OTR : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమిలో తేలని సీట్ల పంచాయితీ.. జనసేన వర్సెస్ టీడీపీ

Otr

Otr

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఎందుకు ఆలస్యం అవుతోంది..? లోకల్ బాడీస్‌కు కూడా మూడు రోజుల పాటు చర్చలు ఎందుకు అవసరం అయ్యాయి. సీట్ల సర్దుబాటు విషయంలో అనిశ్చితి ఎక్కడ ఉంది. జనసేన ఏం అడుగుతోంది..? టీడీపీ ఏం ఇస్తానంటోంది..? బీజేపీకి ఏం కావాలి..? ఏపీలో ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. 16 నుంచే నామినేషన్లు మొదలు కానున్నాయి. నామినేషన్లకు కూడా అట్టే టైమ్‌లేదు. నామినేషన్ల ప్రక్రియ 3 రోజులే. అయినప్పటికీ అధికార కూటమిలో ఇంకా సీట్‌ షేరింగ్‌ ఇంకా కొలిక్కిరాలేదు. ఎందుకీ ఆలస్యం అనే చర్చ కూటమి నేతలతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా జరుగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పని చేయాలి… అన్ని చోట్లా విజయ ఢంకా మోగించాలని పదే పదే చెబుతున్నారు. కానీ సీట్ల సర్దుబాటులో మాత్రం తర్జనభర్జనలు పడుతున్నారు. జనసేన 6 మేయర్‌, 35 మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవులు కావాలని మొదట్నుంచీ పట్టుబడుతోంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటోంది. సీఎం చంద్రబాబును కలసిన పవన్‌ కళ్యాణ్‌… తమకు కావాల్సిన సీట్ల వివరాలు ఇచ్చారు. కానీ జనసేన ఆశించిన స్థాయిలో టీడీపీ నుంచి స్పందన లేదు. 6 కార్పొరేషన్‌లు కష్టం… మూడింటితో సరిపెట్టుకోవాలని టీడీపీ చెబుతోంది. మున్సిపాలిటీలు కూడా 35 కాదు 20 అని టీడీపీ తేల్చి చెప్పిందట. టీడీపీ ప్రతిపాదనపై జనసేనాని పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఒకానొక దశలో ఫ్రెండ్లీ కంటెస్ట్ లేదా ఎవరికి నచ్చినట్లు వారు పోటీ చేద్దాం అని కూడా జనసేన భావించినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ సీఎం చంద్రబాబుతో చర్చలు ప్రారంభం అయ్యాయి. జనసేనకు 3 కాదు 4 కార్పొరేషన్‌లు అని చెప్పినట్టు సమాచారం. 25 మున్సిపాలిటీలు ఫైనల్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ జనసేన అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

2024 ఎన్నికల పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు అని జనసేన పదే పదే చెబుతోంది. అందుకే సీట్ల సర్దుబాటులో సాధారణ ఎన్నికల తరహాలో రేషియోలా కాకుండా తమకు నచ్చిన స్థానాలు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోందట. జనసేన ప్రతిపాదనలపై టీడీపీలోనూ చర్చ జరిగింది. జనసేనకు 6 మేయర్‌ పదవులు, బీజేపీకి 1 ఇస్తే ఇక టీడీపీకి మిగిలేదేంటి..? 10 మేయర్ స్థానాలు మాత్రమే. అంత తక్కువ స్థానాల్లో మనం పోటీ చేయాలా..? అనే చర్చ టీడీపీలో హాట్‌ హాట్‌గా జరిగిందట. జనసేన అడిగిన 6కు బదులు మధ్యేమార్గంగా 4 మేయర్‌ పదవులు మాత్రమే ఇవ్వగలమని టీడీపీ చెప్పినట్టు సమాచారం. తాజా లెక్కలపై జనసేనలో కూడా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ పొత్తు ధర్మం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. జనసేన ఎక్కువ సీట్లు అడగడం ఒకటైతే… టీడీపీ కేడర్, ద్వితీయ శ్రేణి నేతలు, నేతల వారసులు స్థానిక ఎన్నికలపై ముఖ్యంగా మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌ పదవులపై ఆశలు పెట్టుకోవడంతో సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతూ వస్తోందని తెలుస్తోంది. జనసేన అడిగినన్ని సీట్లు ఇస్తే టీడీపీలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందట. అందుకే ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చిందట. సీట్ల సర్దుబాటు విషయంలో తగ్గితే… కేడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయం ఆ పార్టీలో ఉందట. అందుకే అడిగినన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పిందట. అందుకే ఇంతగా ఆలస్యం అవుతోందనే మాట వినిపిస్తోంది. మరి సీట్‌ షేరింగ్‌ ఎప్పటికి ఫైనల్‌ అవుతుందో..? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో..? బీజేపీకి ఎన్ని దక్కుతాయో..? టీడీపీ ఎన్నింటిలో పోటీ చేస్తుందో చూడాలి.