ఆ మాజీ MLA లక్కు తిరగబోతోందట. హామీ ఇచ్చినా ఇన్నాళ్లూ పదవి దక్కని ఆ నేతకు ఇప్పుడు డబుల్ ఆఫర్స్ వచ్చాయట. అయితే MLC.. కాకుంటే MLA కావడం గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్‌కు వచ్చారట. పదవి రాలేదని మౌనంగా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు స్పీడ్ పెంచారట. అటు అధిష్ఠానం కూడా ఆయన్ను పిలిచి మరీ ప్రాధాన్యం ఇస్తోంది. MLC అయితే పర్వాలేదు. మరి MLA సీటు ఇవ్వాలనుకుంటే ఆమె ఫేట్ ఏంటోనన్న చర్చ నడుస్తోంది.
2004లో చిలకలూరిపేట ఎమ్మెల్యే
చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్‌కు పేరు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. చిలకలూరిపేట నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సోమేపల్లి సాంబయ్యకు రాజశేఖర్ అల్లుడు. సోమేపల్లి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మర్రి.. 2004లో చిలకలూరిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా టెక్నికల్ సమస్యతో అది రద్దు కావడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 212 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మర్రి ఓడిపోయారు. ఈ రెండుసార్లు టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. 2019లో మర్రికి సీట్ రాలేదు. తొలుత టీడీపీలో చేరి.. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వైసీపీ కండువా కప్పుకొన్నారు విడదల రజనీ.. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. బీసీ, మహిళ కావడంతో రజనీకి కలిసి వచ్చాయి.
ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకుంటామని నాడు హామీ
మర్రి రాజశేఖర్ సీటును రజనీకి ఇచ్చిన జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఎన్నికల ప్రచార సభలో బహిరంగంగానే హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఇంత వరకు మర్రి ఎమ్మెల్సీ కాలేదు. ఆయన అలకబూనారు. పేటలో ఏ కార్యక్రమం జరిగినా టచ్ మీ నాట్‌గా వ్యవహరించడం.. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్నా పార్టీతో సంబంధం లేనట్టు ఉండేవారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానం ఆయనకు ప్రాధాన్యం పెంచింది. వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా కోర్డినేటర్‌గా నియమించారు జగన్. పార్టీ పదవితో రాజ్‌శేఖర్ స్పీడ్ పెంచారు. సొంత జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశాలకు ఆయన వస్తున్నారు. రాజశేఖర్ దూకుడు చూసి ఆరా తీసిన కేడర్ ఆశ్చర్యపోయిందట.
ఎమ్మెల్సీ కాకపోతే ఎమ్మెల్యే టికెట్ ఆఫర్?
ఈసారి MLC ఖాళీల భర్తీ సమయంలో అవకాశం ఇస్తామని వైసీపీ అధిష్ఠానం మర్రికి చెప్పిందట. ఒకవేళ ఎమ్మెల్సీగా ఛాన్స్ రాకపోతే రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు తిరిగి తనకేనని ఆయన ప్రచారం ప్రారంభించారట. రజనీని గుంటూరు లేదా సత్తెనపల్లిలో పోటీ చేయించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు మర్రి వర్గం ప్రచారం చేస్తోందట. దీంతో ఈసారి పేటలో పోటీ చేసేది నేనే.. గెలిచేది నేనే అని మర్రి రాజశేఖర్ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారట. కొంతకాలంగా కేడర్‌ను యాక్టివేట్ చేసే పనిలో పడ్డారట. ఇప్పటికే మూడేళ్లు వృధా అయ్యిందని.. రానున్న రోజుల్లో కష్టపడి పనిచేస్తే పార్టీ మనకి బంపర్ ఆఫర్ ఇచ్చే దూరం ఎంతో దూరంలో లేదని కేడర్‌తో ఆయన చెబుతున్నారట.
మర్రికి సీటు ఇస్తే రజనీ పరిస్థితి ఏంటి?
ఇన్నాళ్లూ .. ఇన్నిసార్లు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేసినా ఇవ్వని పదవి రాజశేఖర్ అనుకున్నట్టు మార్చిలోనైనా వస్తుందా లేక రాబోయే ఎన్నికల్లో పేట సీటు ఇస్తుందా అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మర్రికి సీటు ఇస్తే రజనీ పరిస్థితి ఏంటి? గెలిచింది ఒక్కసారే అయినా మంత్రి పదవి ఇచ్చి స్టేటస్ పెంచి.. ఆమెను అక్కడి నుంచి పంపేస్తారా? ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న చర్చ పేటలో జోరుగా జరుగుతోంది.

