NTV Telugu Site icon

Off The Record: జోగయ్య జోస్యం ఫలిస్తుందా?

Maxresdefault (2)

Maxresdefault (2)

టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ లో ఒంటరి పోరుపై చర్చ..? మరి జనసేనతో పొత్తు సంగతేంటి..? | OTR | Ntv

టీడీపీ-జనసేన మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. అది ఉంటుందో లేదో కూడా తెలీదు. కానీ… రెండు పార్టీలకు సంబంధం లేని నాయకులు మాత్రం దానికి పురిట్లోనే పోపు పెట్టేసేలా ఉన్నారన్న ఆందోళన రెండు పార్టీల్లో వ్యక్తం అవుతోంది. పవన్‌కల్యాణ్‌ను సీఎంని చేస్తేనే పొత్తు ఉంటుందని కాపు నేత హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు ఎంత దాకా వెళ్తాయి? జోగయ్య మాటల్ని పవన్‌ పట్టించుకుంటారా? జనసేన లీడర్లు, కేడర్‌ మీద ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది? టీడీపీ రియాక్షన్‌ ఏంటి?

ఏపీలో హాట్‌ టాపిక్‌గా టీడీపీ-జనసేన పొత్తు
టీడీపీ-జనసేన పొత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌. రెండు పార్టీల అగ్ర నాయకత్వాల నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాకున్నా… అలా జరుగుతుందన్నది కింది స్థాయి నేతలు, కేడర్‌లో ఉన్న అభిప్రాయం. ఎవరు ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తారు..? ఎక్కడెక్కడ సీట్లు ఎవరికి వస్తాయి లాంటి హర్డిల్స్‌ రెండు పార్టీల ముందు ఉన్నాయి. ఇలా ఏ విషయంలోనూ క్లారిటీ లేకున్నా… పొత్తు మాత్రం ఖాయమనే ఫీలింగ్‌ ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది. బయట ఎన్ని చర్చోప చర్చలు జరుగుతున్నా.. ప్రచారం ఉన్నా.. ఇటు చంద్రబాబుకు.. అటు పవన్‌ కళ్యాణ్‌కు ఈ విషయంలో పక్కాగా క్లారిటీ ఉందనే భావనలో ఉన్నారు నేతలు. అయినా… అందరికీ ఎక్కడో ఏదో డౌట్‌. చివరికి ఏదైనా జరగొచ్చన్న అప నమ్మకం. ఎన్నికల్లో పొత్తులపై ఇటు టీడీపీ.. అటు జనసేన పార్టీలు అధికారిక ప్రకటన చేసే దాకా.. రాజకీయాలు ఎలాగైనా టర్న్‌ కావచ్చనే చర్చ కూడా అదే స్థాయిలోజరుగుతోంది. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తు మాటలు ఎడతెగకుండా జరుగుతున్నాయి.

టీడీపీ ఇన్నర్‌ సర్కిల్స్‌లో ఒంటరి పోరుపై చర్చ?
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ప్రస్తావన లేకుండానే టీడీపీ గెలిచింది. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహంతో వెళ్ళాలన్నది కొందరు తెలుగుదేశం నేతల్లో ఉన్న అభిప్రాయం.టీడీపీ ఇన్నర్‌ సర్కిల్స్‌లో ఈ చర్చ కాస్త ఎక్కువగానే జరుగుతోందట. అయితే ఈ మాటలను ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడటం లేదు… పార్టీ వర్గాల్లో మాత్రం అంతర్గతంగా అదే భావన ఉందట. కానీ సాధారణ ఎన్నికల్లో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడానికి టీడీపీ అధినాయకత్వం ఇష్టపడడం లేదట. పొత్తుల్లేకుండా టీడీపీ గెలవలేదని, చంద్రబాబు వ్యూహాలు ఫలించవని… ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా అస్సలు పట్టించుకోకూడదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట. ఎందుకంటే.. చిన్న ఛాన్స్‌ తీసుకున్నా… ఈసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది పార్టీ పెద్దల మధ్య జరుగుతున్న ఇన్నర్‌ టాక్‌. దీంతో జనసేన అవసరంపై ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఇలాంటి సున్నిత సందర్భంలో.. ప్రత్యేక పరిస్థితుల్లో మాజీ మంత్రి హరి రామజోగయ్య చేస్తోన్న కామెంట్లు.. రాస్తోన్న లేఖలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

