తెలంగాణ వ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తున్నారు. ఈ టైంలో ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో పాటు…వాళ్లపై కంప్లయింట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారట. అసలు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు వాళ్లకొచ్చిన ఆ కష్టమేంటి? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ల దగ్గర నుంచి వివరాలు తీసుకునేందుకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. వారిచ్చిన సమాధానాల కాపీలను… వారిపై కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించింది స్పీకర్ కార్యాలయం. దానితోపాటు వాళ్ల రిప్లై తప్పని చెప్పడానికి ఇంకా ఏమైనా వివరాలు ఉంటే అందజేయండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం.కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంపై తమ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటూ స్పీకర్ కార్యాలయానికి పంపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఆధారాలను కేవలం పేపర్ల రూపంలో కాకుండా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పీకర్ ఆఫీసు నుంచి మరోసారి రిప్లై వచ్చింది.
ఇక్కడే అసలు ఇబ్బందులు మొదలైపోయాయి అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 8 మందికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పై వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. అలా ఆ ఎనిమిది మందిపై కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆధారాలను అఫిడవిట్ రూపంలో ఇస్తూ వస్తున్నారు. ఈ ఆధారాల ఆఫిడవిట్లను ఇవ్వడానికి చాలా ప్రాసెస్ ఉంది అంటోంది బీఆర్ఎస్. స్పీకర్ కార్యాలయం రూపంలో అడిగింది కాబట్టి పకడ్బందీగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒక్కొక్క అఫిడవిట్ దాదాపు 50 నుంచి 60 పేజీలు ఉన్నాయి. ఆ 50 , 60 పేజీలలో ముందు,వెనుక వైపు రెండు వైపులా ఈ కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు గా తమ సంతకం చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఇలా ఒక అఫిడఫిట్ కు 100 కు పైగానే సంతకాలు చేయాల్సి వస్తుందంటున్నారు. అలా మూడు కాపీలను సబ్మిట్ చేయాలి కాబట్టి మొత్తం 300 కు పైగానే సంతకాలు చేయాల్సి వచ్చింది అని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కంప్లైంట్ అయితే ఇచ్చాము కానీ ఈ సంతకాలు పెట్టలేక విసిగిపోతున్నామని వాపోతున్నారు.
ఇలా కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా పని చేసిన మాజీ మంత్రులైతే తాము మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇన్ని సంతకాలు పెట్టలేదని, ఇప్పుడు అఫిడవిట్ల కోసం ఇన్ని సంతకాలు పెడుతున్నాం అంటున్నారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎన్ని సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉన్నా సరే అన్నిటికి సిద్ధం గా ఉన్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ కార్యాలయం నుంచి అడిగిన విధంగానే పూర్తిస్థాయిలో తమ అఫిడవిట్లను సంతకాలు చేసి సబ్మిట్ చేస్తున్నామంటున్నారు. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన విధంగా తాము రిప్లై ఇచ్చాం కాబట్టి కచ్చితంగా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడుతుంది అని చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు సంతోష పడవచ్చు కానీ వాళ్లపై వేటు వేసేందుకు పకడ్బందీగా అఫిడవిట్లో సంతకాలు చేసి మరి తయారు చేసామంటున్నారు వాళ్లు. త్వరలోనే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తారనేది వారి భావన. అందుకే కష్టమైనా సరే ఇష్టంగానే అన్ని సంతకాలు పెట్టి సబ్మిట్ చేస్తున్నామని చెబుతున్నారు.
