Off The Record: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారం జీడిపాకం సీరియల్‌లా సాగుతూనే ఉంది. చాలా రోజుల క్రితమే.. రామచంద్ర నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఏఐసీసీ. ఇప్పుడంతా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అనే పిలుస్తున్నారుగానీ… ఎన్నిక మాత్రం జరగలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అవలేదు. విప్ గా ఉండే నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సెషన్‌లో అయినా ఎన్నిక జరుగుతుందని అనుకున్నా… అవలేదు. మొదట్లో ఒకటి రెండు రోజులు మాత్రమే సభ నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. ఉప సభాపతి ఎన్నిక నిర్వహించాలంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకు సమయం సరిపోదని అనుకున్నారో… లేదంటే ఈ సెషన్‌లో అక్కర్లేదని అనుకున్నారగానీ ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో…. వచ్చే సెషన్ ఎన్నిక జరపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండికేషన్స్ కూడా పంపించింది.
మరోవైపు ఇటీవల అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేసిన రామచంద్రనాయక్ తన మనసులో వేరే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి… తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల్ని కోరినట్టు చెప్పుకొచ్చారు డోర్నకల్ ఎమ్మెల్యే. కేబినెట్ విస్తరణ జరిగాకే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నది ఆయన లెక్క. దీన్నిబట్టి చూస్తుంటే… ఉప సభాపతి పదవి తీసుకోవడానికి రామచంద్ర నాయక్ సుముఖంగా లేరన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పటిదాకా… అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటించాక తిరిగి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ క్యాబినెట్ బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డినే నమ్ముకున్నానన్నది మొదట్నుంచి ఆయన చెబుతున్న మాట. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో లేదంటే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని, తనకు కచ్చితంగా అవకాశం దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు బాలు నాయక్. అదే సమయంలో వీళ్ళిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా…ఓవరాల్‌గా ఆ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుందని అంటున్నారు. కొత్త మంత్రి పదవి ఎస్టీ కోటాలోనే ఉన్నా… ఇద్దరిలో ఎవరికి అన్నది సస్పెన్స్ అయింది. రామచంద్ర నాయక్‌ను ఇప్పటికే డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించి ఉన్నందున ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకోవడానికి ఏఐసీసీ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలున్నాయి. అదే సమయంలో బాలునాయక్ మాత్రం గంపెడాశతో ఉన్నారు. ఏతావాతా బాలు నాయక్, రామచంద్రనాయక్‌లో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి డిప్యూటీ స్పీకర్ దక్కుతాయన్నది ప్రస్తుతానికి కాంగ్రెస్ వర్గాల అంచనా. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్‌లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.
