ఓ….తెగ స్పీడైపోకండి. కాస్త తగ్గించండి….. ఆ ఎక్స్‌ట్రాలు తగ్గించుకుని చేయాల్సిన అసలు పని మీద దృష్టి పెడితే మీకు, పార్టీకి మంచిదని ఏపీ సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించారా? ప్రోగ్రెస్ కార్డ్ చేతుల్లో పెట్టి మరీ… తలంటేశారా? మీరు మారకుంటే నేను డైరెక్ట్ యాక్షన్‌లోకి దిగాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చారా? ఎవరి మీద అంత సీరియస్ అయ్యారు బాబు…? ఏంటా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ? ఎవరెన్ని చెప్పినా, ఎలా వాదించినా…. విశాఖ జిల్లాలో రాజకీయం తెలుగు దేశం పార్టీకి నల్లేరు మీద నడకేనన్నది విస్తృతాభిప్రాయం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా సిటీ మీద పట్టు నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అందుకు సంస్థాగత బలం ఒక ఎత్తైతే….అర్బన్ ఓటర్ల ఆలోచనా విధానం మొదటి నుంచి టీడీపీకి కలిసి వస్తోంది. 2019 జగన్ వేవ్ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసినా విశాఖ మాత్రం టీడీపీ పైనే విశ్వాసం ప్రదర్శించింది. నేతలు పార్టీలు మారిపోవడం….వర్గాల కారణంగా ఒడిదుడుకులు ఎదురయ్యాయి తప్ప ఓటమికి కారణం కాలేకపోయాయి. సిటీ ఈస్ట్, వెస్ట్,నార్త్,సౌత్ నియోజకవర్గాల్లో మెజారిటీలు కాస్త అట ఇటైనా…ఓవరాల్‌గా అప్పటి సిట్టింగ్‌లనే మరోసారి ఆదరించారు ఓటర్లు. ఇక… గత ఎన్నికల నాటికి కూటమి నగరం మీద మరింత పట్టు బిగించింది. ఆ ఫలితం మెజారిటీల మీద స్పష్టంగా కనిపించింది. ఈ విజయం కూటమి ఎమ్మెల్యేలు మీద బాధ్యతను మరింత పెంచింది.
కానీ….వాస్తవంలో మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట. ప్రజలకు మరింత చేరువగా వుండాల్సిన అవసరం గురించి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరించాల్సి వస్తోందంటున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇటీవల అంతర్గత ఫిర్యాదులు ఎక్కువయ్యాయట. సీనియర్ శాసనసభ్యులు వ్యక్తిగత వ్యవహారాలు, వ్యాపారాల మీద పెట్టిన ఫోకస్…. ప్రజా సమస్యల పరిష్కారం మీద పెట్టడం లేదన్న ఫీడ్ బ్యాక్ హెడ్డాఫీస్‌కు వెళ్ళింది. కొందరు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తున్నా… కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేల చుట్టూ పీఏలు దడి కట్టేసి….ద్వితీయ శ్రేణి నాయకులను సైతం కలవనీయడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక పైరవీల కోసం వచ్చే వాళ్లకు దక్కిన గౌరవంలో కొంచెం కూడా జెండా మోసిన కార్యకర్తలకు దక్కడం లేదనే ఆవేదన పెరుగుతోంది.ఈ దిశగా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు నిఘా వర్గాలు సర్కార్ పెద్దలకు నివేదించాయట. వివిధ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఎమ్మెల్యేల పనితీరుపై ఓవరాల్‌గా సంతృప్తి చెందినా….అంతర్గత వ్యతిరేకత మీద మాత్రం అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.
విశాఖ ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చిన ర్యాంక్స్ ఫర్వాలేదనిపించినా… ఆశించిన మార్కులు మాత్రం పడలేదని తెలిసింది. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే పార్టీకి., ప్రభుత్వానికి విశాఖ ఎంత ప్రాధాన్యమో తెలిసి కూడా… అలసత్వం ప్రదర్శిస్తే కష్టమని శాసనసభ్యులకు సీఎం క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు అమరావతి, హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు తప్ప నియోజవర్గం అభివృద్ధి, పార్టీ వ్యవహారాల్లో నాన్ సీరియస్‌గా ఉంటున్నారని, దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అధినేత గట్టిగా చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కంటే విశాఖను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అందుకు తగ్గ వేగాన్ని అందుకోలేకపోతున్నారని, సరైన మైలేజ్ కూడా తీసుకురాలేకపోతున్నారని, ఈ తీరు మారాలంటూ ముఖ్యమంత్రి హితోపదేశం చేసినట్టు చెప్పుకుంటున్నారు. జిల్లా అభివృద్ధి, చేపట్టిన పనులతో పాటు శాసనసభ్యులు పనితీరు.. వారి లోపాలు, ఇతర అంశాల ఆధారంగా ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను సవివరంగా, నిర్మొహమాటంగా చెప్పేశారట సీఎం. విశాఖకు ఇంకా కీలక ప్రాజెక్టులు వస్తున్నాయని, దానికి సంబంధించిన ప్రగతిని మరింగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉందని సీఎం చెప్పినట్టు తెలిసింది. క్రెడిట్ మనకు దక్కేలా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ… పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా ఆశించిన స్థాయిలో ప్రచారం చేసుకోలేక పోవడం ఇబ్బందికరంగా మారుతోందని అన్నారట.
మార్పు అనివార్యమని, మీరు మారకపోతే నేను డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగక తప్పదని కొందరు ఎమ్మెల్యేలను డైరెక్ట్‌గానే హెచ్చరించారని, ఆ వార్నింగ్స్ వాళ్ళకు గట్టిగానే తగిలాయన్న చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు, వ్యాపకాల గురించి నేరుగా సీఎం ప్రస్తావించడంతో కొందరు కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల టైంకి విశాఖలో డివిజన్ల సంఖ్య 120 నుంచి 150 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేయడాన్ని ప్రాధాన్యత అంశంగా భావిస్తోంది టీడీపీ హైకమాండ్. ఈ దిశగా ఇప్పటికే ప్లానింగ్ సిద్ధమవుతుండగా…దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఎమ్మెల్యేలు వెనుకబడటం ప్రమాదకరమన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. వాళ్ళు కోటరీలు వీడక పోయినా, కేడర్, లీడర్ షిప్ మధ్య సమన్వయం సాధించలేకపోయినా ముప్పు తప్పదనిఅంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ర్యాంకులు ఇచ్చి మరీ చురకలు అంటించడం ఒక హెచ్చరిక మాత్రమే కాదని మార్పు రాకపోతే భవిష్యత్ లో జరిగే పరిణామాలకు సూచికగా భావించాలని సీనియర్లు చర్చించుకుంటున్నారు.
