ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో ఆధిపత్య పోరు ఎక్కువైంది. సగానికిపైగా నియోజకవర్గాల్లో నేతల మధ్య వార్.. హైకమాండ్‌కి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కాస్తో కూస్తో బలపడిన అసెంబ్లీ స్థానాల్లోనూ లీడర్స్ ఫైట్.. ఎటు దారి తీస్తోందో అంతుచిక్కడం లేదట.
ఎవరికి వారుగానే కార్యక్రమాల నిర్వహణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్. కీలక నాయకులు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ.. గ్రూపు తగాదాలు వారిని కలవర పెడుతున్నాయట. ఉమ్మడి జిల్లా పరిధిలోని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో క్యాడర్ వర్గాలుగా చీలిపోయింది. ఆయా వర్గాల నేతలు ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది.
సంజయ్‌పై విమర్శలు చేసిన ధర్మపురి ఇంఛార్జ్ అంజయ్య
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రూప్ వార్ ముదురు పాకాన పడుతోంది. ప్రత్యర్థులను వదిలేసి.. సొంత పార్టీలోనే ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ధర్మపురిలో ఇంఛార్జ్‌గా ఉన్న కన్నం అంజయ్య ఓ అడుగు ముందుకేసి.. బండి సంజయ్‌నే గురిపెట్టారు. ధర్మపురిలో ఆధిపత్యపోరాటానికి సంజయ్యే కారణమని ఆయన ఆరోపించారు కూడా. గత రెండు ఎన్నికల్లో అంజయ్య ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ దఫా ధర్మపురి సీటును పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో అంజయ్య గుర్రుగా ఉన్నారట. ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తే ఇప్పుడు కొత్త వారిని ఎలా ప్రోత్సహిస్తారనేది అంజయ్య ప్రశ్న.
పెద్దపల్లి బీజేపీలో మూడు ముక్కలాట
పెద్దపల్లి బీజేపీలో మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావుకు పడటం లేదు. మరో నేత సురేష్‌రెడ్డి కూడా ఇక్కడో గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ మూడు వర్గాలు పరస్పరం విమర్శలు.. ఆరోపణలతో పార్టీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వేములవాడ బీజేపీలోనూ ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే.. గతంలో పోటీ చేసిన జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మరోవైపు కాలు దువ్వుతున్నారు. ఇక ఈటల రాజేందర్‌తోపాటు బీజేపీలో చేరిన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమ టికెట్‌పై ఆశలు పెట్టుకుని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈటల ఆశీసులతో మహిళల కోటాలో టికెట్ తనకే అని చెబుతున్నారట ఉమ.
రామగుండంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు అసహనం
ఇక రామగుండంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పార్టీ నేత కౌశిక హరి మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఈ గ్రూప్ వార్‌తో విసుగెత్తి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సోమారపు. తనకంటూ సొంత క్యాడర్ ఉన్నప్పటికీ సోమారపు అసహనంతో పార్టీలో కొనసాగుతున్నారట. హుస్నాబాద్‌లో ఇటీవలే బీజేపీలో చేరిన బొమ్మ శ్రీరాం, జొన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు చెరోదారిలో వెళ్తున్నారట. ఇద్దరు వ్యక్తిగత ప్రచారం చేసుకుంటూ టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారట. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హుస్నాబాద్‌లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ ఇద్దరు నేతల స్పందన ఏంటనేది కేడర్‌కు అంతుచిక్కడం లేదట. మొత్తానికి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా పార్టీ పరిస్థితి తయారైందని.. వర్గపోరును తలచుకుని కాషాయ శిబిరం కలవర పడుతోందట.

