రస్తుం మైన్స్ పార్ట్ టూ స్టార్ట్ అయిందా? క్లైమాక్స్ దిశగా పోలీసుల అడుగులు పడుతున్నాయా? మరో మాజీ మంత్రి కోసం పోలీస్ స్కెచ్ రెడీ అయిందా? ఇక ఏ క్షణాన్నయినా అరెస్ట్ వార్త వినే అవకాశం ఉందా? ఏంటా పార్ట్ టూ? ఎవరా మాజీ మంత్రి? నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెల్లరాళ్ళు ఎగిరి ఎటెటో తిరిగి… ఇప్పుడు అంతా ఊహిస్తున్న వైపే పడుతున్నాయట. మైనింగ్ బ్లాస్ట్‌కు ఎగిరొచ్చి పడుతున్న క్వార్ట్జ్ స్టోన్స్ నుంచి మరో మాజీ మంత్రి తప్పించుకుంటారా? లేక గాయాలు తప్పవా అన్న చర్చ జరుగుతోంది నెల్లూరు రాజకీయవర్గాల్లో. రుస్తుం మైనింగ్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా….మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అక్రమ మైనింగ్‌లో శ్రీకాంత్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారన్నది పోలీసుల అభియోగం. శ్రీకాంత్‌రెడ్డి… అనిల్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో… ఇక నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రేనా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఆ దిశలో పోలీసులు వ్యూహాత్మకంగా అుగులేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
శ్రీకాంత్ రెడ్డి నోటి నుంచే అనిల్ పేరు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. రుస్తుం సంస్థ మైనింగ్ ఏరియా ఉన్న పొదలకూరు మండల రెవెన్యూ అధికారుల సమక్షంలోనే…. పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించడంతో…. అయన మాజీ మంత్రులు ఇద్దరి పేర్లు చెప్పారట. అనిల్ కుమార్, కాకాణితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో…. క్వార్జ్ అక్రమ రవాణాలో అనిల్ పాత్ర మీద పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో… ఇక ఆయన వంతు వచ్చిందా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో. అటు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీసులు కూడా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతున్నారట. రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు. పెండింగ్ కేసులకు సంబంధించి వరుస రిమాండ్స్ పడుతున్నాయి.ఈ క్రమంలో ఇక అనిల్ వంతు కూడా వచ్చేసిందా అన్నది ప్రస్తుతం హాట్ సబ్జెక్ట్ అయింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైదాపురం, గూడూరు, ప్రాంతాలలో అనిల్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని, దాంతోపాటు పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ చేశారని, అందుకు శ్రీకాంత్ రెడ్డి సహకరించారన్నది పోలీసుల ప్రధాన అభియోగం. తన స్టేట్‌మెంట్‌లో శ్రీకాంత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారట. మైనింగ్‌లో వచ్చిన డబ్బుతో తాను, అనిల్, గూడూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో రియలెస్టేట్ వెంచర్స్ వేయడంతోపాటు కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా చేస్తున్నామని ఆయన చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఈ ఇద్దరు మాజీ మంత్రులు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు అనిల్ కుమార్ వ్యాపార వ్యవహారాల కోసం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాకాణి అరెస్టు తర్వాత ఆయన జిల్లా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చి టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో తాను కూడా మైనింగ్ చేశానని.. కానీ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చారాయన. ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పదేపదే ఆరోపించారు మాజీ మంత్రి.
దాంతోపాటు ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద కూడా ఆయన నోరు పారేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అటు అదే సమయంలో రుస్తుం మైన్స్ వ్యవహారంలో అనిల్ కుమార్ యాదవ్ హ్యాండ్ ఉందని టిడిపితో పాటు వైసీపీలోని ఓ వర్గం కూడా చెబుతోంది. ఈ పరిణామ క్రమంలో… శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా అనిల్ మీద కేసు పెడతారన్న టాక్ నడుస్తోంది. అలాగే… ఒక్క సారి కేసంటూ బుక్ చేసి అరెస్ట్ అయితే… కాకాణిలాగే వరుస కేసులు పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది నెల్లూరులో. జిల్లా నుంచి వైసీపీ తరపున గతంలో గట్టిగా వాయిస్ వినిపించిన అనిల్… ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. తిరిగి ఇప్పుడు స్వరం పెరుగుతున్న క్రమంలో…ఆయన్ని మళ్లీ టైట్ చేయవచ్చన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ వెనక అసలు టార్గెట్ అనిల్ కుమార్ యాదవేనన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా… మెల్లిగా సింహపురి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
