Site icon NTV Telugu

Off The Record: ఈసారి నరసరావుపేట నుంచేనా?

Maxresdefault (1)

Maxresdefault (1)

ఆయన ఒకసారి ఎంపీగా.. మరోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఓటమి భయపెట్టిందో ఏమో చడీచప్పుడు చేయడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నా మౌనంగానే ఉండిపోయారు. ఎందుకలా? మౌనం వ్యూహమా లేక ఇంకేదైనా ఉందా? ఎవరా నాయకుడు?

2019లో గుంటూరు లోక్‌సభకు పోటీ.. ఓటమి
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు నరసరావుపేట ఎంపీగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి 5 వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009, 2014 ఎన్నికల్లో ఆడుతూ పాడుతూ గెలిచిన ఆయన.. 2019 వైసీపీలో చేరి పోటీ చేసినా ఆ పార్టీ సునామీలోనూ నెగ్గుకు రాలేకపోయారు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టి మాట్లాడే మోదుగుల ప్రస్తుతం తన నోటిని కట్టేసుకున్నారు. మౌనవ్రతం పాటిస్తున్నారేమో అన్నట్టుగా సైలెన్స్‌ పాటిస్తున్నారు ఈ వైసీపీ నేత.

నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం
వచ్చే ఎన్నికల్లో మోదుగుల నరసరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సీటు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ ప్రాంతంలో మోదుగులకు గట్టి పట్టుంది. పల్నాడు ప్రాంత కార్యకర్తలతో కలివిడిగా ఉంటారనేది టాక్‌. ప్రస్తుతం నరసరావుపేట నుంచి ఎంపీగా వైసీపీ నేత శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు షిఫ్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఈ ప్రచారంపైనా మాట్లాడేందుకు మోదుగుల ఇష్ట పడటం లేదు. ఒకవేళ గట్టిగా అడిగితే మాత్రం.. రాజకీయాల్లో మనం చేసేది ఏముంది? గతం ఘనం.. వర్తమానం వ్యర్థం.. భవిష్యత్‌ భయం అని వైరాగ్యంతో మాట్లాడుతున్నారట. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని.. చేసిన పదవులు.. పడిన కష్టాలు ఇక చాలు అని ఆయన చెబుతున్నారట. కుదిరినంత వరకు సామాజిక సేవ చేస్తే చాలు అని కార్యకర్తలకు గీతోపదేశం చేస్తున్నారట మోదుగుల. ఎంత చేసినా ప్రజలు వాళ్లు అనుకున్న వాళ్లకు ఓటేస్తారని.. లేదంటే సమైక్యాంధ్రకోసం పార్లమెంట్‌లో తన్నులు తిన్న తనను గుంటూరులో ఓడిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మోదుగుల. ఓటమి నేర్పిన పాఠం.. ఆ ఓటమి చేసిన గాయం చాలా లోతైందని.. దాన్నుంచి ఇంకా బయట పడలేకపోతున్నానని సన్నిహితులకు చెబుతున్నట్టు సమాచారం.

ఎన్నికలకు సమయం ఉందని తొందర పడటం లేదా?
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే మోదుగుల తొందర పడటం లేదని కొందరి సందేహిస్తున్నారు. అయితే మోదుగుల మాటల వెనుక అంతుచిక్కని వ్యవహారం ఉందనేది ఆయనతో సన్నిహితంగా ఉండేవారి అభిప్రాయం. 2019లో ఓడినా వైసీపీ అధికారంలోకి రావడంతో ఏదోఒక పదవి వస్తుందని ఆయన ఎదురు చూశారు. అదేమీ దక్కకపోవడంతో మనస్తాపం చెందారనేది కొందరి వాదన. ఎన్నికల్లో ఓడి బాధలు పడేకంటే పార్టీకి సేవ చేసి ప్రత్యామ్నాయ పదవులు పొందడం మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన ఆఫీసును సైతం బావ అయిన ఎంపీ అయోధ్య రామిరెడ్డికి అప్పజెప్పి ఊరికి దూరంగా కట్టుకున్న ఇంటిలో కాలక్షేపం చేస్తున్నారు మోదుగుల.

మోదుగుల మళ్లీ పోటీ చేస్తారా?
మాజీ ఎంపీ లోగుట్టు తెలిసిన కొందరు మాత్రం ఇది ఓటమి చేసిన గాయం కాదని.. తన సమీప బంధువు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఎదుర్కొంటున్న సమస్యలు.. తాను రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్లే మౌనం వహిస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంట్‌ పరిధిలో కొత్తగా నియమిస్తున్న నాయకత్వాల వల్ల పార్టీలో తమ ఉనికి లేకుండా పోయిందనే ఆవేదనలో ఉన్నారట. అందుకే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని మోదుగుల ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఎగిరి దంచినా అదే కూలి.. ఎగిరెగిరి దంచినా అదే కూలి అని మీకు తెలియదా అని తనను కలిసిన వారితో అంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మోదుగుల మళ్లీ పోటీ చేస్తారా? అధిష్ఠానం ఆయనకు నరసరావుపేట టికెట్ ఇస్తుందా? లేక పార్టీ కార్యక్రమాలకు వ్యూహాలకు మోదుగుల ఆలోచనలు అభిప్రాయాలు ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ పదవిని ఇస్తుందా ? అనే టాక్ గుంటూరు రాజకీయాల్లో ఉంది.

 

Exit mobile version