OTR: గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూప్ పాలిటిక్స్

Otr

Otr

పార్టీనా….. ఇంకేమన్నానా….? అధ్యక్షుడా…. ఆవకాయ బద్దా…? సర్వం నేనే. నేను చెప్పిన వాళ్ళే నాయకులు, వేసిందే కమిటీ అంటున్నారా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ప్రకటించిన కమిటీనే కాదని తన సొంత వాళ్ల పేర్లు చెప్పేసి వీళ్ళే మండల పార్టీ అధ్యక్షులనేశారు. అంత సాహసం చేసిన ఆ కాంగ్రెస్‌ లీడర్‌ ఎవరు? ఏకంగా పీసీసీ ఆదేశాలనే ధిక్కరించడాని రీజనేంటి?

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. 2009 తర్వాత ఎప్పుడూ ఇక్కడ ఆ పార్టీ జెండా ఎగరలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యాక ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా…. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకుంటామని సంబరపడ్డారు కార్యకర్తలు. అది జరక్కపోగా…. గ్రూపుల గోలతో నిత్యం ఏదో ఓ వివాదం పట్టి పీడిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ నర్సారెడ్డి వివాదాలకు కేరాఫ్ అయ్యారని చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారట ఆయన. గతంలో సీఎం రేవంత్ మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. తనకి ఆహ్వానం లేదని నర్సారెడ్డి ఆ పరిశ్రమ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా చల్లబడ్డాడు నర్సారెడ్డి. ఆ తర్వాత ఇంఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో వేదికపై కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట జరిగింది. ఆ టైంలో పార్టీకి చెందిన ఎస్సీ నాయకుడిని కులం పేరుతో దూషించాడంటూ నర్సారెడ్డి పై కేసు నమోదయింది.

ఆ తర్వాత గజ్వేల్‌ కాంగ్రెస్‌ నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక సిద్దిపేట వెళ్తే నర్సారెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత డీసీసీ మరోసారి నర్సారెడ్డి కుటుంబానికే రావడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల అంశం ఇంకా రచ్చకు దారి తీసింది. మార్కెట్ కమిటీల నియమాకాల్లో నర్సారెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు అప్పట్లో గాంధీ భవన్ మెట్లెక్కారు. పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నవారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి పదవులు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంచార్జ్ నర్సారెడ్డి నామినేటేడ్ పోస్టులను అమ్ముకున్నారని, మార్కెట్ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని లక్షల రూపాయలకు బేరం పెట్టారని కూడా ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లో…. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కమిటీలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు పీసీసీ చీఫ్. మనోహరాబాద్, తూప్రాన్, తూప్రాన్ పట్టణ అధ్యక్షులతో పాటు మిగతా మండలాలకు అధ్యక్షులను కూడా ఆయనే స్వయంగా ప్రకటించారు. అందులో తూప్రాన్, మనోహరాబాద్, తూప్రాన్ పట్టణ అధ్యక్షుల నియామకంపై పెదవి విరిచారు నర్సారెడ్డి. పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌కు స్థానిక వ్యవహారాలు తెలియవంటూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్నే తప్పు పట్టారు. వాళ్ళు కాదు… నేను ప్రకటిస్తున్న వారే మండల అధ్యక్షులంటూ కొత్త పేర్లు ప్రకటించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనమైంది. పీసీసీ నిర్ణయాన్నే సవాల్ చేసిన నర్సారెడ్డిపై ఆయన ప్రత్యర్థి వర్గం భగ్గుమంటోంది. అయితే ఈ అంశం నర్సారెడ్డి వ్యతిరేక వర్గానికి బలం ఇచ్చినట్టు అయ్యింది. ఆయన పదవులను పాప్ కార్న్ లా అమ్ముకున్నారంటూ ఆరోపిస్తున్నారు. పీసీసీ నిర్ణయాన్నే వ్యతిరేకించిన నర్సారెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది వ్యతిరేక వర్గం. నర్సారెడ్డి అసలు రూపాన్ని ఇప్పుడైనా అధిష్టానం గ్రహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా పోటా పోటీ కమిటీల ప్రకటనతో గజ్వేల్ కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. ఇన్ని రోజులు లోకల్ లీడర్లతో కయ్యం పెట్టుకున్న నర్సారెడ్డి ఈ సారి ఏకంగా పీసీసీ నిర్ణయంతోనే విభేదించడంతో నియోజకవర్గ పార్టీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది. మరో వైపు పీసీసీ నిర్ణయాన్ని నర్సారెడ్డి సవాల్ చేయడంపై గాంధీ భవన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్‌కి ఎండింగ్ ఏ రూపంలో పడుతుందో చూడాలి మరి.