Site icon NTV Telugu

Off The Record: వరంగల్ లో భూకబ్జాల కలకలం

Land Mine

Land Mine

ఓ MLC పార్టీ అధిష్ఠానానికి ఇచ్చిన నివేదిక వరంగల్‌లో నలుగురు ఎమ్మెల్యేలకు నిద్రలేకుండా చేస్తోందా? రిపోర్ట్‌ను ప్రస్తావిస్తే ఎవరు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ MLC ఇచ్చిన నివేదికలో ఏముంది? ఆయన ఎవరిపై ఆరోపణలు చేశారు?

కబ్జాల ద్వారానే రూ.వందల కోట్లకు పడగ
వరంగల్‌ జిల్లా BRSలో నాయకులను భూ కబ్జాల ఆరోపణలు వెంటాడుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్ పరిధిలో చాలాకాలంగా కబ్జాలపై విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేటర్లు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ఖాళీ జాగా కనిపిస్తే వదలడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు.. వారి అనుచరుల భూదందాలపై కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి ఉంది. కబ్జాల ద్వారానే వాళ్లు వందల కోట్లకు పగడలెత్తారని అధికారపార్టీలోనే టాక్‌. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే పనిగా పెట్టుకుని.. సామాన్యులనూ వదలడం లేదనే చర్చ సాగుతోంది. వీటిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వ పెద్దలకు సమాచారం కూడా ఇచ్చాయట. తాజాగా నలుగురు BRS ఎమ్మెల్యేల భూకబ్జాలపై అధికారపార్టీకే చెందిన ఓ MLC నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అది ఓరుగల్లు గులాబీ శిబిరంలో కలకలం రేపుతోంది.

నివేదిక ఇచ్చిన ఎమ్మెల్సీ అధిష్ఠానానికి దగ్గరా?
ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నారో తన నివేదికలో పూసగుచ్చినట్టు వెల్లడించారట ఆ MLC. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి దగ్గరగా ఉండే ఆ శాసనమండలి సభ్యుడు నేరుగా సీఎంకే ఆ రిపోర్ట్ ఇచ్చారట. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా చేస్తున్న తీరును అందులో ప్రస్తావించారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అధికారపార్టీలో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నిద్ర కరువైనట్టు సమాచారం. పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాల ఆధారంగా MLC నివేదికపై ఆరా తీస్తున్నారు ఆ శాసనసభ్యులు. ప్రస్తుతం ఓరుగల్లు రాజకీయాల్లో ఎవరిని కదిపినా MLC నివేదికే వారి మధ్య హాట్ టాపిక్‌.

ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌పై కాంగ్రెస్‌ నేత కొండా మురళీ ఆరోపణ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. పాదయాత్ర చేసిన షర్మిల తదితరులు ప్రధానంగా ఎమ్మెల్యేలపై భూకబ్జా ఆరోపణలే చేశారు. ఆ మధ్య ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ తన భూమిని కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నేత కొండా మురళీ ఆరోపించారు. దానిపై వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలోనే MLC నివేదికపై సమాచారం బయటకు రావడంతో గులాబీ శిబిరం ఉలిక్కి పడింది. వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేయాలని చూస్తున్న కొండా దంపతులు.. ఏమైనా ఉంటే అక్కడి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయాలి కానీ.. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ను ఎందుకు టార్గెట్ చేశారన్నది మరో ప్రశ్న. కొండా మురళీ భూమిని కబ్జా చేయడం సాధ్యమా అనేది గులాబీ నేతల వాదన. ఇందులో ఏదో కుట్ర ఉందని మురళీ ఆరోపణలను వినయ్‌ భాస్కర్‌ కొట్టిపారేస్తున్నా.. MLC నివేదికే వాళ్లను కలవర పెడుతోందట.

ఎమ్మెల్సీ ఇచ్చిన నివేదికలో వినయ్‌భాస్కర్‌ పేరు ఉందా?
MLC నివేదికలో ప్రస్తావించారని అనుకుంటున్న నలుగురు BRS ఎమ్మెల్యేల్లో వినయ్‌ భాస్కర్‌ ఉన్నారా.. లేరా అనేది మరో డౌట్‌. ఒకవేళ వినయ్‌ భాస్కర్‌ ఉంటే.. మిగతా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు? తరచూ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పేర్లు ఆ రిపోర్ట్‌లో ప్రస్తావించారా లేదా? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఆ ఎమ్మెల్సీ నివేదికను పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టికెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అని టెన్షన్‌ పడుతున్నారట గులాబీ శాసనసభ్యులు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వరంగల్‌ ల్యాండ్‌మైన్‌ గులాబీ శిబిరంలో గుబులు రేపుతోందనే చెప్పాలి.

Exit mobile version