్‌లోకి వెళ్తేగానీ తెలియదని అంటున్నారు. జనవరిలో పెట్టబోయే తొలి బహిరంగ సభతో నీళ్ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
