Site icon NTV Telugu

Off The Record: ఈ నాయకుడు మాకొద్దు.. కేడర్ గగ్గోలు..!

Off

Off

Off The Record: ఎక్కడన్నా… ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉండటం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని విమర్శించడం సహజం. కానీ… అక్కడ మాత్రం ఓడిపోయిన, ప్రతిపక్ష నేతను అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. అందునా, వాళ్ళు వీళ్లు కాకుండా… సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీస్తున్న వాతావరణం. ఏ నియోజకవర్గంలో ఉందా స్థితి? ఏ మాజీ ఎమ్మెల్యేని నువ్వు మాకొద్దు మహాప్రభో అని కేడర్‌ దండం పెడుతోంది?

7800mAh బ్యాటరీ, IP66/68/69/69K రేటింగ్ లతో వచ్చేస్తున్న OnePlus Ace6 స్మార్ట్ ఫోన్..!

రెండు పార్టీల తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడమంటే… అదేం చిన్న విషయం కాదు. అంత సీనియర్ లీడర్‌ ముందు నోరు మెదపడానికి ద్వితీయ శ్రేణి నాయకులైనా, కేడర్‌ అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. కానీ… పోలవరంలో మాత్రం పరిస్థితి కాస్త డిఫరెంట్‌గా ఉందట. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి…. ఏం ఊడబొడిచావ్‌, నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టావ్‌, పుణ్యకాలమంతా… వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోడానికి,పదవులు అమ్ముకోవడానికే సరిపోయిందికదా అంటూ…. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును నిలదీస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2012ఉప ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచారు బాలరాజు. 2014లో ఓడినా… తిరిగి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారాయన. అయితే… ఆయన ప్రవర్తన కారణంగా…2024 ఎన్నికల్లో బాలరాజు సారధ్యంలో పనిచేసేందుకు వైసీపీ కేడర్‌ ఒప్పుకోకపోవడంతో…మధ్యే మార్గంగా ఆయన భార్యను రంగంలోకి దించారు పార్టీ పెద్దలు. మార్చేశామని పైకి కవరింగ్ ఇచ్చినా… కేడర్‌ మాత్రం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో… గత ఎన్నికల్లో స్పల్ప తేడాతో పోలవరం సీటు పోగొట్టుకుంది వైసీపీ.

ఎమ్మెల్యే సీట్లో ఉంటే దండుకోవడం, ఓడిపోతే అడ్రస్‌ లేకుండా పోవడం తెల్లం బాలరాజుకు వెన్నతో పెట్టిన విద్య అని కేడర్‌ అసహనంతో ఉన్న క్రమంలోనే తిరిగి ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా నియమించడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఆయన వద్దంటూ రోడ్డెక్కేందుకు సిద్ధమవుతోందట వ్యతిరేక వర్గం. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తలకు అండగా ఉండటం కంటే సొంత లాభం కోసమే ఎక్కువ పాకులాడే ఆ నాయకుడు మాకొద్దంటే వద్దు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారట పోలవరం వైసీపీ కార్యకర్తలు. రెండు దశాబ్దాలుగా ఆయన్ని మోస్తున్నామని, అవసరం ఉన్నప్పుడు మాత్రం వెంటేసుకుని తిరిగి పదవిలోకి వచ్చాక మాత్రం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకుండా పక్కపార్టీ వాళ్ళని పిలిచి మరీ ప్రాధాన్యత ఇస్తారని అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి కోసం ఇప్పటి నుంచి పనిచేయాలంటే మా వల్లకాదని అంటున్నారట లోకల్‌ వైసీపీ లీడర్స్‌. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అయినా… నియోజకవర్గంలో నేతల్ని పట్టించుకోని బాలరాజుకే మళ్ళీ ఇంఛార్జి బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ మండిపడుతున్నారట.

ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi TV S Pro Mini LED లాంచ్.. ధర ఎంతంటే.?

ఆ అసంతృప్తితోనే… సొంత క్యాడర్ పార్టీ కార్యక్రమాలకు దూరం జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలరాజు నాయకత్వం మాకొద్దని అంటున్నా… అధిష్టానం మాత్రం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది పోలవరం వైసీపీ లీడర్స్‌ ప్రశ్న. పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టున్న నియోజకవర్గంలో పార్టీ ఖాళీకాక తప్పదన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట.నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో బాలరాజు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారట. రేపోమాపో వాళ్ళంతా రోడ్డెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నా… వైసీపీలోని వర్గపోరుకారణంగా జనంలోకి వెళ్ళలేకపోతున్నామని కేడర్‌ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా పోలవరం నియోజకవర్గం మీద దృష్టిపెట్టకుంటే… ఇక మర్చిపోవడమేనన్నది లోక్‌ కేడర్‌ మాట.

Exit mobile version