Site icon NTV Telugu

Off The Record : ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫేవరెట్ స్పాట్గా హైదరాబాద్!

Tdp Otr

Tdp Otr

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ… శని, ఆదివారాల్లో అక్కడ ఉండబుద్ది కావడం లేదా? అంతా… శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ బాట బట్టి అనుభవించు రాజా… అంటున్నారా? వేషాలు మార్చేసి క్లబ్బులు, పబ్బులు అనే బ్యాచ్‌ ఒకటైతే… మనది ఈకెండ్‌ యాపారం అంటూ…. ఇంకో బ్యాచ్ దుకాణాలు ఓపెన్‌ చేస్తోందా? అసలేంటీ తతంగం? సీఎం ఎంత మొత్తుకుంటున్నా…సర్కార్‌లో ఎవ్వరికీ అర్ధం కావడం లేదా?

అమరావతిలో ఏముంది బాసూ……. భాగ్యమంతా భాగ్యనగరిలోనే ఉంటేనూ….. అక్కడైతే… ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు… అనుభవించేయొచ్చు. దుమ్ము దులిపేయవచ్చు. ప్రస్తుతం ఏపీ సర్కార్‌లోని చాలామంది మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల మధ్య ఇవే చర్చలు జరుగుతున్నాయట. చర్చలేం ఖర్మ… వీకెండ్‌ వస్తే చాలు… అంతా బై రోడ్‌ ఆర్‌ ఎయిర్‌…. హైదరాబాద్‌లో వాలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పేరుకు శని, ఆది వారాలైనా… అసలు శుక్రవారం సాయంత్రం నుంచే ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు రోజులు చేయాల్సిన పనులన్నీ చేసేసి… సోమవారం ఉదయం తిరిగి అమరావతి బాట పడుతున్నారట. పాలనాపరంగా, రాజకీయంగా ఇది చాలా క్లిష్టమైన సమయం, అంతా అలర్ట్‌గా ఉండాలి, విహార యాత్రలు, తానా సభలంటూ టూర్స్‌కు వెళ్ళవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతలా మొత్తుకుంటున్నా… వీకెండ్‌ వస్తే చాలు… వీళ్ళు మాత్రం డోంట్ కేర్ అంటున్నట్టు సమాచారం. కేవలం టీడీపీ నాయకులే కాదు.. వైసీపీ, జనసేన లీడర్స్‌కు వీకెండ్ స్పాట్ అంటే హైదరాబాదేనన్నది వాస్తవం అంటున్నారు.

పవర్‌లోలేని వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… అధికారం ఉండి, భుజాల మీద బాధ్యతలు మోస్తూ… సీఎం హెచ్చరిస్తున్నా కూడా అంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా? మరీ అంత లెక్కలేనితనమా అంటూ గుసగులలాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ వ్యవహారంలో కాస్త లోతుల్లోకి వెళ్ళి చూస్తే… కొత్త కొత్తవి, సంచలన విషయాలు బయటికి వస్తున్నాయట. రాష్ట్రానికి చెందిన ఒక మంత్రిగారు శని,ఆదివారాలు తప్పకుండా హైదరాబాద్‌లో అటెండెన్స్‌ వేయించుకుంటూ… పేకాట శిబిరాల్లో బిజీ అయిపోతున్నారట. మరో ముగ్గురు మంత్రులు ఇప్పుడున్న వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, ఫార్మా కంపెనీలను, ఇతర వ్యాపారాలను రివ్యూ చేసుకోవడానికి శుక్రవారం రాత్రికే ఛలో హైదరాబాద్‌ అంటున్నట్టు సమాచారం. శని, ఆదివారాల్లో పనులన్నీ చక్కబెట్టుకుని..సోమవారం పొద్దున్నే ఫ్లైటు లేదా బై రోడ్ విజయవాడ చేరుకుంటారట. కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అయితే… ఏకంగా గన్ మెన్‌ను కూడా వదిలేసి ప్రతివారం హైదరాబాద్‌ వెళ్ళి సేదదీరుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలైతే వారానికి మూడు రోజులు హైదరాబాలోనే మకాం అట. అన్ని పార్టీల నేతలది ఇదే తీరు.

చాలామందికి హైదరాబాద్ లోనే స్థిర నివాసాలు ఉండటంతో నియోజకవర్గాలను వదిలి ఇక్కడే ఉంటున్నారు. వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్ మెంట్లు, నిర్మాణాలు ఇతర వ్యవహారాలతో హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అంతేకాదు.. హెల్త్ చెకప్ లు , ఇతర అవసరాలకు హైదరాబాద్ నే ఎంచుకుంటున్నారు. కొందరైతే వీకెండ్‌లో కాస్ట్యూమ్స్ మార్చి పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతున్నారని సమాచారం. అలా ఎవరికి వారు…. ఉయ్ లవ్ హైదరాబాద్….. ఎస్…మాకు హైదరాబాద్ అంటే. మహా మక్కువ అంటూ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్ళకు అధికారం ఏపీలో కావాలి… ఎంజాయ్‌మెంట్‌కు మాత్రం హైదరాబాద్‌ వెళతారా అంటూ గుసగుసలాడుకుంటున్నారట.

Exit mobile version