కళ్ళ ముందే కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నా…. ఆ ఉన్నతాధికారికి చీమ కుట్టినట్టు కూడా లేదా? అసలు నాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదని అంటున్నారా? పైగా… ఇది చాలదన్నట్టు… నేను మంచి పని చేస్తున్నా… అంతా నన్ను మెచ్చుకుంటున్నారంటూ తనకు తానే భుజకీర్తులు తగిలించుకుంటున్నారా? నాకు ఆరుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని అంటున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? ఏ విషయంలో వాళ్ళు తనను సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు?
తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఏడీ… ఫణిభూషణరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, గ్రావెల్ అక్రమాల విషయంలో ఆయన వ్యవహార శైలి కారణంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మండపేట, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు , నిడదవోలు నియోజకవర్గాల్లో గ్రావెల్ కొండలు, ఇసుక రీచ్‌ల వద్ద భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద దోచుకుపోతున్నా.. మొక్కుబడి తనిఖీలు, చిన్నచిన్న కేసులు, నామ మాత్రపు ఫైన్లతోనే వ్యవహారం ముగుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. కానీ… అధికారి కారణంగా… తూర్పుగోదావరి జిల్లాలో ఆ లక్ష్యం నీరుగారిపోతోందని అంటున్నారు. ఫణి భూషణ్ మైన్స్ అధికారిగా వచ్చిన తర్వాత అక్రమాలు మరింత పెరిగాయన్నది లోకల్ టాక్. ఈ క్రమంలో… 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణ, ఓవర్ లోడింగ్ నియంత్రణ, అక్రమ నిల్వలపై చర్యలు, స్టాక్ పాయింట్‌ల దగ్గర నిఘా వ్యవస్థ, రాత్రి తవ్వకాల నిషేధం వంటి చర్యలను అమలు చేయాలని ఆదేశించారు. భారీ యంత్రాలతో తవ్వకాలు జరపవద్దని, వంతెనల పరిధిలో డ్రెడ్జింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందట. మైన్స్ శాఖ పరంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. సీతానగరం, తాళ్లపూడి మండలాల్లో గోదావరి గర్భంలో భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారట.
దానికి సంబంధించి స్థానికులు ఫిర్యాదు చేసినా…. మైన్స్ ఏడీ తనిఖీల సమయంలో కూడా అక్రమాలు కొనసాగినా.. చర్యలు మాత్రం తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. రాత్రి పూట అసలు తవ్వకాలే వద్దంటే… వాళ్ళు మాత్రం సాయంత్రం ఆరు నుంచి తెల్లవార్లూ తోడేసి ఓవర్‌లోడ్‌తో లారీలు నడిపిస్తున్నారట. అలా ఎందుకు జరుగుతోందని అంటే….. జిల్లాలోని ఇసుక, గ్రావెల్ మాఫియాల నుంచి ఉన్నతాధికారి కోసం భారీ స్థాయిలో మామూళ్లు వసూలవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే అక్రమార్కులకు మైన్స్ శాఖ నుంచి పరోక్ష రక్షణ లభిస్తోందన్న వాదనలు బలపడుతున్నాయి. దాదాపు ఏడాది కాలంగా.. మామూళ్ళ మత్తులో తూగుతూ…. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అయితే… ఏడీ ఫణిభూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల విషయంలో డోంట్ కేర్ అంటున్నారట. ఆరోపణలను తాను పట్టించుకోనని, తనకు ఆరుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని, ఇతర ఉన్నతాధికారులు కూడా తనకు ఫోన్లు చేసి మద్దతు తెలుపుతున్నారని సన్నిహితుల దగ్గర అంటున్నారట.
జిల్లా మంత్రితోపాటు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు అందరూ తనను మెచ్చుకుంటున్నారని ఏడీ గొప్పలకు పోవడమే ఇక్కడ అసలు విషాదం అంటున్నారు సామాన్య జనం. అసలు తాను సడలింపులు ఇవ్వడం వల్లే జిల్లాలో ఇసుక కొరత లేకుండా పోయిందని గడుసుగా చెబుతున్నారట ఆయన. తాడిపూడి, సీతానగరం ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ధవళేశ్వరం, కాతేరు ప్రాంతాల్లో బ్రిడ్జిల సమీపంలో కూడా విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ జరుగుతున్నా.. చర్యలు తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపితే, ఒక్క మైనింగ్ శాఖలోనే కోట్ల రూపాయల అవినీతి బండారం బయటపడవచ్చని అంటున్నారు. అలా చేస్తేనే మామూళ్లే ఆభరణంగా భావిస్తూ, విమర్శలని పొగడ్తలుగా చెప్పుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులకు చెక్ పడుతుందని అంటున్నారు.
