వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకున పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలో సడన్‌గా అంత మార్పు ఎందుకొచ్చింది? అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్న నేతకు ఉన్నట్టుండి పార్టీ మీద ప్రేమ ఎందుకు పొంగి పొర్లింది? అదీకూడా శృతిమించి పొర్లిపోయి…. మరో కొత్త వివాదానికి దారి తీయడం వెనకున్న రీజనేంటి? ఎవరా అధికార పార్టీ ఎమ్మెల్యే? ఏంటాయన ప్రేమ్ కహానీ? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇటీవల ఆయన వరుసబెట్టి చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు కారణం. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన బోండా… ఇప్పుడు సడన్‌గా పార్టీ మీద ప్రేమ అంటూ చేస్తున్న హంగామా డ్యామేజ్ కంట్రోల్‌లో భాగమేనా అనే చర్చలు నడుస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల్లో రెండోసారి ఆయన గెలవడం, జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రావడంతో గట్టిగా ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఎమ్మెల్యే వ్యవహార శైలి పార్టీని ఇరుకున పెడుతోందంటున్నారు. తనకు మంత్రి పదవి రాకపోవటం ఒక ఎత్తయితే…. వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి వంటి కొందరికి మంత్రి పదవులు దక్కడాన్ని ఆయన అస్సుల జీర్ణించుకోలేకపోతున్నారట. అందులో భాగంగానే ఇటీవల బహిరంగ వేదిక మీదే అసంతృప్తి వెళ్ళగక్కినట్టు తెలిసింది. ఇక ఆ తర్వాత ముద్రగడ సంస్మరణ సభలో సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయింది. ఆయన్ని పిలిచి వివరణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం, టూ మెన్ కమిటీకి బోండా క్లారిఫికేషన్ ఇవ్వడం తర్వాతి పరిణామాలు. ప్రత్యేకించి మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడాన్ని టీడీపీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారట. ఇక ఆ ఎపిసోడ్ తర్వాత తన ఇద్దరు కుమారులతో కసిని బోండా ఉమా.. సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారట. ఆ మరుసటి రోజే…. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహించిన ధర్నా దగ్గరికి వెళ్ళడం, టెంటు పీకేయడం లాంటి వ్యవహారాలతో రచ్చ రచ్చ అయింది.
సరిగ్గా ఈ పాయింట్ మీదే కొత్త చర్చ మొదలైంది. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించినా… విజయవాడ సెంట్రల్ పరిధిలోనే ఎందుకు సీన్ సితారైందని అంటే… బహుశా డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు బోండా ఉమా చేసిన ప్రయత్నం వల్లే కావచ్చన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా… మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో కాపుల గొంతు కోశారంటూ కామెంట్ చేశారని గుర్తు చేస్తున్నారు కొందరు. ఆ తర్వాత 2019లో ఓడిపోవడంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. ఇక 2024లో ఆయన గెలిచినా… సొంత పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనకుండా సైలెంట్‌గా ఉన్నారు.అయితే ముద్రగడ సంస్మరణ సభలో కాపుల్లో అలజడి అంటూ బోండా చేసిన వ్యాఖ్యల్ని గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఆ డ్యామేజ్‌ని సరిద్దుకునే క్రమంలోనే వైసీపీ కార్యక్రమంలో రచ్చ చేసి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడు సిద్ధార్థని విజయవాడ మేయర్‌ని చేయాలన్న ఆలోచనలో ఉన్నారట ఎమ్మెల్యే. అందుకే అధిష్టానం ఆశీస్సులు పొందడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన డ్యామేజ్‌ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వైసీపీ శిబిరంపై అటాక్ చేసి ఉండవచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో…. వచ్చే ఎన్నికల్లో బోండా ఉమాకు టిక్కెట్ ఇవ్వరని, గుర్తింపు కోసమే ఇలా దాడులు చేస్తున్నారని మాజీ మంత్రులు అంబటి, వెలంపల్లితోపాటు మల్లాది విష్ణు విమర్శిస్తూ…. ఇరుకున పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే…. ఉమా మాత్రం తనకు అధినేత దగ్గర కొత్తగా మార్కులు అక్కర్లేదని తానేంటో ఆయనకు తెలుసు కాబట్టే… మూడు సార్లు టికెట్ ఇచ్చారని అంటున్నారు. వైసీపీ నేతల ఓవరాక్షన్ వల్లే ఇదంతా చేశాను తప్ప కొత్తగా గుర్తింపు కోసం కాదు అని సన్నిహితులతో అంటున్నారట. ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకో టర్న్ తీసుకుంటుందా అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.

