అసెంబ్లీ ఎన్నికల్లోలాగే… లోకల్ ఎలక్షన్స్‌లో కూడా జనసేన వంద శాతం స్ట్రెక్ రేట్ సాధించడం సాధ్యమేనా? అసలు తాము బలంగా ఉన్నామని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్న జిల్లాలోనే కావాల్సిన సీట్లు సాధించుకునే పరిస్థితులు కనిపించడం లేదా? అధిష్టానం వైఖరిపై ఆ జిల్లా నాయకులు కాస్త అసంతృప్తిగా ఉన్నారన్నది నిజమేనా? మిత్రపక్షం తమను తొక్కేస్తోందని జనసైనికులు ఫీలవుతోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కాస్త డిఫరెంట్‌గా చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా… జనసేన అధిష్టానం తీరుపై స్థానిక జనసైనికులు కాస్త అసంతృప్తిగా ఉన్నారట. జిల్లాలో బలం ఉన్నా…ఆశించిన చోట్ల
సీట్లు దక్కించుకునే విషయంలో వెనకబడుతున్నామన్న ఫీలింగ్ వాళ్లలో ఉందని అంటున్నారు. మరే జిల్లాల్లో లేని విధంగా గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది జనసేన. ఇప్పుడు కూడా అంతే ఊపుతో ఉన్నామని, ఇంకా చెప్పాలంటే… పెరిగామని జనసైనికులు అంటుంటే… కూటమిలోని మిగతా పార్టీల నాయకులు మాత్రం అంతుందా అన్నట్టు చూస్తున్నారట. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలు చేశామని అంటున్న టీడీపీ ఇన్ఛార్జ్‌లు ఈసారి తమ పట్టు తగ్గకుండా, జిల్లాలో ఎక్కడా జనసేనకు ఎక్కువ సీన్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. అసెంబ్లీ సీట్లు వదులుకున్న టీడీపీ నాయకులు ఇపుడు స్థానిక సంస్థల్లో కీలక పదవులను మిత్రపక్షానికి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఏలూరు జడ్పీ, పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మెన్ పదవులు, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, ఆకివీడు మున్సిపల్ ఛైర్మన్ పదవుల కోసం జనసేన పోటీ పడుతోందట. లోకల్ టీడీపీ నాయకులు కూడా అవే సీట్ల మీద కన్నేసి పావులు కదుపుతుండటం కూటమిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. 2024 ఎన్నికల్లో జిల్లా నుంచి అత్యధికంగా సీట్లు జనసేనకు వెళ్లడంతో ఇన్చార్జిలుగా మిగిలిపోయిన టిడిపి నేతలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తగ్గేదేలే అంటున్నారట. అదే సమయంలో కలిసొచ్చిన జిల్లాలో కీలక పదవులు దక్కించుకునే విషయంలో అధినాయకత్వం వెనుకబడుతోందని, పోటీ చేస్తే గెలిచే సత్తా ఉన్నప్పటికీ.. ఆ దిశగా గట్టిగా గళం వినిపించడం లేదని చెప్పుకుంటున్నారట జిల్లా జనసైనికులు. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు ఎంత మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారో చూస్తున్నాం కదా… కానీ… మనవాళ్లు ఉన్న దగ్గర ఆ స్థాయిలో పట్టు బిగించలేకపోతున్నారంటూ జిల్లా జనసేన నాయకులు కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
మరోవైపు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న తాడేపల్లిగూడెం భీమవరం, నరసాపురం, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు జడ్పీ పదవుల కోసం టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఒక విధంగా తమకు పట్టున్న జిల్లాలో కావాలనే టిడిపి డామేజ్ చేస్తోందన్న చర్చ గ్లాస్ వర్గాల్లో జరుగుతోందట. మేయర్, జడ్పీ చైర్మన్ వంటి పదవులకు డైరెక్ట్ ఎన్నిక కావడంతో టీడీపీ కంటే తామే ఓ మెట్టు పైన ఉంటామన్నది జనసేన నేతల మనోగతంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… ఇరు పార్టీల నేతలు తమతమ అధిష్టానాల చుట్టూ తిరుగుతూ…. ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేయడంతో కోల్డ్‌వార్ గట్టిగానే నడుస్తోందంటున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో జనసేన మీద ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే సెటైర్లు వేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసిన చిరంజీవికి ఎదురైన ఓటమిని, 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కల్యాణ్, నరసాపురం పార్లమెంటులో నాగబాబుల ఓటమిని గుర్తు చేస్తున్నారట. జనసేన ఎప్పుడూ టీడీపీకి సహకరించడం తప్ప…. టీడీపీ మాత్రం గ్లాస్ పార్టీకి సహకరించినట్టు కనిపించడం లేదంటూ లెక్క చెబుతున్నారట. విపక్షం వాదన ఎలా ఉన్నా… స్థానిక ఎన్నికలు మాత్రం… ఉమ్మడి జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య కోల్డ్‌వార్‌ను గట్టిగానే పెట్టాయన్న అభిప్రాయం పెరుగుతోంది. రేపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే… పరిస్థితులు కూడా మారతాయని, రెండు పార్టీలకు రెబెల్స్ బెడద తప్పకపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.

