ఏపీలో తాజాగా బయటపడ్డ నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి అసలు పార్టీలోకి ఎలా వచ్చారు? పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడైన వ్యక్తికి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండానే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారా? అలా ఆయన్ని ప్రభావితం చేసిందెవరు? ఇప్పుడు వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి? మేం మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం…. మీకే బుర్రకెక్క లేదు. ఈక్వేషన్లు, పోల్ మేనేజ్‌మెంట్ అంటూ… ఏవేవో కాకి లెక్కలు చెప్పి, మమ్మల్ని మభ్యపెట్టి ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి గెలిచే సీటును పోగొట్టుకున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నకిలీ మద్యం మకిలి అంటించుకోవాల్సి వచ్చిందంటూ… టీడీపీ పెద్దల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు. మొదట్నుంచి వివాదాస్పదంగా ఉన్న తంబళ్ళపల్లె నియోజకవర్గం పార్టీ వ్యవహారాలు మరోసారి తలనొప్పిగా తయారవడంతో…. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకల్లా పరిస్థితి మారిపోయిందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు ఇక్కడ అభ్యర్థి కోసం తంటాలు పడగా… ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరో రకమైన తలనొప్పులు మొదలవుతున్నాయట.
తాజాగా నకిలీ మద్యం తయారీ వ్యవహారం మొత్తం ఈ నియోజకవర్గం కేంద్రంగా జరగడం, ముఖ్యంగా ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతుండటంతో అసలెక్కడ తేడా జరిగిందని ఆరా తీస్తున్నాయి టీడీపీ వర్గాలు. కొందరైతే… బాగా లోతుల్లోకి వెళ్తుండగా… అలాంటి వాళ్ళకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయట. ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే సీట్లకుగాను 12 చోట్ల గెలిచింది కూటమి. కేవలం పెద్దిరెడ్డి బ్రదర్స్ పోటీచేసిన తంబళ్లపల్లి, పుంగనూరులో మాత్రమే గెలిచింది వైసీపీ. ఇప్పుడు దీన్నే తప్పుపడుతున్నారట చిత్తూరు తమ్ముళ్ళు. ఈ రెండిటిని కూడా గెలిచేవాళ్ళమని, తంబళ్ళపల్లిలో అయితే కేవలం అభ్యర్థి ఎంపికలో లోపం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్ళని కాదని, ఎన్నికలకు ఆరేడు నెలల ముందు పార్టీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన జయచంద్రారెడ్డికి నాడు టిక్కెట్ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. ఆ నిర్ణయాన్ని నాడే జిల్లా పార్టీ మొత్తం వ్యతిరేకించింది.
జయచంద్రారెడ్డి మొదట్నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వీర విధేయుడని, ఎంపీ మిథున్‌రెడ్డికి, జయచంద్రారెడ్డికి ఉమ్మడిగా ఉగాండాలో లిక్కర్ వ్యాపారం ఉన్నట్టు చెప్పుకొచ్చారు తమ్ముళ్ళు. అలాంటి వ్యక్తికి టీడీపీ టిక్కెట్ ఇవ్వమేంటంటూ.. ఒక దశలో ధర్నాలు కూడా చేశారు. అయినా… అవేమీ పట్టించుకోని తెలుగుదేశం పార్టీ పెద్దలు…ఫస్ట్ లిస్ట్‌లోనే తంబళ్ళపల్లెకు జయచంద్రారెడ్డి పేరు ప్రకటించారు. అయినా కాంప్రమైజ్ అవ్వని కేడర్… పెద్దిరెడ్డి కుటుంబసభ్యులతో వివిధ సందర్భాల్లో జయచంద్రారెడ్డి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఆయనకు బీఫారం ఇవ్వకుండా కొన్నాళ్ళు హోల్డ్‌లో పెట్టి ఇక గడువు ముగుస్తుండగా చివరి క్షణంలో ఇచ్చేశారు టీడీపీ ముఖ్యులు. కానీ…టిక్కెట్ వచ్చే వరకు స్పీడ్‌గా ఉన్న జయచంద్రారెడ్డి నామినేషన్ల పరిశీలన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ తగ్గించేశారట. దాని వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆదేశాలు ఉన్నాయని ఇప్పటికీ మొత్తుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. చివరికి పోలింగ్ రోజు పలు మండలాల్లో ఏజెంట్లను కూడా పెట్టకుండా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయానికి జయచంద్రారెడ్డి పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇన్ని వివాదాల మధ్య తంబళ్ళపల్లెలో పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తయితే…. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనం అయిన ములకల చెరువు నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఇంకా ఇరుకున పెడుతోందట.
ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది జయచంద్రా రెడ్డి అనుచరులే కావడంతో మేం ఎటూ మాట్లాడలేకపోతున్నామని తలలు బాదుకుంటున్నారట తంబళ్ళపల్లె పాత టీడీపీ నాయకులు. ఈ స్కామ్ బయటపడగానే…వెంటనే స్పందించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించినా… అసలు పెద్దిరెడ్డి కుటుంబ వీరవిధేయుడు టీడీపీలోకి ఎలా, ఎందుకు ఎంటరయ్యారు? ఆరేడు నెలల్లోనే టిక్కెట్ ఎలా తెచ్చుకోగలిగారన్న అంశం చుట్టూ… హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి నియోజకవర్గంలో. చంద్రబాబును అంతలా ప్రభావితం చేసిన ఆ వ్యక్తులు ఎవరంటూ ఆరా తీస్తున్నారు పార్టీ లీడర్స్. ఈ క్రమంలోనే…. తంబళ్ళపల్లెలో తీగ లాగిన కొందరికి పల్నాడు జిల్లాలో డొంక కనిపిస్తోందట. జయచంద్రారెడ్డి పార్టీలోకి ఎంటరవడానికి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లైన్ క్లియర్ చేసినట్టుగా అనుమానిస్తున్నారట ఎక్కువ మంది టీడీపీ లీడర్స్. దీంతో అసలు వీళ్ళిద్దరి లింక్ ఎక్కడన్నది ఇప్పుడు ఇంకో చర్చ. అలాగే జయచంద్రారెడ్డి సామాజికవర్గమైన మురుసు కాపులు తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని, గెలుపు గ్యారంటీ అంటూ చంద్రబాబును నమ్మించినట్టు చెప్పుకుంటున్నారు.
ఇక ఇక్కడ బలమైన అభ్యర్థి, బలమైన అభ్యర్థి అంటూ తెగ వెదికేస్తున్న చంద్రబాబు కూడా….జయచంద్రారెడ్డి ముందుకు వచ్చి నేను రెడీ అనడంతో వెనకా ముందూ ఆలోచించకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా టిక్కెట్ ఇచ్చేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ నిష్టూరంగా మాట్లాడుకుంటున్నారట లోకల్ టీడీపీ లీడర్స్. ఇక్కడే ఇంకొన్ని రకాల ఈక్వేషన్స్ కూడా వినిపిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు కూడా…జయచంద్రారెడ్డిని రికమండ్ చేసినట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్, సామాజిక సమీకరణలు అంటూ… అప్పట్లో పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ టీమ్ కూడా రికమండ్ చేసినట్టు చర్చించుకుంటున్నారు తమ్ముళ్ళు. రాబిన్ శర్మ టీంలోని కొందరు వ్యక్తులు చేసిన పనుల కారణంగా జయచంద్రారెడ్డికి అప్పుడు లైన్ క్లియర్ అయినట్టు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సరే…జయచంద్రారెడ్డి కోసం ఇంతమంది పనిచేశారు. అంతా ఊరికే చేశారా? ఎక్కడో ఏదో ఒక కామన్ లింక్ ఉండాలి కదా అన్న ప్రశ్నకు ఎస్ ఉందన్న సమాధానం వస్తోంది కొన్ని వర్గాల నుంచి. ఎవరు ప్రలోభపడ్డారు, ఎవరు నిజాయితీగా ఉన్నారన్న విషయం బయటికి తెలియదుగానీ… టీడీపీ పెద్దలకు తన గురించి మంచిగా చెప్పి పార్టీలోకి లైన్ క్లియర్ చేయించడానికి జయచంద్రారెడ్డి మాత్రం అప్పట్లో పెద్ద ఆఫరే ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు వందల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ వ్యాపారం ఉందని, అధికారంలోకి రాగానే అందులో వాటా ఇస్తానని ఆశ చూపారట ఆయన. మరి అది వర్కౌట్ అయిందో లేదో, ఆ ఆఫర్‌కు నేతలు టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు, అందులో ఫలానా వాళ్ళు తప్పు చేశారని అనడానికి సాక్ష్యాల్లేవు. కానీ…జయచంద్రారెడ్డి రాజేసిన కుంపటి తాలూకు సెగ మాత్రం టీడీపీకి గట్టిగానే తగులుతోంది.
