జిల్లా అధ్యక్షులు మారినా.. కో-ఆర్డినేటర్లు మారినా… మేం మాత్రం మారేదే లేదు. మేమింతే… అంటున్నారు ఆ రెండు నియోజకవర్గాల టీడీపీ నాయకులు. తాజాగా చేసిన సంధి వ్యవహారాలు కూడా బెడిసికొట్టాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న టైంలో… పార్టీ అధిష్టానాన్ని సైతం టెన్షన్ పెడుతున్న ఆ నియోజకవర్గాలు ఏవి? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని సెట్ చేసుకోలేకపోతోంది. ఎన్నికలకు ముందు నుంచి మొదలైన అంతర్గత కలహాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. క్రమంగా అవి ముదిరి అధిష్టానానికే తలనొప్పిగా మారుతున్నాయట. అలాంటి లిస్ట్ ముందు వరుసలో ఉన్నాయి….. శింగనమల, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలు. ముందు శింగనమలను తీసుకుంటే….. 2019లో ఇక్కడ బండారు శ్రావణికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి మొదలైన గొడవలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్ నాయకులకు, శ్రావణికి మధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో శ్రావణి ఎమ్మెల్యే అవడాన్ని కూడా నియోజకవర్గంలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. పదవులు, పనులు ఇలా… మేటర్ ఏదైనా సరే పేచీ మాత్రం కామన్ అయిందని అంటున్నారు. నిత్యం ఏదో ఒక వివాదం ఇక్కడ నడుస్తూనే ఉంది.
ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంతో మొదలైన విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఈ రెండు నియోజకవర్గాల్లో విబేధాలు సెట్ చేయాలని అధిష్టానం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ముగ్గురు కో-ఆర్డినేటర్లు మారినా.. రెండు నియోజకవర్గాల నేతల వైఖరిలో మాత్రం మార్పు లేదు. కోవెలమూడి నాని ఉమ్మడి జిల్లా జోనల్ కో-ఆర్డినేటర్ గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సఫలీకృతం కాలేదు.. ఆ తర్వాత దామచర్ల సత్యకు ఆ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆయన గట్టిగా వారం రోజులు కూడా ఉండలేదు. ఆ తర్వాత కడప జిల్లాకు చెందిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి జోనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. కడప జిల్లాలో ఆయన సమర్థవంతంగా పార్టీని లీడ్ చేస్తారన్న పేరు ఉంది. దాంతో… జిల్లాలో కూడా వీటిని సెట్ చేస్తారని అంతా భావించారు. కానీ ఇంతలో తనకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని ఆయనే అలకబూనారు. దాదాపు రెండు నెలలు జిల్లా వైపు చూడలేదు. ఆ తర్వాత రెండు నియోజకవర్గాల్లోని నేతలతో భేటీ అయ్యారాయన. అసంతృప్తిగా ఉన్న నేతలతోనూ, అలాగే ఎమ్మెల్యేలతో కూడా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
అంతా కలిసి పని చేస్తేనే భవిష్యత్ ఉంటుందని.. లేకపోతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. అలా ఆయన చేసిన హితబోధ రెండు చోట్ల నాయకులకు ఏమాత్రం ఎక్కినట్టు కనిపించడం లేదు. ఎప్పటిలానే ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు విభేదాలకు ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమను వ్యతిరేకిస్తున్న వారిని చేరదీస్తూ వారిని వెంటేసుకుని తిరగడంపై ఎమ్మెల్యేలు సైతం కోపంగా ఉన్నట్టు సమాచారం. గత 15రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య పంతం మరింత ముదిరినట్టుగా కనిపిస్తోంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తామేంటో చూపించే టైం వచ్చిందన్నట్టుగా రెబెల్స్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇటీవల కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి అందర్నీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం సెట్ కాలేదు. దీంతో వ్యవహారం మళ్లీ అధిష్టాన పెద్దల వరకు వెళ్లిందంటున్నారు. స్థానిక సంస్థల వేళ ఈ విబేధాలు ఇలాగే కొనసాగితే.. ఆ ప్రభావం చాలా గట్టిగా పడుతుందని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

