ఆయన మాజీగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలు ఏ అంశంపై కన్నెర్ర చేశారో.. ఇప్పుడు ఆయన MLA అయిన తర్వాత కూడా అదే సీన్ ఉందట. అంగుళం కూడా మార్పు లేదట. MLAతో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చిందని కలవర పడుతున్నారు నాయకులు. అదెక్కడో.. ఆ సంగతేంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఎమ్మెల్యే కూసుకుంట్లపై పార్టీ కేడర్ మళ్లీ కన్నెర్ర..!
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. హైఓల్టేజ్ స్థాయిలో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించి అసెంబ్లీలో మరోసారి అడుగు పెట్టారు. మునుగోడు ఉపఎన్నిక ముందు కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై స్థానిక గులాబీ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పార్టీ పెద్దలు వచ్చి సర్ది చెప్పడంతో అప్పటికి ఓకే అన్నారు. కానీ.. కూసుకుంట్ల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తీరులో మార్పు రాలేదన్నది అదే స్థానిక నేతల ఆరోపణ. దీంతో మునుగోడులో జరుగుతున్న పరిణామాలను వీలైతే సీఎం కేసీఆర్ దృష్టికి… కుదరకపోతే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి అసంతృప్త నేతలు సిద్ధం అవుతున్నారట.
ఉపఎన్నికలో గెలిచాక మళ్లీ వేధిస్తున్నారని ఆరోపణలు
ఆనాడు గులాబీ పార్టీ పెద్దల ఆదేశాలతో ఉపఎన్నికలో కూసుకుంట్ల గెలుపుకోసం పనిచేశామని.. ఆయన ఎమ్మెల్యే అయ్యాక పద్దతిలో ఎలాంటి మార్పు లేదని.. తిరిగి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల.. అప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారని.. దాంతో 2018లో ఓడిపోయారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇంతలో ఉపఎన్నిక రావడంతో కేడర్ భగ్గుమంది. ఆ విషయాలను మనసులో పెట్టుకున్నారో ఏమో.. కూసుకుంట్ల తిరిగి వేధిస్తున్నారనేది నేతల ఆరోపణ.
ఉపఎన్నికలో సరిగా పనిచేయలేదని ఎమ్మెల్యే కోప్పడుతున్నారట
ఉపఎన్నికలో సరిగా పనిచేయలేదని కొందరిని కూసుకుంట్ల నిందిస్తున్నారట. గ్రామాల్లో తనకు రావాల్సిన మెజారిటీ రాలేదని.. దానికి మీరే కారణమని మరికొందరిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గ్రూపులు కట్టి తనకు వ్యతిరేకంగా పనిచేశారని.. టికెట్ రాకుండా అడ్డుపడ్డారని ఇంకొందరిని దూరం పెట్టారట ఎమ్మెల్యే. ఈ పరిణామాలపై మునుగోడులోని గులాబీ నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మళ్లీ ఒక్కటయ్యారట. తిరిగి ఈ వేధింపులు ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట. ఒక పరాభవం.. మరో అనుభవం నుంచి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా అనేది వారి ఆవేదన. ఉపఎన్నిక ముగిసి నాలుగు నెలలే అయ్యిందని.. మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయని.. ఇలాంటి తరుణంలో కూసుకుంట వైఖరి ఇలాగే ఉంటే ఇబ్బందులు తప్పబోవని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట.
మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటున్న నేతలు
ఈ ఆరోపణలను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఖండిస్తున్నా..మునుగోడులోని స్థానిక గులాబీ నేతలు మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారట. ఇకపై వివక్ష, వేధింపులు సహించేది లేదని.. తాడో పేడో తేల్చుకుంటామని శపథాలు చేస్తున్నారట. ఇది రాజకీయంగా కీలక సమయం.. ఈ టైమ్‌లో ఎమ్మెల్యే తీరు మారకపోతే.. మార్పు ఎలా ఉండాలో.. ఆ మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామని కొందరు సవాల్ చేస్తున్నారట. దీంతో మునుగోడు బీఆర్‌ఎస్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.