Site icon NTV Telugu

Off The Record: డొక్కాను ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా?

Geeta

Geeta

డొక్కాను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా ? డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా సైడ్ అయ్యారా ? | OTR | Ntv

అక్కడ అధికారపార్టీలో అందరూ నాయకులే. ఎవరి మాట ఎవరు వినరు. అధ్యక్షుడి మాట అసలే వినరు. మా నియోజకవర్గానికి మేమే సామంతులం.. మా సామ్రాజ్యాల్లో వేరే వాళ్లు వేలు పెడితే కుదరదు అని గీతలు గీస్తున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

డొక్కాను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా?
గుంటూరు జిల్లా వైసీపీలో నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు జిల్లా వైసీపీ చీఫ్‌ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కంటే సీనియర్లు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. దీంతో నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారిని జిల్లా అధ్యక్షుడిగా గౌరవించాలంటే ఎలా అని డొక్కాను లెక్క చేయడం లేదట. పరిస్థితులను అర్థం చేసుకున్నారో ఏమో.. డొక్కా సైతం నాకెందుకు వచ్చిన గొడవ అని సైడ్‌ అయిపోతున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలతో సరిపెట్టి ఏరోజుకారోజు మమ అనిపిస్తున్నట్టు సమాచారం.

తాడికొండలో శ్రీదేవి వర్సెస్‌ డొక్కా..!
గుంటూరు పార్లమెంటు వైసీపీ ఇంఛార్జ్‌గా గత ఎన్నికల్లో ఓడిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మోదుగులకు వైసీపీ వ్యవహారాలు.. క్రమశిక్షణ వంటి అంశాలలో సలహాలు సూచనలు డొక్కావల్ల అయ్యే పని కాదు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. జిల్లా అధ్యక్షుడి మాట వినే పరిస్థితి లేదు. డొక్కా వల్లే తనకు తాడికొండలో ఇబ్బందులు వచ్చాయని.. ఇప్పుడు కత్తెర సురేష్ రూపంలో హడావుడి చేస్తున్నారని ఎమ్మెల్యే అభిప్రాయం. దీంతో డొక్కా ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేయడానికి శ్రీదేవి చూస్తున్నారట.

ప్రత్తిపాడులో డొక్కా మాట చెల్లడం లేదా?
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మామూలుగానే నాయకులతో దూరం పాటించే శివకుమార్ తెనాలిలో ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడు డొక్కాతో అధికారికంగా ఓ చిన్న కార్యక్రమం కూడా చేయలేదు. డొక్కా కూడా తెనాలికి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు కానీ.. అధ్యక్షుడి హోదాలో అక్కడ పర్యటించింది లేదు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు వైసీపీలో సీనియర్‌ అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మామ. దాంతో డొక్కాకు పొన్నూరులో సీన్‌ లేదంటోంది పార్టీ కేడర్‌. ప్రత్తిపాడులో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఉండటంతో అక్కడ జిల్లా అధ్యక్షుడి పప్పులు ఉడకడం లేదట. మేము ఆ సీటు వదిలేస్తే.. మీరు అధ్యక్షులయ్యారు అని సుచిరిత బ్యాచ్‌ కామెంట్స్‌ చేస్తోందట.

మీటింగ్‌ పెడితే ఎమ్మెల్యే వస్తారో.. రారో అని డౌట్‌..!
మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరే వేరు. అక్కడ డొక్కా, ఆర్కే ఈక్వేషన్‌ కష్టమన్నది ఓ టాక్‌. ఇక మిగిలింది గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజక వర్గాలు. గుంటూరు సిటీలోనే ఉండే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఎమ్మెల్యేలు డొక్కాకు అంటి పెట్టుకొని ఉంటుంటారు. కానీ స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవడం తప్ప డొక్కా ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలు ఏమీ ఉండవు. దీంతో జిల్లా అధ్యక్షుడు హోదాలో తాను ఎందుకు పనిచేస్తున్నాన్నో.. ఎవరిని కట్టడి చేయాలో.. ఎవరికి సలహాలు ఇవ్వాలో.. ఏ కార్యక్రమాలు నిర్వహించాలో తెలియక సతమతమవుతున్నారట. జిల్లా అధ్యక్షుడు హోదాలో ఏడు నియోజకవర్గాల కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలన్నా ఎవరు వస్తారు.. ఎవరు రారు.. వచ్చినవాళ్లు తన మాట వింటారో వినరో అనే అనుమానంతో ఉన్నారట డొక్కా. దీంతో చేసేదేమీ లేక పార్టీ కార్యక్రమాలు.. ఆదేశాలు పాటిస్తూ కాలక్షేపం చేస్తున్నారట.

Exit mobile version