Site icon NTV Telugu

Off The Record: ఇద్దరు సిట్టింగ్ లకు ఇరకాటం

Sddefault (4)

Sddefault (4)

ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీలో వారసుల ఎంట్రీ కష్టమేనా? తండ్రుల సీటుపై కన్నేసిన తనయులకు పార్టీ అధినేత నో ఛాన్స్‌ అని చెప్పేశారా? ఈ దఫా పెద్దలకు మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో కొందరు సిట్టింగ్‌లు ఇరకాటంలో పడ్డారా? ఈ అంశంపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి?

వారసులను బరిలో దించేందుకు చూశారు..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని రాజకీయ నాయకులు చూడటం సహజం. అందులోనూ పదవిలో ఉండగానే వారసులను ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటారు కొందరు. కొడుకు లేదా కుమార్తెలను ఎమ్మెల్యేలుగా గెలిపించేస్తే ఓ పనైపోతుందని భావిస్తారు నేతలు. ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఇదే ఆలోచనలో ఉన్నారు. కొందరు శాసనసభ్యులైతే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి అర్జీలు పెట్టుకున్నారు కూడా. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాల్లో వారసులను తిప్పేస్తున్నారు. జనాలకు దగ్గర చేస్తూ వారే పోటీ చేస్తారనే సంకేతాలు ఇస్తున్న తరుణంలో పార్టీ హైకమాండ్‌ అలాంటి ప్రయత్నాలకు బ్రేక్‌ వేసింది. వరసగా మూడోసారి తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న గులాబీపార్టీ.. వచ్చే ఎన్నికల విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ రూపాల్లో సర్వేలు చేయించింది. ఆ సర్వే రిపోర్టుల ఆధారంగా కొందరు సీనియర్లను మళ్లీ పోటీ చేయించాలని చూస్తోందట పార్టీ. వాళ్లు కాకుండా ఇంకెవరు బరిలో ఉన్నా.. కష్టమన్నది ఓ అభిప్రాయమట. తాజాగా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా పార్టీ నేతలు ఉటంకిస్తున్నారు.

బాజిరెడ్డి, గంప ప్రయత్నాలకు చెక్‌
వచ్చే ఎన్నికల్లో కుమారులను బాన్సువాడలో పోటీ చేయించాలని పోచారం అనుకున్నారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో దానికి బ్రేక్‌ పడిందని టాక్‌. ఇదే విధంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మరికొందరు సీనియర్ శాసనసభ్యులు ఎన్నికల్లో తనయులను పోటీ చేయించాలని భావించారు. పోచారం ఎపిసోడ్‌ తర్వాత వారి ఆశలకు చెక్‌ పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్‌, గంప గోవర్దన్‌లు వారసుల కోసం ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి అర్జీ పెట్టుకున్నారు. తమ వయసు రీత్యా ఈ దఫా తమ తనయులకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరారట.

కుమారుడు జగన్‌ కోసం బాజిరెడ్డి అర్జీ
బాజిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా.. టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. రూరల్‌ సీటును జడ్పీటీసీగా ఉన్న తన కుమారుడు జగన్‌కు ఇప్పించేందుకు గట్టి పట్టే పట్టారట. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సైతం విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తన కుమారుడు శశాంక్‌ను తెరపైకి తెచ్చారు. నిజామాబాద్‌ రూరల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించిన సర్వేల్లో ఏం తేలిందో ఏమో.. పెద్దలకు మాత్రమే మళ్లీ ఛాన్స్‌ ఉంటుందని హైకమాండ్‌ హింట్ ఇచ్చింది. బాన్సువాడ బహిరంగ సభలో సీఎం ఇచ్చిన క్లారిటీనే వీళ్లకు వర్తిస్తుందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ వారసుల పోటీ కోసం తపించిన సీనియర్‌ శాసనసభ్యులు..తాజా పరిణామాలతో దిగాలు పడ్డారట. సీనియర్లే గెలుపు గుర్రాలు అని పార్టీ తేల్చేయడంతో తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాం. వచ్చే ఎన్నికల్లో కుమారులను బరిలో దించుదాం అని సమాధాన పర్చుకుంటున్నారట.

 

Exit mobile version