ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఐక్యతపై సందేహాలున్నాయా? ఏ డౌటూ లేకుంటే… ఒకే మాట పదే పదే ఎందుకు వినిపిస్తోంది? కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహా బలం అంటూ మూడు పార్టీల ముఖ్యులు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎందుకు చెబుతున్నారు? తేడాలు నిజమే అయితే…. ఏ రూపంలో? వాటి ప్రభావం ఎంత? విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉండాలన్నది ఓ ఫార్ములా. ఏపీలో కూటమి పెద్దలు ఇప్పుడీ ఫార్ములానే పక్కాగా ఫాలో అవుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయట చాలా మందికి. అయితే… అదేదో ప్రభుత్వ పనితీరుకు సంబంధించో, మరో దాని గురించో కాదు. వాటన్నిటికంటే ముఖ్యమైన కూటమి ఐక్యత గురించేనని చెప్పుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కాలంలో… మూడు పార్టీల పెద్దలంతా ఎక్కువగా మాట్లాడింది ఐకమత్యం గురించేనని అంటున్నారు పరిశీలకులు. అంతా సవ్యంగా ఉంటే… అదే పదాన్ని పదేపదే ఎందుకు చెబుతున్నారన్న సందేహాలు క్రమంగా పెరుగుతున్నాయట. మొదటి ఏడాదిని వదిలేస్తే… ఆ తర్వాత నుంచి అటు ఎమ్మెల్యేల పనితీరు..ఇటు కూటమి ఐక్యత గురించే రాజకీయ వర్గాల్లో రకరకాల సందేహాలు. అందుకు తగ్గట్టే…. సీఎం చంద్రబాబు సైతం కూటమి ఐక్యతను దాదాపు ఆ సంబంధిత ప్రతి సందర్బంలోనూ ప్రస్తావిస్తున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా…. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి నేతలు ఐక్యంగా ఉండాలని చెబుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీదే సందేహాలు పెరుగుతున్నాయట. సాధారణంగా…. మనకు ఏది లేదో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటామని, ఆ లెక్కన చూసుకుంటే… కూటమిలో ఐకమత్యం పాళ్లు తగ్గాయా అన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు పరిశీలకులు. రెండేళ్లకే…..కూటమి ఐక్యతపై అంతలా ఎందుకు మాట్లాడుతున్నారన్న చర్చ వివిధ వర్గాల్లో మొదలైందట. పైన సంబంధాలు ఎలా ఉన్నా…. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంతమంది నేతల మధ్య సఖ్యత సరిగా లేదని… కొన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య ఇబ్బందికర వాతావరణం ఉందని గ్రహించిన పెద్దలు అది మురకుండా ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
స్థానిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఐక్యతకు సంబంధించి డౌట్స్ పెరుగుతున్నాయట. ఇక అదే సమయంలో సీఎం చంద్రబాబు బహిరంగ సభ వేదిక మీదే… జనం ముందే జనసేన ఎమ్మెల్యేలను విమర్శించడం కూడా ప్రస్తావనకు వస్తోందట. ఎమ్మెల్యేల వైఖరి, పనితీరు మీద మాట్లాడేందుకు సీఎంకు సర్వ హక్కులు ఉంటాయని… కానీ…. అదే సమయంలో భాగస్వామ్య పక్ష ఎమ్మెల్యేలన్న సంగతిని విస్మరించకూడదన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ప్రత్యేకించి కూటమి ఐక్యతకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో ఆ తరహా కామెంట్స్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ఒక్క టీడీపీనే కాదు, జనసేన, బీజేపీ ముఖ్యుల నోటి నుంచి కూడా ఎక్కువగా ఐక్యత ప్రస్తావనే వస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల సర్దుబాట్లు కూడా ఇబ్బందికరంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో టీడీపీ, జనసేన లోకల్ లీడర్స్ మధ్యనే ఎక్కువ తేడాలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా కూటమి పెద్దలు ఐక్యత గురించి ఎక్కువగా మాట్లాడుతుండవచ్చని అంటున్నారు. చెప్పుకుంటూ పోతే… వివిధ అంశాల్లో మూడు పార్టీల నాయకుల మధ్య చాలా అంశాల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని అంటున్నారు. దాని ప్రభావం లోకల్ ఎన్నికలపై పడుతుందనే చర్చ జరుగుతోంది… అందుకే సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టింగ్స్ పై కూడా కూటమి అలర్ట్ అవుతోందంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే… మూడు పార్టీల మధ్య సమన్వయం విషయంలో ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించడం వల్లే పెద్దలు పదేపదే ఐకమత్యం మాటలు మాట్లాడుతున్నారన్నది పొలిటికల్ ఒపీనియన్.

