తెలంగాణలో అధికార పార్టీకి ఆ కొద్ది మంది నాయకులు తలనొప్పిగా మారారా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పెడుతున్నారా? అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పోరు ఎలా మారబోతోంది? పార్టీని దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుందా? ఈ లోపు అధిష్టానం బ్రేకులు వేస్తుందా?
ఎమ్మెల్సీలు ఉన్నచోట్ల తీవ్ర స్థాయి విభేదాలు
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది గులాబీ నాయకత్వం. ఎన్నికల టైంకి నేతల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్ చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే… కొద్ది రోజుల నుంచి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఉన్న చోట స్థానిక ఎమ్మెల్యే లతో విభేదాలు తీవ్రమవుతున్నాయట. ఎన్నికల ఏడాది కావడంతో ఈ గ్రూప్ తగాదాలు ఎటువంటి ప్రభావం చూపుతాయి అన్న చర్చ మొదలైందట పార్టీలో.
బీఆర్‌ఎస్‌ను కంగారు పెడుతున్న ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ పోరు
అధికార పార్టీలో కొన్ని చోట్ల ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ పోరు తీవ్రంగానే ఉందట. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , కోటి రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి ఇలా… చాలామంది ఈసారి తాము ఆశిస్తున్న నియోజకవర్గాలపై పట్టు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారట. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇరుకున పెడుతోందట. కొన్ని సార్లు శృతిమించి నేరుగా పార్టీ నాయకత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయట. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు ,సమావేశాలు ,ప్రారంభోత్సవాలు ఇలా ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడల్లా గ్రూప్ తగాదాలు బయట పడుతున్నాయట.
ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో … నియోజకవర్గాల్లో సయోధ్య కుదరని ఒకరిద్దరు ఎమ్మెల్సీలు సొంత దారి చూసుకుంటున్నారా అన్న గుస గుసలు కూడా మొదలు అయ్యాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ఎమ్మెల్సీల రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి…అవి తమ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ బీఆర్‌ఎస్‌లో జరుగుతోందట. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్సే పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.