Site icon NTV Telugu

Off The Record: ముందస్తు ముచ్చట.. పట్టుదలగా మంత్రి తుమ్మల?

Khammam Municipal Corporation Elections

Khammam Municipal Corporation Elections

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కాబోతోందా? ఎలక్షన్‌ టైంలో దాని గురించే ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం తీసుకునే ఓ నిర్ణయం వివాదాస్పదం అవుతుందా? దాని ఫలితంగా పొలిటికల్‌ ప్రకంపనలు రేగుతాయా? ఇంతకీ ఏం జరిగే ఛాన్స్‌ ఉంది ఖమ్మంలో? అన్నిటినీ వదిలేసి ఆ కార్పొరేషన్ గురించే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది?

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న టైంలో… ఖమ్మం మున్సిపాలిటీ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఈ కార్పొరేషన్‌కు గతంలో కాస్త ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో… కాలపరిమితి వచ్చే మే 8 వరకు ఉంది. కానీ… ఇప్పుడే మిగతా మున్సిపాలిటీలన్నిటితోపాటే ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్‌ ఆలోచించడం కాక రేపుతోంది. అందుకు బీఆర్‌ఎస్ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలున్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటయ్యాక ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరిగితే… రెండు విడతల్లోనూ బీఆర్‌ఎస్సే గెలిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం ముందస్తుకు వెళ్లాలంటే గులాబీ కార్పొరేటర్స్‌ సహకారం తప్పని సరి. ఇక్కడే ఉత్కంఠ రేగుతోంది. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముందస్తుకే సుముఖంగా ఉన్నారట.

అన్ని అభివృద్ధి పనుల్ని పూర్తి చేసి మేలోనే ఎన్నికలకు వెళ్లాలని ఓవైపు ఉన్నా… ఇప్పుడు అందరితో కలిసి వెళితే అడ్వాంటేజ్‌ ఉంటుందన్న అభిప్రాయం కూడా బలంగానే ఉందంటున్నారు. ఆ ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే… అందుకు కార్పొరేషన్‌లో తీర్మానం చేయాలి. అది నెగ్గాలంటే కనీసం 40 మంది కార్పొరేటర్స్‌ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 60 మంది కార్పొరేటర్స్‌ ఉండగా… గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పదిమంది గెలిచారు. ఇక పార్టీ మారిన వారితో కలుపుతున్నా…అధికార పార్టీ బలం 31 మాత్రమే. ఆ లెక్క ప్రకారం తీర్మానం నెగ్గడానికి ఇంకో తొమ్మిది మంది కార్పొరేటర్స్‌ అవసరం అవుతారు. ఆ బలం కోసం ఇప్పుడు కాంగ్రెస్‌ గాలం వేస్తోందట. ఇప్పటికే కండువా మార్చేందుకు నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్స్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తయితే… లెక్కలు తారుమారైపోయి… కావాల్సిన బలం రాకుంటే… కాంగ్రెస్‌ దగ్గర ప్లాన్‌ బీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక జీవోతో కార్పొరేషన్‌ ఎన్నికల్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఈ ప్రకారం ఎలాగైనా… ముందస్తు ఎన్నికలకే వెళ్లాని మంత్రి తుమ్మల పట్టుదలగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు స్థానిక కాంగ్రెస్‌ నేతలు. ఖమ్మంకు విడిగా, ప్రత్యేకంగా మున్సిపల్‌ ఎన్నికలు జరిగితే… అప్పుడు ఖాళీగా ఉండే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా ఇటువైపు దృష్టి పెడతారని, దానివల్ల అనవసరమైన వత్తిడి పెరుగుతుందని, అసలు వాళ్ళ ఆ ఛాన్స్‌ ఎందుకివ్వాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించుకోవడం మంత్రి తుమ్మలకు కూడా ప్రతిష్టాత్మకం కావడంతో… ఆయన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ముందస్తుకు వామపక్షాలు మద్దతిస్తే… ఎంపీ, ఖమ్మం, పాలేరు, ఎమ్మెల్యేల ఓట్లతో తీర్మానాన్ని ఓకే చెయ్యడానికి వ్యూహం సిద్ధమవుతోందట. మొత్తంగా ఖమ్మం కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు తప్పవన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.

Exit mobile version