NTV Telugu Site icon

Off The Record: ఆరాజుగారు ఢీకొడతారా? డ్రాప్ అవుతారా?

Maxresdefault

Maxresdefault

అశోక్ గజపతి రాజు ఎక్కిడికక్కడ బ్రేకులు వేస్తున్నారా ? ఇంకా ఢీకొడతారా ? డ్రాప్ అవుతారా ? | OTR | Ntv

జిల్లాలో సొంతంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకుని అడుగులు వేస్తున్నారు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. కానీ.. వాళ్లను పార్టీలో ఎవరూ పట్టించుకోరు.. కార్యక్రమాలకు పిలవరు. ఎందుకిలా జరుగుతోందా అని ఆరా తీయడంతో.. అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు ఆ ఇద్దరు నేతలు. రాజుగారు వేస్తున్న ఎత్తుగడల ముందు వీళ్ల ఎత్తులేవీ పారడం లేదని టాక్‌.

రాజకీయ ఎత్తుగడల్లో ఎవరిది పైచెయ్యి..?
విజయనగరం జిల్లా టీడీపీలో ఆసక్తికమైన చర్చ జరుగుతోంది. రాజుగారితో పెట్టుకుంటే ఇంతే సంగతులు.. దానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే నిదర్శనం అని చెవులు కొరికేసుకుంటున్నారు. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలలో ఒకరు మీసాల గీత.. ఇంకొకరు కొండపల్లి అప్పలనాయుడు అని ఉదహరిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి జిల్లా టీడీపీలో పూసపాటి అశోక్‌గజపతిరాజుదే పెత్తనం. పార్టీ పెద్దలు అశోక్‌ మాటను కాదనే పరిస్థితి లేదు. ఆ విషయం తెలిసినా.. వివిధ సమీకరణాలను ముందు పెట్టి రాజకీయం చేయాలని చూస్తారు నాయకులు. అప్పటికి ఆ రాజకీయ ఎత్తుగడలు ఆసక్తి కలిగించినా.. చివరికి ఎవరిది పైచెయ్యి అవుతుందో తెలుగు తమ్ముళ్లకు తెలుసు.

గీతకు సహకరించిన అప్పనాయుడుకూ చెక్‌..!
మీసాల గీత 2014లో విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో విజయనగరం ఎంపీగా ఉన్నారు అశోక్‌గజపతి రాజు. ఇక అప్పలనాయుడు గజపతినగరం ఎమ్మెల్యే. అప్పలనాయుడుకు 2019లో తిరిగి పోటీ చేసే ఛాన్స్‌ దక్కినా.. గీత మాత్రం స్టాండ్‌ బై అయ్యారు. ఆ ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారని గీత రుసరుసలాడేవారు. క్రమంగా అశోక్‌తో గ్యాప్‌ రావడం.. కోటలో ఉన్న టీడీపీ ఆఫీసుకు వెళ్లకపోవడం చేసేవారు గీత. వన్‌ ఫైన్‌ మాణింగ్‌ ఏకంగా విజయనగరంలో జిల్లా టీడీపీ ఆఫీసు అని కొత్త దుకాణం తెరిచారు. ఈ చర్యలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. గీత ఆఫీసు ఏర్పాటు చేయడం వెనుక అప్పలనాయుడు సహకారం ఉందని పార్టీ కేడర్‌ సమాచారం. దీంతో గజపతినగరంలోనూ అశోక్‌ వేగంగా పావులు కదిపి మాజీ ఎమ్మెల్యే ప్రాధాన్యం తగ్గించినట్టు చెబుతున్నారు.

గజపతినగరంలో కొత్త నేతకు అశోక్‌ ప్రోత్సాహం
గజపతినగరంలో అప్పలనాయుడు ప్లేస్‌లో కరణం శివరామకృష్ణను అశోక్‌గజపతిరాజు ప్రోత్సహిస్తున్నారని టాక్‌. దీంతో టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న అప్పలనాయుడు కుతకుతలాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంఛార్జ్‌తో సంబంధం లేకుండా గజపతినగరంలో టీడీపీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అటు విజయనగరంలోనూ గీతను దగ్గరకు రానివ్వడం లేదు అశోక్‌ వర్గం. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం కొందరు టీడీపీ నేతలు జిల్లాకు వచ్చారు. ఆ ప్రచారంలో గీత, అప్పలనాయుడు పాల్గొన్నప్పటికీ.. వీళ్లతో మాట్లాడేందుకు పార్టీ నేతలు ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. మీ దగ్గరకు వచ్చి ఎన్నికల గురించి మాట్లాడటం అశోక్‌గజపతిరాజుకు నచ్చడం లేదని ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ముఖం మీదే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మీకు మాకు తగువు లేదు.. కానీ మీకు రాజుగారికి విభేదాలు ఉన్నాయి.. వాటి మధ్యలోకి మమ్మల్ని లాగొద్దు అని ఆ నాయకులు చెప్పారని టాక్‌.

పునరాలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యేలు
తమకు పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గీత, అప్పలనాయుడులు అనుచరులతో సమావేశమై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుంటే.. ఈ అవమానాలు అవసరమా అని ప్రశ్నించినట్టు సమాచారం. విలువ.. గుర్తింపు లేని చోట ఏం పనిచేయగలం.. ఎన్నాళ్లు ప్రయాణించగలం అని మాజీ ఎమ్మెల్యేలు కుమిలిపోతున్నట్టు చర్చ జరుగుతోంది. మరి.. రాజుగారితో వీరిద్దరూ యుద్ధానికి దిగుతారో.. శక్తి చాలక సైలెంట్‌ అయిపోతారో చూడాలి.