Site icon NTV Telugu

Off The Record : అంబటి రాంబాబు పోలీస్ రాడార్ పరిధిలోకి వచ్చేశారా..?

Ambati

Ambati

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వచ్చేశారా? ఆయన విషయంలో ఇన్నాళ్లు ఒక ఎత్తు… ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతోందా? అంబటికి కూడా అదే ఫీలింగ్‌ వచ్చేసిందా? ఎక్స్‌ మినిస్టర్‌ విషయంలో సడన్‌గా జరిగిన మార్పు ఏంటి? ఇన్నాళ్ళుగా లేనిది… ఇప్పుడెందుకు అరెస్ట్‌ భయాలు మొదలయ్యాయి? వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌ అంబటి రాంబాబు. పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… ఎప్పుడూ ఏదో ఒక ఎపిసోడ్‌తో వార్తల్లో నలుగుతుంటారాయన. ఈ మాజీ మంత్రి గట్టిగా నోరు తెరిస్తే… అవతలి వాళ్ళకు కౌంటర్‌ వేయడం కూడా కష్టంగానే ఉంటుందని మాట్లాడుకుంటాయి రాజకీయవర్గాలు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మెజార్టీ వైసీపీ ముఖ్య నేతలు కామ్‌ అయినా… అంబటి రాంబాబు మాత్రం తగ్గలేదు. సత్తెనపల్లి ఇన్ఛార్జ్‌గా ఉన్న అంబటిని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఆ తర్వాతి నుంచి ఆయన దూకుడు మరింత పెరిగింది. ఈ క్రమంలో అంబటి కూడా టార్గెట్‌ లిస్ట్‌లో ఉన్నారన్న తాజా చర్చ కలకలం రేపుతోంది. గతంలో మాజీ సీఎం జగన్‌ కుటుంబాన్ని కించపరిచారంటూ కొందరి మీద కేసు పెట్టబోయారు అంబటి. అయితే పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ…. ఏకంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో అప్పుడు ఆయన మీద కేసు బుక్‌ అయింది.

తర్వాత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్బంగా పోలీస్‌ ఆంక్షలను ఉల్లంఘించారంటూ ఇంకో కేస్‌ పడింది. ఆసమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దగ్గరుండి తొలగించారు మాజీ మంత్రి. దీంతో పోలీసులు, అంబటి మధ్య వాగ్వాదం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంకో కేసు బుక్‌ అయింది. ఇక విద్యార్దుల సమస్యలపై వైసీపీ మూడునెలల క్రితం గుంటూరులో చేపట్టిన ర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో సీఐ గంగా వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు మధ్య వివాదం మొదలై…. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాకా వెళ్లింది. అప్పుడు నమోదైన మరో కేస్‌తో ఇక అంబటిని అరెస్ట్‌ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కూడా…నేను జైలుకెళ్లడానికైనా సిద్ధమని స్టేట్‌మెంట్‌ అవ్వడంతో… ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే తర్వాత పరిస్థితి సైలెంట్ అయ్యింది. ఇక తాజాగా మరోసారి రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేయడంతో…. ఈసారి మాత్రం ఆయన్ని లోపలికి పంపడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి.

మెడికల్ కాలేజీల పీపీపీ విధానానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళనలో భాగంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించారు అంబటి. దానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే… పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఒక రకంగా మాటల యుద్ధమే నడిచింది. దాంతో… పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే… గతానికి భిన్నంగా.. ఈసారి నమోదైన సెక్షన్స్ విషయంలో తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి. స్థానిక పోలీసులు తనను టార్గెట్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారాయన. అంతేకాదు… పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లును తనకోసం కావాలనే పోస్టింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. సీఐ వెంకటేశ్వర్లు మంత్రి లోకేష్‌కు బంధువని, అందుకే… రాష్ట్రంలో అన్నిచోట్ల వైసీపీ నేతలు ర్యాలీలు చేసినా అడ్డు చెప్పని పోలీసులు గుంటూరులో మాత్రం నిబంధనలపేరుతో తనకు అడ్డుపడ్డారంటూ ఫైరైపోయారు. గతంలో తనపై పెట్టిన కేసులకు భిన్నంగా ఈసారి మరింత కఠినమైన సెక్షన్లు పెట్టారన్నారని అన్నారు. ఇక్కడే కొత్త చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. సెక్షన్స్‌ మారాయని అంబటి చెబుతున్నారంటే…ఇక టార్గెట్‌ లిస్ట్‌లోకి వచ్చినట్టేనా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. గతంలో ఆయన మీద కేసులు నమోదైనా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని, ఈసారి నమోదైన సెక్షన్స్‌ని చూస్తుంటే మాత్రం ఇక వదిలిపెట్టక పోవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో, వైసీపీ వర్గాల్లో అంబటి రాంబాబు అరెస్ట్‌కు సంబంధించిన చర్చలే హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి.

Exit mobile version