Site icon NTV Telugu

Off The Record : త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కుదుపు ఉంటుందా..?

Brs

Brs

కారు పార్టీ విషయంలో కర్మ రిటర్న్స్‌ అన్న నానుడి నిజమవబోతోందా? నీవు నేర్పిన విద్యయే కదా… నీరజాక్షా అంటూ… గులాబీ అస్త్రాన్ని రివర్స్‌లో ప్రయోగించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోందా? అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ సిద్ధమవుతోందా? కొత్త ఎత్తుగడకు బీజం పడుతోందా? ఇంతకీ ఏంటా అస్త్రం? ఎలా వాడబోతోంది అధికార పార్టీ? ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగాక….2014 నుంచి 2023 వరకు… తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించింది బీఆర్‌ఎస్‌. మొదటి విడత పవర్‌లోకి వచ్చినప్పుడు టీడీపీ, రెండో సారి అధికారం చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కారెక్కించేసుకుంది. ఓవర్‌లోడ్‌ అయినా సరే… డోంట్‌ కేర్‌ అన్నట్టుగా రెండు సార్లు ఏకంగా ఆ రెండు పార్టీల ఎల్పీనాల విలీనాలే జరిగిపోయాయి. ఆయా పార్టీల శాసనసభ పక్షంలో ఉన్న మెజారిటీ సభ్యులను చేర్చుకుని… లెజిస్లేచర్‌ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు వాళ్ళతోనే స్పీకర్‌కు లేఖ ఇప్పించారు. దాని మీద స్టాంప్‌ పడ్డ వెంటనే…అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎల్పీలు నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో విలీనం అయిపోయాయి. అయితే… కర్మ రిటర్న్స్‌ అన్నట్టుగా… ఇప్పుడు గులాబీ పార్టీనే… ఆ స్థితిలోకి వచ్చిందని అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఆ పని జరిగిపోతుందని చెప్పుకున్నా… కోర్ట్‌ కేసులతో పాటు రకరకాల రాజకీయ కారణాలతో అది ఆగిపోయింది. పది మంది ఎమ్మెల్యేలు కారు దిగేసి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు.

ఆ పది మంది మీద అనర్హత వేటేయాలంటూ కోర్ట్‌ మెట్లు ఎక్కింది బీఆర్‌ఎస్‌. అయితే… ఆ నిర్ణయాన్ని తాము తీసుకోలేమంటూ… తిరిగి బంతిని అసెంబ్లీ స్పీకర్‌ గ్రౌండ్‌లోకే నెట్టింది సుప్రీం కోర్ట్‌. కానీ… ఏళ్ళకు ఏళ్ళు గడిపేయకుండా… మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్‌…. పాత ఆలోచనలకు పదును పెట్టబోతోందా అన్న అనుమానాలు వస్తున్నాయట పరిశీలకులకు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా… అన్నట్టుగా అంతకు ముందు రెండు టర్మ్స్‌లో బీఆర్‌ఎస్‌ వేసిన స్కెచ్‌ని తిరిగి ఆ పార్టీకే అప్లయ్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా ఎల్పీ విలీనాన్ని అదే స్కెచ్‌తో కొట్టాలనుకుంటున్నట్టు డౌట్స్‌ వస్తున్నాయి.

పైగా… పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని కాస్త తరచి చూస్తే… అదే అర్ధం ధ్వనిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇంకా కొంత మంది గులాబీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది పీసీసీ. మరోవైపు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కుటుంబ తగాదాలు ఉన్నాయన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నాయకత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ఇటు కేసీఆర్‌ని మినహాయిస్తూనే… చాలా విషయాల్లో బీఆర్‌ఎస్‌ విధానాలను విమర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే… బీసీ రిజర్వేషన్‌ లాంటి అంశాల్లో పార్టీ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ వివాదాలు, గందరగోళం నడుమ క్యాడర్‌లో కూడా మునుపటి జోష్‌ కనిపించడం లేదన్నది పరిశీలకుల మాట. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న ఎనమ్మెల్యేలు సైతం ఉన్నారట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అని ఫీలవుతున్న కొందరు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది గులాబీ వర్గాల్లో. దీంతో… కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే అదును అని భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

ఇప్పటికే 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమవైపునకు వచ్చేయగా…. ఇంకో పది మందికి పైగా లాక్కుంటే…ఇక ఆల్‌ సెట్‌… అస్సలు సమస్యే ఉండదు, ఫిరాయింపుల గోల పోతుందని లెక్కలేసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇంకో పది మందికి పైగా గోడ దాటించేస్తే… బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేసేసుకోవచ్చని, సుప్రీం కోర్ట్‌ గడువు పెట్టిన మూడు నెలల్లోపు ఆ పని చేసేస్తే… ఇక అనర్హత సమస్యలు కూడా ఉండబోవని కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్‌ కూడా అదేపని చేసింది కాబట్టి… ఇప్పుడు తాము కూడా సేమ్‌ స్కెచ్‌ అప్లయ్‌ చేస్తే… రాజకీయంగా కూడా ఇబ్బంది ఉండబోదని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఒకవేళ బీఆర్‌ఎస్‌ రచ్చ చేసినా… గతంలో మీరు చేసిందేంటని రివర్స్‌ అటాక్‌ చేయవచ్చన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది.

అరాకొరా చేరికలు కాకుండా… మొత్తం ఎల్పీని విలీనం చేసుకుంటే… ఇబ్బంది ఉండకపోవడంతో పాటు… కేసీఆర్‌కి కూడా తెలిసివస్తుందని కాంగ్రెస్‌ పార్టీలోని ఓ వర్గం నేతలు గట్టిగా భావిస్తున్నారట. సుప్రీంకోర్ట్‌ విధించిన మూడు నెలల గడువును అసలు చర్చకే రాకుండా చేయాలంటే ఈ ఎత్తుగడే కరెక్ట్‌ అని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే… అదే సమయంలో… మారో మాట కూడా వినిపిస్తోంది కాంగ్రెస్‌ సర్కిల్స్‌లో. బీఆర్‌ఎస్‌ చేసినపనే… రేవంత్‌రెడ్డి చేస్తున్నారనే చర్చకు అవకాశం ఇచ్చినట్టవుతుందని, అది అవసరమా అని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా… తెలంగాణలో త్వరలోనే ఏదో ఒక రూపంలో పొలిటికల్‌ ప్రకంపనలు రావడం మాత్రం ఖాయమంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. పీసీసీ అధ్యక్షుడు అంటున్నట్టు ఇంకెంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు? ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్టు నిజంగానే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎల్పీ విలీనం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే… గూలాబీ బాస్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందన్న విషయాలు ఆసక్తిగా మారాయి.

 

Exit mobile version