ఘనమైన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్.. నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేశారన్న ప్రచారం ఉన్నప్పటికీ.. అవేమీ ఆ ఎమ్మెల్యేకి కలిసి రావడం లేదా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయా? రెండుసార్లు ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన చోట ఇప్పుడెందుకు సీన్ రివర్స్ అయ్యింది?
మూడోసారి టికెట్ కష్టమని ప్రచారం..!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీర ప్రాంత నియోజకవర్గం బాపట్ల. ఇక్కడ నుంచి 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు కోన రఘుపతి. ముచ్చటగా మరోసారి పోటీ చేసి బాపట్లలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని కోన చూస్తుంటే.. గ్రౌండ్‌లో పరిస్థితులు మరోలా ఉన్నాయట. ఈ దఫా ఆయనకు టికెట్ ఇస్తారా? అనేది కేడర్‌లో పెద్ద డౌట్. దీనికి కారణం నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై పెరుగుతున్న అసమ్మతి, రెడ్డి సామాజికవర్గం నుంచి ఆయనంటే వ్యతిరేకతే కారణమని బాపట్లలో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి కోన రఘుపతి వైఖరి కూడా కారణమన్నది కొందరు పార్టీ నేతల అభిప్రాయం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బాపట్లలో కాకుండా.. మరో చోట సీటు ఇవ్వొచ్చనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ అంశంపైనే ప్రస్తుతం బాపట్లలో చర్చ జరుగుతోంది.
అనుచరుల అవినీతిని పట్టించుకోలేదా?
2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్‌ను చేశారు సీఎం జగన్. మూడేళ్లపాటు ఆ పదవిలో ఆయన ఉన్నారు. ఆ సమయంలో నియోజకవర్గంలో కేడర్‌ను పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ చట్రంలోనే కోన ఉండిపోయారనే విమర్శలు ఉన్నాయి. తన అనుచరులు అవినీతికి పాల్పడినా కోన చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏనాడు చర్యలు తీసుకోలేదన్నది మరో ఆరోపణ. కేవలం నలుగురైదుగురు అనుచరులను వెంట పెట్టుకుని.. మిగతావారిని దూరం చేసుకున్నారని చెబుతారు. రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంక్, ఇతర వ్యాపారాలపై ఆరోపణలు వెల్లువెత్తినా కోన లైట్ తీసుకున్నారట. బాపట్లలో బలమైన రెడ్డి సామాజికవర్గంతోపాటు, ఎస్సీ సామాజికవర్గాన్నీ దూరం చేసుకోవడంతో సొంత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.
సర్వేల్లోనూ వెనుకపడ్డారని ప్రచారం
బాపట్లకు చెందిన గాదె వెంకటరెడ్డి, చీరాల గోవర్దన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కోన కలుపుకొని వెళ్లలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కర్లపాలెం ఎంపీపీ పదవిని రెడ్డి సామాజికవర్గానికి ఇస్తానని ఆశపెట్టి కోన మాట తప్పారని ఆ వర్గం గుర్రుగా ఉంది. ఎంపీపీ పదవిని ఎస్సీ మహిళకు ఇచ్చినా.. తర్వాత ఆమెను రాజీనామా చేయాలని ఒత్తడి చేయడంతో ఆ వర్గం భగ్గుమంది. ఈ విధంగా రెండు సామాజికవర్గాలు ఎమ్మెల్యే అంటే రుసరుసలాడుతున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు దాదాపు 27 వేలు.. ఎస్సీ సామాజికవర్గం ఓట్లు 32 వేలు ఉన్నాయి. మీ సామాజికవర్గం ఓట్లు ఎన్నో ఒకసారి చూసుకోవాలని ఎమ్మెల్యే కోనను ప్రశ్నిస్తున్నారట. దీనికితోడు పార్టీ నిర్వహించిన సర్వేల్లో కోన రఘుపతి వెనుకపడ్డారనే ప్రచారం జరుగుతోంది.
గుంటూరు పశ్చిమ లేదా మరోచోటుకు మారుస్తారని టాక్
రోజు రోజుకీ ప్రతికూలత ఎక్కువ అవుతుండటంతో కోనను బాపట్ల నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మరో నియోజకవర్గానికి పంపిస్తారనే టాక్ అధికారపార్టీ వర్గాల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో బాపట్ల సీటును రెడ్డి, లేదా ఎస్సీ సామాజికవర్గానికి ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్ఠానం ఉందని చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాపట్లలోని పార్టీ సీనియర్ల సూచన మేరకు అభ్యర్థిని ఎంపిక చేస్తారని కూడా అనుకుంటున్నారట. ఈ ప్రచారంతో బాపట్ల సీటు కోసం వైసీపీలో ఆశావహులు పెరుగుతున్నారు. మరి.. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఎమ్మెల్యే కోన రఘుపతి ఈ ప్రతికూలతల నుంచి బయట పడతారో లేదో చూడాలి.

