Site icon NTV Telugu

Off The Record : వాళ్ళే వెళ్ళగొడితే బెటరని జీవన్ రెడ్డి అనుకుంటున్నారా?

Jeevan Reddy

Jeevan Reddy

క్రమశిక్షణ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తనని తరచూ సెల్ఫ్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చుకునే ఆ మాజీ మంత్రి ఇప్పుడు కట్టు తప్పారా? మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కాకుండా స్వతంత్రులకు ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్ళు ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా ఉంటున్న ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇప్పుడు పార్టీనే తనను బయటికి గెంటేస్తే బెటరని భావిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏ పార్టీవైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది? జగిత్యాల కాంగ్రెస్ జగడం కొత్త టర్న్ తీసుకుంటోంది. కొంత కాలం నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీసుకన్న నిర్ణయంతో ఇటు క్యాడర్‌, అటు పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. పెద్దాయన అసలేం చేస్తున్నాడో అర్ధంకావడంలేదు, బుర్రలు హీటెక్కిపోతున్నాయని అంటున్నారు నాయకులు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్‌కు చేరువ అయినప్పటి నుంచి మొదలైన లొల్లి రోజుకో మలుపు తరుగుతోంది. అవకాశం దొరికిన ప్రతీసారి ఎమ్మెల్యే మీద, పార్టీ నాయకత్వం మీద విరుచుకుపడుతున్నారు పీసీసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కూడా అయిన జీవన్‌రెడ్డి. ఓసారి ఆవేదన వ్యక్తం చేస్తూ… మరోసారి ఆగ్రహం ప్రదర్శిస్తూ.. ఇంకోసారి నిర్వేదంగా మాట్లాడుతూ… ఫైనల్‌గా భావోద్వేగానికి గురవుతూ… ఇలా నలభై ఏళ్ల పొలిటికల్ అనుభవాన్ని రంగరించి రాజకీయ రంగస్థలంపై నవరసాలు పండిస్తున్నారు జీవన్‌ సాబ్.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ తన అసంతృప్తిని పీక్స్‌కి తీసుకెళ్లిన పెద్దాయన… పార్టీతో తాడో పేడో అన్నట్టు వ్యవహరిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే బీఫారాలు అన్నీ నేనే ఇస్తాను, అసలు ఎమ్మెల్యే సంజయ్ ఎవరు..? అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఒక దశలో తలలు నరికేదాకా వెళ్ళాయి మాటలు. అలాగే… గాంధీ భవన్‌లో జరిగిన సన్నాహక సమావేశానికి వెళ్లిన జీవన్… అక్కడ ఎమ్మెల్యే సంజయ్‌ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నో అంటూ బయటకు వచ్చేసి తన ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్‌రెడ్డి వర్గానికి 20 టికెట్లు, ఎమ్మెల్యే సంజయ్‌కి మనుషులకు 30 టికెట్లు ఇచ్చేలా డీల్ సెట్ చేశారు. అయితే… అప్పుడు ఏం మాట్లాడకుండా…. బీ ఫామ్స్‌ ఇచ్చే టైంలో జీవన్‌రెడ్డి చేసిన రచ్చఅంతా ఇంతా కాదు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్లా అంటూ విమర్శించారు. తనను పార్టీ పెద్దలు నానా గోస పెడుతున్నారని, తన మీద కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూసెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారాయన. ఇక జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన 20 మంది మున్సిపల్‌ నామినేషన్లు వేసారు… సంజయ్ వర్గానికి చెందిన 30 మంది కూడా బరిలో ఉన్నారు. ఈ తరుణంలో జగిత్యాలలో పార్టీ బాధ్యుడు బస్వరాజు సారయ్య జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పచ్చి కాంగ్రెస్‌ వాదినని పదేపదే చెప్పుకునే జీవన్‌రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయకపోవడం హాట్‌ టాపిక్‌ అయింది. చివరికి హస్తం గుర్తుపై పోటీ చేస్తున్న తన అనుచరులకు కూడా ప్రచారం చేయకుండా…బరిలో ఉన్న 30 మంది ఇండిపెండెంట్ల తరపున ప్రచారం చేశారాయన. కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడ్డం కూడా మింగుడు పడటం లేదట. అలాగే…. నమ్మి బరిలోకి దిగిన తమకు కాకుండా ఇండిపెండెంట్లకు ఆయన ప్రచారం ఏంటంటూ…అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు ఎమ్మెల్యే సంజయ్‌ని టార్గెట్ చేస్తూ జగిత్యాలలో కరపత్రాలు పంచి వైరల్ చేశారు జీవన్ వర్గీయులు. ఉదయాన్నే న్యూస్‌ పేపర్లతో పాటు వచ్చిన కరపత్రాలు పట్టణంలో కలకలం రేపాయి. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న సంజయ్.. అవినీతి పరుడు అంటూ పాంప్లెంట్స్‌ని పంచిపెట్టేశారు. దీనిపై ఆరాతీసిన పోలీసులు ఇది జీవన్‌రెడ్డి అనుచరుల పనేనని తేల్చారట. పార్టీ సీనియర్ నేత ఎన్నికల సమయంలో… ఇలా వ్యవహరించడంపై హస్తం నాయకత్వం కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో చర్యలు వద్దని నాయకత్వం భావిస్తుండగా…. వాళ్ళే పార్టీ నుంచి తనను వెళ్లగొడిటే బెటరని జీవన్‌రెడ్డి అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలా వెళ్లగొడితే సింపతీ వస్తుందన్నది ఆయన వ్యూహం అని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో జీవన్‌రెడ్డితో గులాబీ బాస్ టచ్‌లో ఉన్నారనే టాక్‌ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… జీవన్‌ని బీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానిస్తూ ఫోన్‌ చేశారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కాంగ్రెస్‌తో తాడోపేడో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. కీలక సమయంలో తలనొప్పిగా తయారయ్యారనే ప్రచారం సాగుతున్న జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ చర్యలు తీసుకుంటుందా..? లేదంటే సంజయ్‌కి ఎక్కువ ప్రయార్టీ ఇస్తూ జీవన్‌…. తనంతట తాను వెళ్లిపోయేలా చేస్తారా అన్నది చూడాలి. జగిత్యాల కాంగ్రెస్ ఫైట్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

 

Exit mobile version