Site icon NTV Telugu

Off The Record: జనసేన వైఖరితో కమలానికి కలవరం

Sddefault (6)

Sddefault (6)

జనసేన వైఖరితో ఏపీ బీజేపీ నేతల డీలా.! బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని స్పష్టత ఇవ్వలేదా ? | OTR | Ntv

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రచారంలో ఉన్నారు. మిత్రపక్షం జనసేన మాత్రం బీజేపీకి షాక్‌ ఇచ్చింది. వైసీపీని ఓడించాలని జనసేన ప్రకటించిందే తప్ప.. బీజేపీని గెలిపించాలని చెప్పలేదు. దాంతో ఇదేమి బంధమని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయట.

పొత్తు ఉందని అంటారు.. ఎన్నికల్లో కలవరు..!
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య విచిత్ర బంధం కొనసాగుతోంది. రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ ఏ స్థాయిలోనూ.. ఏ సందర్భంలోనూ.. కలిసి పని చేయవు. కలిసి తమ ఉమ్మడి రాజకీయ శత్రువును టార్గెట్‌ చేయవు. ఎన్నికలు వస్తే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. జనసేన సైలెంట్‌గా ఉండిపోతోంది. 2019 తర్వాత జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో జరిగింది ఇదే. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతోంది. మా పొత్తు జనసేనతోనే.. బీజేపీ-జనసేన కాంబినేషన్‌తో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. తెల్లారింది మొదలు సోము వీర్రాజు చెబుతూనే ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ
ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురినీ గెలిపిస్తానంటూ వీర్రాజు ప్రచారం సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న జనసేన నేతలను కూడా సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్‌. కానీ జనసైనికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఇంతలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన కమలనాథులకు షాక్‌ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించేలా జనసేన శ్రేణులు పని చేయాలన్నారు నాదెండ్ల. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి మద్దతు ఇస్తున్నారో చెప్పకుండా.. వైసీపీని ఓడించాలన్న నాదెండ్ల ప్రకటన బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదట.

నాదెండ్ల ప్రకటనతో బీజేపీ శిబిరం కలవరం
కొంత కాలంగా తాము చేసిన ప్రచారం.. పెట్టిన ఎఫర్ట్స్‌ అన్నీ నాదెండ్ల ప్రకటనతో గంగలో కలిసినట్టేనా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. క్షేత్రస్థాయిలో జనసేన సాయం పట్టకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసినట్టేననే ఫీలింగ్‌లో ఉన్నారట. ఇటు చూస్తే వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. టీడీపీ వీలైనంత వరకు పోరాటం చేస్తోంది. వీరిద్దరికి గట్టి పోటీ ఇచ్చి.. రేసులో ఉన్నామని బీజేపీ నేతలు చెప్పుకోవాలంటే జనసేన సహకారం కావాల్సిందే. ఇప్పుడు జనసేన కేడర్‌ను తమవైపు తిప్పుకునేలా మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉందనే చర్చ బీజేపీ వర్గాల్లో ఉందట. ఎంత చేసినా.. బీజేపీకి సపోర్ట్‌ చేయాలని జనసేన అగ్రనాయకత్వం నేరుగా చెప్పకపోతే బీజేపీకి ఫీల్డ్‌లో కష్టమని కలవర పడుతున్నారట కమలనాధులు.

Exit mobile version