Site icon NTV Telugu

Off The Record : పవన్ సినిమాకు ఒంగోలు పాలిటిక్స్ సంబంధం ఏంటి?

Ongole Otr

Ongole Otr

ఒంగోలు పోట్ల గిత్తల పోరు కొత్త టర్న్‌ తీసుకుంటోందా? కూటమిలో అంటుకున్న మంటలు చల్లారకపోగా…. హరిహరవీరమల్లు సినిమా రూపంలో… ఇంకాస్త పెట్రోల్‌ యాడ్‌ అయిందా? కలిసి పని చేసుకోమని టీడీపీ, జనసేన అధిష్టానాలు చెబుతున్నా… నియోజకవర్గ నేతలు వినే పరిస్థితిలో లేరా? ఇంతకూ పవన్‌ సినిమాకి, ఒంగోలు పాలిటిక్స్‌కు సంబంధం ఏంటి? అక్కడ కూటమిలో అసలేం జరుగుతోంది?

ఒంగోలులో కూటమి రాజకీయం కుతకుతలాడిపోతోందట. ఇద్దరు ముఖ్య నాయకుల ఆధిపత్య పోరు ఇప్పుడు ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా సాక్షి వీధికెక్కి రసవత్తరంగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు టిక్కెట్‌ కోసం ఇప్పట్నుంచే టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం మొదలవడం ఉత్కంఠ రేపుతోంది. ఈసారి ఒంగోలు టిక్కెట్‌ నాదేనని మాజీ మంత్రి, జనసేన ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడం ప్రకాశం పాలిటిక్స్‌లో సెగలు పుట్టిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తొలగించటంతో తాజా వివాదం మొదలైంది. అసలే ఉప్పు.. నిప్పులా ఉన్న బాలినేని, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ వర్గీయుల వార్…. ఈ ఫ్లెక్సీ వివాదంతో పీక్స్‌కు చేరిందంటున్నారు ఈ వ్యవహారాలను తొలి నుంచి గమనిస్తున్న వాళ్ళు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి నటించిన సినిమా ఫ్లెక్సీలను తొలగించే సాహసం మున్సిపల్‌ అధికారులు చేశారంటే…దాని వెనక కచ్చితంగా ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలు ఉండి తీరతాయన్నది బాలినేని వర్గం అనుమానం అట. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వాయిస్తోంది ఎవరో తేల్చేపనిలో జనసైనికులు బిజీగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు మేటర్‌ డైరెక్ట్‌గా మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ దృష్టికి వెళ్ళడంతో…. ఆయన తన శాఖ అధికారులకు లెఫ్ట్‌ రైట్‌ క్లాస్‌ పీకినట్టు సమాచారం. ఇటీవలే మార్కాపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో క్లారిటీ ఇచ్చారు.

కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు… కొన్ని సమస్యలు ఉంటాయని, సర్దుకుపోయి.. సమిష్టిగా పని చేయాలని సూచించారు. అయితే… ఒంగోలులో మాత్రం తాము ఎంత సర్దుకుపోదామనుకుంటున్నా…. ఎమ్మెల్యే వర్గం మాత్రం ఆ పని చేయనివ్వడంలేదని అంటున్నారట జనసేన కార్యకర్తలు. అటు ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీమంత్రి కూడా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన బయలుదేరి ఒంగోలు చేరుకున్న శ్రీనివాసరెడ్డి…. తన అనుచరులతో కలిసి… ర్యాలీగా వెళ్లి సినిమా చూశారట. ఒంగోలులో పుష్కర కాలంగా బాలినేని, దామచర్ల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఇద్దరూ నాలుగు సార్లు
ముఖాముఖి తలపడగా… చెరో రెండుసార్లు గెలిచారు. అయితే నిరుడు బాలినేని వైసీపీని వదిలేసి గ్లాస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నా…ఇద్దరి మధ్య వైరం మాత్రం తగ్గలేదు. ఆయనతో కలిసే ప్రసక్తే లేదని తనకు అవకాశం దొరికిన ప్రతీ సందర్బంలో చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దామచర్ల. బాలినేని జనసేనలో చేరే సందర్భంలో కూడా తీవ్రంగా వ్యతిరేకించారాయన. చివరికి శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు కొందరు.

ఇప్పుడు ఏకంగా పవన్‌ సినిమా ఫ్లెక్సీలనే తొలగించటం హాట్ టాపిక్ అయింది. ఒంగోలు పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళారట బాలినేని. ఇదే సమయంలో తన సన్నిహితుల దగ్గర ఓపెనైపోయిన మాజీ మంత్రి…వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో… తాను ఒంగోలు నుంచి పోటీ చేసి తీరతానని క్లారిటీగా చెప్పేశారట. దీంతో… తాను పోటీ చేస్తున్న చివరి ఎన్నికలు ఇవేనని గత అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు ప్రకటించి అని చెప్పిన బాలినేని.. ఇప్పుడు మనసు మార్చుకున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి. మారిన పరిస్థితుల్లో… గెలుపుతోనే తన పొలిటికల్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ టిక్కెట్‌ దక్కకుంటే… ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని అన్నట్టు తొలుత ప్రచారం జరిగినా…. అలాంటిదేం లేదని ఖండిస్తూనే… ఈసారి ఖచ్చితంగా ఒంగోలులో జనసేన టిక్కెట్‌ మీద తాను పోటీ చేస్తానని తేల్చేశారట ఆయన. అదే నిజమైతే… సిట్టింగ్‌ ఎమ్మెల్యే దామచర్ల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తాజా ఫ్లెక్సీ వివాదంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారట ఎమ్మెల్యే దామచర్ల అనుచరులు. మాకు కూడా పవన్‌ మీద అభిమానం ఉందని చెబుతూ… వాళ్ళు కూడా ర్యాలీగా హరిహర మీరమల్లు సినిమాకు వెళ్ళారు. నిజంగానే ఎమ్మెల్యే అనుచరులకు సంబంధం లేకుంటే… అత్యుత్సాహంగా వాటిని తొలగించిన మున్సిపల్‌ అధికారుల మీద వేటు పడుతుందా అన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఒంగోలు పోట్ల గిత్తల పోరు ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలంటున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version