Site icon NTV Telugu

Off The Record : రూల్ ప్రకారం వడపోస్తే అర్హులను వెదుక్కోవాల్సిందేనా?

Adilabad

Adilabad

ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్‌ని పక్కాగా ఫాలో అయితే… చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండ నాలుక్కి మందేయబోతే… ఉన్న నాలుకే ఊడే పరిస్థితులు వచ్చాయా? ఏంటా రూల్స్‌? ఏయే జిల్లాల్లో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల పార్టీ అధ్యక్ష పదవుల కోసం…దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. పార్టీ సీనియర్లు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు సైతం మాకో పదవి అంటు లైన్‌లోకి వచ్చేశారు. డబ్బు, పార్టీలో పరపతి ఉన్నవాళ్ళంతా దిగిపోవడం వరకు బాగానే ఉందిగానీ….అధిష్టానం పేల్చిన బాంబ్‌ దెబ్బకు వాళ్ళ మైండ్స్ బ్లాంక్‌ అయిపోయాయట. పార్టీకోసం ఐదేళ్లపాటు పనిచేసిన వారు, అందులో కూడా సీనియారిటీ ఉన్నవాళ్ళు పదవులకు అర్హులంటూ రూల్‌ పెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదట. అలాగే… ఎమ్మెల్యేల బంధువులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు అంటే…..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నో ఛాన్స్‌ అట. ఈ రూల్స్‌ చూస్తేనే మతి పోతోందని అంటున్నారు పార్టీ లీడర్స్‌. ఈ ప్రకారమే ముందుకు వెళితే….కొన్ని చోట్ల సాధారణ క్యాడర్ తప్ప… లీడర్లు దొరకరని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలంతా… అయితే బీఆర్ఎస్ లేదా బిజెపి అంటూ జంపై పోయారని, అలాంటి వాళ్ళంతా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే… కండువా మార్చేసి తామే కాంగ్రెస్ పార్టీకి పునాది రాళ్లు వేశామంటూ బిల్డప్‌లు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినవాళ్ళంతా…మేమే జిల్లా కింగ్‌లమంటూ బడాయికి పోతున్నారని, అలాంటి వాళ్ళకు మాత్రం ఈ రూల్స్‌ చెక్‌ పెట్టినట్టయిందని మాట్లాడుకుంటున్నారు. అయితే… కొందర్ని కట్టడి చేయడానికి ఈ నిబంధనలు బాగానే అనిపిస్తున్నా… ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం నాయకులు దొరకరని, వీటివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండబోదంటూ… తమ పొలిటికల్ గాడ్‌ఫాదర్స్‌ ద్వారా పెద్దలకు సందేశాలు పంపుతున్నారట కొందరు. నిర్మల్, మంచిర్యాల,కొమురంభీం జిల్లాల్లో కొందరు నేతలు పదవులపై ఆశ పెట్టుకున్నారు.

 

అలాంటి వాళ్ళు మాకు లైన్ క్లియర్ అనుకుంటున్న టైంలో అధిష్టానం పెట్టిన రూల్స్‌ సెట్‌ అవక ఉల్టాప్రచారం మొదలు పెట్టేశారట. ఇప్పటికే ఉన్న మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల మీద ఆయా నియోజకవర్గాల నాయకులకు సదభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారు మేమున్నామంటూ తెర మీదికి రావడంతో గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 30మందికి పైగా దరఖాస్తులు చేసుకుంటే… వడపోత తర్వాత ఐదేళ్ల సీనియార్టీ ఉన్న నాయకుల్ని వెతుక్కోవాల్సిందేనన్న చర్చ తెర మీదికి వస్తోంది. ఈ రూల్స్‌ అంటే గిట్టని సీనియర్‌ లీడర్స్ మాత్రం తమ చేతికి మట్టి అంటకుండా సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ళ రూల్‌ ప్రకారం చివరికి ఎంత మంది మిగులుతారో, ఎవరు తెరపైకి వస్తారో చూడాలి.

 

 

Exit mobile version