పవన్‌ను సీఎంని చేస్తేనే పొత్తు అన్న జోగయ్య
పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడానికి చంద్రబాబు అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని, లేకుంటే లేదని..రెండు పార్టీల పొత్తు లేకుంటే హంగ్‌ వస్తుందంటూ కామెంట్‌ చేశారు జోగయ్య. అసలే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపు మీదున్న తెలుగుదేశం శ్రేణులు.. నేతలకు ఈ కామెంట్లు మంట పుట్టిస్తున్నాయి. అదెలా కుదురుతుందని మండిపడుతున్నాయి. కానీ.. అదంతా లోలోపలే తప్ప పైకి చెప్పుకోలేని పరిస్థితి టీడీపీ నాయకులది. జనసేన ఉంటే గెలుపు పక్కా అని.. కానీ జోగయ్య లాంటి వారు ఈ తరహా కామెంట్లు చేస్తూ ఉంటే అది అంతిమంగా జగన్‌కు లబ్ది చేకూరుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా గుర్తించాలని అంటున్నారు. ప్రస్తుతమున్న పరిణామాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే…హంగ్‌ అనేది ఒట్టి మాటేనని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఓటర్లు వన్‌ సైడ్‌గా వైసీపీకి ఓటేసేశారని, అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఏదో ఒక పార్టీ వైపే మొగ్గుతారు తప్ప హంగ్‌ ప్రసక్తే ఉండదన్నది టీడీపీ వర్గాల మాట.

టీడీపీ నేతలు గట్టిగా రియాక్ట్‌ అయితే పరిస్థితి ఏంటి?
హరిరామ జోగయ్య ఇలాగే మాట్లాడుతూ ఉంటే.. టీడీపీకి చెందిన ఏదోక నాయకుడు గట్టిగానే రియాక్ట్‌ అవుతారని, దాని పర్యవసానాలు ఎక్కడిదాకా వెళతాయో ఊహించడం కష్టమన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో బలంగా ఉంది. ఎంత సంయమనం పాటిస్తున్నా…రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అది కూడా అసలు జనసేన పార్టీ నాయకుడు కూడా కాని జోగయ్య పొత్తు గురించి మాట్లాడటం ఏంటని మథన పడుతున్నారట. పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. అందరూ ఆయన చెప్పినట్టే నడవాలని ఓ పక్కన చెబుతూనే.. మరోవైపు పొత్తుల విషయంలో పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అసలు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కానీ.. పవన్‌ కళ్యాణ్‌ కానీ మాట్లాడకుండా.. మొత్తంగా ఆ పార్టీని నడిపించేది తానే అనే రీతిలో జోగయ్య మాట్లాడ్డమేంటంటూ టీడీపీ నేతలు లోలోపలే ఉడికి పోతున్నారట. ఆయన మాటలను వింటూ కూర్చోలేని పరిస్థితి. అలాగని బయటకు మాట్లాడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారట. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని అన్నీ కంట్రోల్‌లో పెట్టుకుని యోగా మోడ్‌లో ఉన్నారట ఎక్కువ మంది టీడీపీ నేతలు.

బీజేపీకి ఆరెస్సెస్‌ తరహాలో జనసేనకు కేఎస్సెస్‌ అని జోగయ్య చేసిన కామెంట్లకు.. ప్రతిపాదనకు పవన్‌ కళ్యాణ్‌ ఎంత వరకు అంగీకరించారో లేదో తెలీదు కానీ.. ఈ సీనియర్‌ లీడర్‌ మాత్రం జనసేనకు తానే కేఎస్సెస్‌ అనే రీతిలో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ తతంగం అంతా చూస్తోంటే.. ఇంకా పొత్తు పొడవకముందే ఘాటైన పోపు పెట్టి.. అసలుకే ఎసరు తెచ్చేలావ్యవహరిస్తున్నారనే ఆందోళన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది. మరి జోగయ్య రాజకీయం ఏంటో… ఆయన వ్యాఖ్యల ప్రభావం ఎటు దారితీస్తుందోనన్న ఉంత్కంఠ పెరుగుతోంది.

Show comments