Site icon NTV Telugu

Off The Record: ఆ అదాలత్ తో కొత్త చిక్కులు

Sddefault (5)

Sddefault (5)

కాంగ్రెస్ లో ధరణి అదాలత్ కొత్త సమస్య తీసుకొచ్చిందా ?  | Off The Record | Ntv

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య లొల్లి సరిపోనట్టు ఏఐసీసీ నాయకులు కూడా వివాదాలకు కారణం అవుతున్నారు. ఏఐసీసీలో కీలక నేతగా ఉన్నామని.. ఇక్కడి నాయకులకు చెప్పకుండా తెలంగాణ అంశాల్లో వేలు పెట్టడంతో ఆ ఇద్దరు నాయకులకు మండిందట. అదే ఇప్పుడు వివాదమై కూర్చుంది.

కొప్పుల రాజు తీరుతో టీ కాంగ్రెస్‌ నేతలు గుర్రు
తెలంగాణ కాంగ్రె సీనియర్ నాయకుడు కోదండరెడ్డి చాలా ఏళ్లుగా ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ధరణి వెబ్‌సైట్‌తో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలపై జిల్లాల వారీగా ఆందోళనలు చేపట్టారు. సమస్యల తీవ్రతను బట్టి పిసిసి స్థాయిలో ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీకి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. గాంధీభవన్‌లో పలు దఫాలుగా పార్టీ నాయకులతో సమావేశాలు కూడా జరిగాయి. ధరణిలో రైతుల సమస్యలపై సమీక్షలు కార్యాచరణలను సిద్ధం చేశారు. కానీ ఎఐసిసిలో ఉన్న కొప్పుల రాజు ధరణి అంశంపై వేలు పెట్టారు. మొదటి నుంచి ధరణిపై పోరాటం చేస్తున్న కిసాన్ కాంగ్రెస్ నాయకులను కాదని.. కనీస వారికి సమాచారం ఇవ్వకుండా ధరణి అదాలత్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అంశంపై కొన్నేళ్లుగా పనిచేస్తున్న కోదండరెడ్డిని గాని…ధరణి కమిటీకి చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహను గాని సంప్రదించలేదట.

ధరణి అదాలత్‌ కొత్త సమస్య తీసుకొచ్చిందా?
ధరణి అదాలత్ ఏంటన్నది చర్చించకుండా.. కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొప్పుల రాజు ఏఐసీసీలో ఉంటూ కనీసం రాష్ట్రంలో ఆ సమస్యపై పోరాడుతున్న నాయకులతో చర్చించకుండా పెద్దపల్లిలో ధరణి అదాలత్‌ ప్రారంభించడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. పార్టీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంటే ఏఐసీసీ నాయకులు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారని పిసిసిలోని ఓ ముఖ్య నాయకుడు ఒంటి కాలిపై లేస్తున్నారు.

ధరణి అదాలత్‌పై పార్టీ పెద్దలకు రాజనర్సింహ ఫిర్యాదు
ధరణి కమిటీకి చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ కూడా కొప్పుల రాజు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ పత్రం ఇవ్వడమే ధరణి అదాలత్ ఉద్దేశం. అయితే కొప్పుల రాజు.. దామోదర రాజనర్సింహకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ అంశంపై ఇటీవలే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడారు రాజనర్సింహ. సమన్వయం లేకుండా ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తే ఎలా అని ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

సమాచారం ఇవ్వరు కానీ.. సభలకు లోకల్‌ లీడర్స్‌ కావాలట..!
ధరణి అదాలత్ కోసం పనిచేయాల్సింది కిసాన్ కాంగ్రెస్ నేతలే. కానీ కొప్పుల రాజు తీరు ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో మరో సమస్యకు కారణం అయ్యింది. ఫీల్డ్‌లో పనిచేయడానికి తమ అవసరం గుర్తొచ్చి వెంటనే రావాలని పిలుస్తున్నారని.. అదేదో ముందే చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ప్రస్తుతం ఈ సమస్య ఎలాంటి మలుపులు తిరుగుతుంది? పార్టీ పెద్దలు పిలిచి వివరణ అడుగుతారా? ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను బుజ్జగించేది ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Exit mobile version