మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య సమాధి రాజకీయం నడుస్తోందా? తమలపాకుతో నువ్వు ఒకటి అంటే… తలుపు చెక్కతో నేను నాలుగు అంటానన్నట్టు వాతావరణం మారిపోయిందా? రాజకీయాన్ని దాటి వ్యక్తిగత వైరం స్థాయికి వెళ్ళిపోయిన ఆ ఇద్దరు నేతలు ఎవరు? మధ్యలో ఈ సమాధి రాజకీయం ఏంటి?
నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య వ్యవహారం మామూలుగా ఉండదు. పొలిటికల్ వార్‌కు వ్యక్తిగత పోరు కూడా తోడవడంతో… ఇరువర్గాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. ఈ క్రమంలో…. బనగానపల్లిలో రామిరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి పేరుతో నిర్మించిన ఘాట్ వివాదం తాజాగా సెగలు పుట్టిస్తోంది. కాటసాని నాగార్జున రెడ్డి సమాధి నిర్మించిన స్థలాన్ని కబ్జా చేశారన్నది
మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపణ. దానికి సంబంధించి రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ఆ ప్రకారం అది ప్రభుత్వ భూమేనని, స్వాధీనం చేసుకోవాలంటూ సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కలెక్టర్‌ను ఆదేశించారట.
స్వాధీనం కోసం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రామిరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి చనిపోయినప్పుడు అవుకు రోడ్‌లో 2.95 ఎకరాలున్న భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడే ఘాట్ కూడా నిర్మించారు. ఆ మొత్తం విస్తీర్ణానికి ప్రహరీగోడ కట్టి పార్క్ లాగా అభివృద్ధి చేశారు. అయితే అది నీటిపారుదల శాఖ భూమి అని ఆరోపిస్తున్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి. ఆ భూమిని మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమించారన్నది
మంత్రి ఆరోపణ. ఈ క్రమంలోనే రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారట. అది నీటిపారుదల శాఖకు చెందిన భూమేనని నిర్ధారించి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. సరిగ్గా ఇక్కడే కాస్త డిఫరెంట్ వాదన వినిపిస్తున్నారు కాటసాని. వాస్తవంగా అది ఇరిగేషన్ శాఖ భూమేనని, కానీ…. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎన్‌వోసీ తీసుకున్నామని చెబుతున్నారాయన. అలాంటప్పుడు కబ్జా ఎలా అవుతుందన్నది మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడానికి సిద్ధమయ్యామని, అంతలోపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని అంటున్నారాయన. ఈ పాయింట్‌నే ఇంకాస్త సాగదీసి కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు మినిస్టర్ జనార్ధన్‌రెడ్డి. వాళ్ళకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే… డబ్బులు పెట్టి కొనడానికి వేరే భూములు లేవా…? ప్రభుత్వ భూమే కావాల్సొచ్చిందా…. అన్నది ఆయన ప్రశ్న.
మూడు ఎకరాలకు దగ్గర దగ్గరగా ఉన్న అదే భూమిలో ఎంత మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వచ్చో తెలుసుకదా అంటూ నిలదీస్తున్నారు మంత్రి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఘాట్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారాయన. మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య ఈ వాదనలు ఇలా నడుస్తున్న టైంలోనే… ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం చేసుకోమంటూ సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశమైంది. అసలు అప్పట్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమని, అలా ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేశారు విజిలెన్స్ అధికారులు. ఈ పరిస్థితుల్లో.. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా…? కాటసాని న్యాయ పోరాటం చేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి బనగానపల్లిలో. భూమిలో ఇప్పటికే సమాధి నిర్మించడంతో ఒకవేళ స్వాధీనం చేసుకుంటే అంతవరకు మినహాయిస్తారా…? లేక మొత్తం స్వాధీనం చేసుకుంటారా..అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీసీ జనార్ధన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి వర్గాల మధ్య పొలిటికల్‌గా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో…. ఘాట్ నిర్మించిన భూమి స్వాధీనం వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి…

