ఆయన వైసీపీలో సీనియర్ నేత. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అదీ ఒకసారి..అరసారి కాదు. పదే పదే జరుగుతూనే ఉంది. ఒకసారి టీడీపీలో చేరబోతున్నారని .. ఇంకోసారి జనసేనతో టచ్‌లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంతో ఇరకాటంలో పడుతున్నారట. పార్టీ మారటం లేదు మొర్రో అంటూ తరచూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందట. ఇటువంటి ప్రచారాలు సొంత పార్టీలోని ప్రత్యర్థుల పనేనని ఆయన భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు?
అన్నీ వెనువెంటనే జరగడంతో ప్రత్యర్థులు రంగంలోకి దిగారా?
బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అధికారపార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతూ.. ఆ పదవిని వదులుకుని జగన్ వెంట నడిచారు. జగన్‌కు దగ్గర బంధువు కూడా. వైసీపీలో మొదటి నుంచి ముఖ్యనేతగా ఉన్న బాలినేని చక్రం తిప్పేవారు. గత మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయనకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే కారణాలు ఏవైనప్పటికీ ప్రకాశం, బాపట్ల జిల్లాల బాధ్యతల నుంచి తప్పించి తిరుపతి, కడప జిల్లాలను కేటాయించారు. అయితే బాలినేనికి మంత్రి పదవి పోవటం.. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా సొంత జిల్లాల బాధ్యతల నుంచి తప్పించటం వెనువెంటనే జరగడంతో ఆయన ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. వైసీపీలో వాసు పనైపోయిందన్న ప్రచారం మొదలు పెట్టారు.
ఎన్నడూ లేనంతగా వివాదాలు
ఇటీవల బాలినేని ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఓ వివాదం అంటూ వస్తే ప్రముఖంగా ఆయనే పేరే ముందు వరుసలో ఉంటుంది. గత ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. ఓ వివాదం నుంచి బయటకు వచ్చేలోపు మరో వివాదం ముసురుతోంది. ఆ వివాదాల్లో తన ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సి రావటం.. దానికి వివరణ ఇచ్చుకోవటం బాలినేనికి పరిపాటిగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షంతోపాటు స్వపక్షానికి కూడా ఆయన టార్గెట్ గా మారారు. ఆయనకు అనుచరుల వల్ల కొన్ని చిక్కులు రాగా.. ఆయన మాట్లాడిన మాటలు కొన్నిసార్లు వివాస్పదంగా మారాయి. మంత్రి వర్గ విస్తరణ సమయంలో 100 శాతం కొత్తవారికే అవకాశం అంటూ ముందుగా బాంబు పేల్చినా.. తాను క్యాసినోకి వెళ్తానని.. స్నేహితులతో పేకాట ఆడుతానని మీడియా ముందే నొక్కి వక్కానించటం అప్పట్లో సంచలనంగా మారాయి.
తన కుమారుడిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం
తనను కావాలని విపక్షంతోపాటు కొందరు స్వపక్ష నేతలు టార్గెట్ చేశారని.. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారని మాట్లాడటం వైసీపీలోనూ చర్చ అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదో పార్టీలో ఇచ్చే కితాబులు బాలినేనికి కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీలో చాలా మంది పనికిరాని వాళ్లతోపాటు బాలినేని వంటి మంచివారు ఉన్నారంటూ మాట్లాడటంతో.. మాజీ మంత్రి జనసేనలో చేరతారన్న ప్రచారం మొదలైంది. దీంతో తాను పార్టీ మారాల్సిన అవసరం లేదంటూ బాలినేని స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. టీడీపీ నేతలతో ఆయన టచ్ ఉన్నరంటూ మరోసారి ప్రచారం ప్రారంభమైంది. విషయం ఆ నోటా.. ఈ నోటా పడి ఆయన వరకూ చేరటంతో దానిపైనా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. కొంత మంది కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దాని వెనుక తమ పార్టీలోని తన ప్రత్యర్థులే ఉన్నారని బాలినేని వాపోతున్నారు. తాను టీడీపీ అధినేతతో ఇటీవల మాట్లాడినట్టు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టత ఇచ్చారు.
ఒంగోలు నుంచే పోటీ చేస్తానన్న బాలినేని
వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేతలు చేస్తున్నది కేవలం ప్రచారం మాత్రమేన్నారు బాలినేని. తాను ఒంగోలు నుంచే మరోసారి పోటీ చేస్తానని బాలినేని బల్ల గుద్ది చెప్పుకోవాల్సి వచ్చింది. ఒంగోలులో తన రాజకీయ ప్రత్యర్ది దామచర్ల జనార్దన్ కేవలం రాజకీయ లబ్దికోసమే తనపై బురద జల్లేలా మాట్లాడుతన్నారని.. మిస్టర్ జనార్దన్ రాసిపెట్టుకో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ఘాటుగా చెప్పారు బాలినేని. తరచూ ఏదో ఒక ఆరోపణ రావటం.. పార్టీ మారతారని ప్రచారం జరగటం బాలినేనికి ఇబ్బందిగా మారిందట.. పని గట్టుకుని ఏదో ఒక రంగా వివరణ ఇవ్వాల్సి రావటంతో ఇదేం గోలరా స్వామి అంటూ తన అనుచరుల వద్ద వాపోతున్నారట. మరి బాలినేని టీడీపీ, జనసేన పార్టీల్లోకి మారుతున్నారని ప్రచారం చేయిస్తున్నదెవరు? ఎందుకు బాలినేనిని టార్గెట్ చేస్తున్నారు? విపక్షాలకు ఉప్పందించి ఇబ్బందులు పెడుతున్నదెవరు? ప్రచారం ప్రత్యర్ది పార్టీల పనా.. సొంత పార్టీ లోని బ్లాక్ షీప్ ల పనా? హూ ఈజ్ ద బ్లాక్ షీప్.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.