NTV Telugu Site icon

Off The Record: వాళ్ళిద్దరూ కలిసి నడుస్తారా?

Maxresdefault (4)

Maxresdefault (4)

ఆ ఎమ్మెల్యే ఆచితూచి అడుగులు వేస్తున్నారా.? l Off the Record l NTV

నియోజకవర్గాల్లో దూకుడు పెంచుతోంది అధికారపార్టీ బీఆర్‌ఎస్‌. ఎమ్మెల్యేలు, ఇంఛార్జులతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఊరందరిదీ ఓ దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఓ నియోజకవర్గ నేతల తీరు ఉంది. ఆ సెగ్మెంట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

కుత్బుల్లాపూర్‌లో ఆత్మీయ సమ్మేళనాల సందడి లేదా?
కుత్భుల్లాపూర్‌. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతున్న నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే అధికారపార్టీకి చెందిన వివేకానందగౌడ్‌. గులాబీ శిబిరంలో కుత్భుల్లాపూర్‌లో చర్చకు కారణం.. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకోకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆత్మీయ సమ్మేళనాలకు ప్రాధాన్యం ఇస్తోంది అధిష్ఠానం. ఈ సమ్మేళనాల విజయవంతానికి జిల్లాల వారీగా ఇంఛార్జులను కూడా నియమించారు పార్టీ పెద్దలు. ఎక్కడైనా సమస్యలు తలెత్తినా.. పార్టీ పెద్దల మధ్య తగువులు గుర్తించినా.. జిల్లా ఇంఛార్జులు ఎక్కడికక్కడ సరిచేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటే.. కుత్బుల్లాపూర్‌లో ఆశించినంత సందడి లేదు. దీనికి కారణం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్యపోరేనని తెలుస్తోంది.

ఆచితూచి అడుగులు వేస్తోన్న ఎమ్మెల్యే వివేక్‌
మేడ్చల్‌ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే వివేకానంద ఆత్మీయ సమ్మేళనాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా MLC శంభీపూర్‌ రాజు ఉన్నారు. వీరిద్దరికీ కొంతకాలంగా పొసగడం లేదు. నియోజకవర్గంలో భిన్న ధృవాలుగా మారిపోయారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే దానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో శంభీపూర్‌ రాజు వెళ్లారు. కానీ.. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ వర్గానికి చెందిన లోకల్‌ లీడర్స్‌ రాలేదు. మీటింగ్‌కు రావాలని వాళ్లకు ఎమ్మెల్యే వివేక్‌ నుంచి పిలుపు లేకపోవడంతో వెళ్లలేదని కొందరి వాదన. అయితే జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న ఎమ్మెల్సీనే తన వర్గాన్ని సమావేశానికి తీసుకురావాలని వివేక్‌ శిబిరం చెబుతోంది.

సీటు విషయంలో వివేక్‌, శంభీపూర్‌రాజు మధ్య తగువు
కుత్బుల్లాపూర్‌ సీటు విషయంలో వివేక్‌, శంభీపూర్‌రాజుల మధ్య తగువు నెలకొంది. ఈ సీటును శంభీపూర్‌రాజు కూడా ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా తనకే ఇవ్వాలనేది వివేక్‌ డిమాండ్‌. సిట్టింగ్‌లకే టికెట్స్‌ అని అధిష్ఠానం చెప్పడంతో చాలా ధీమాగా ఉన్నారు వివేక్‌. కానీ.. ఎమ్మెల్సీ వర్గం నుంచి ఎదురవుతున్న సవాళ్లతో కినుక వహించారు. ఇదే సమయంలో ఆత్మలు కలవడం లేదన్న ఎమ్మెల్యే కామెంట్సూ చర్చకు కారణం అవుతున్నాయి. కుత్బుల్లాపూర్‌ సమస్య పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి దిద్దుబాటు చర్యలు లేవనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాల విషయంలో ఎమ్మెల్యే వివేక్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలపై పార్టీ ఏం చేస్తుంది? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి సాగుతారా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.