Off The Record: 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ ఈసారి ముందే అలర్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ… విఫల ప్రయోగాలను ఇక పక్కన పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ వారసులకు రాజకీయ రాచబాట వేయాలని కలలుగంటున్న కొందరు వైసీపీ సీనియర్స్ గత ఎన్నికల్లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ… ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్‌లో వచ్చేసరికి ఈ విషయంలో హైకమాండ్ పునరాలోచిస్తోందట. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలో పేర్ని కిట్టు, ఇలా బరిలో దిగిన వారసులందరికీ షాక్‌లు తగిలాయి. అందుకే… వచ్చే ఎన్నికల్లో అలాంటి ప్రయోగాలకు బ్రేక్ వేయాలన్న ఆలోచనలో ఉందట వైసీపీ హైకమాండ్. కీలక స్థానాల్లో… అనుభవం ఉన్న సీనియర్ నేతలనే బరిలోకి దించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ విషయాన్ని గ్రహించే కొంతమంది సీనియర్ లీడర్స్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. తిరుపతిలో వైసీపీ కీలక నేత భూమన కరుణాకరరెడ్డి గతానికి భిన్నంగా ఇటీవల యాక్టివిటీ పెంచారు. టీటీడీ సహా పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారాయన. దీంతో 2029 ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.
ఇదే సమయంలో మరో కీలక నాయకుడు పేర్ని నాని కూడా ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వాయిస్ రెయిజ్ చేస్తూ తాను యాక్టివ్‌గా ఉన్న సంకేతాలిస్తున్నారు. తాను పోటీలో ఉండబోనని, ఈసారి కూడా కిట్టునే పోటీ చేస్తారని, తాను జగన్ ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తానని నాని అంటున్నా… ఫైనల్‌గా ఏం జరుగుతుందో, జగన్ ఏమని ఆదేశిస్తారో చూడాలన్నది బందర్ వైసీపీ వాయిస్. ఇక గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. అయితే పార్టీ ఈసారి వాళ్ళిద్దరికీ టిక్కెట్స్ ఇస్తుందా లేక భాస్కర్‌రెడ్డినిని తిరిగి చంద్రగిరి రాజకీయాలకు పరిమితం చేస్తుందా అన్న చర్చ జరగుతోంది. అలాగే మాడుగుల నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ కూడా ఓడిపోవటంతో అక్కడ సైచం క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే… మరికొందరు సీనియర్స్ వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో పొలిటికల్ అరంగేట్రం చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారట బొత్స సత్యనారాయణ. ఈసారి తన కుమార్తెను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలన్న ప్లాన్‌లో ఆయన ఉన్నారట. అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెకి టికెట్ అడగాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ వారసులను బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తన వారసుడిని పోటీలో నిలపాలని చూస్తున్నారు. మాజీమంత్రి జోగి రమేష్ వారసులు పొలిటికల్‌గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.. ఇదే సమయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్డన్ రెడ్డిల కుమార్తెలు కూడా అనూహ్యంగా పొలిటికల్ ప్రెజన్స్‌లోకి వచ్చేయటంతో ఈసారి వాళ్ళు టికెట్ రేసులో ఉంటారన్న అంచనాలున్నాయి. కానీ… కీలక స్థానాల్లో ప్రయోగాలకు వెళ్లకుండా తండ్రులే బరిలో ఉంటే… మంచి రిజల్ట్స్ వస్తాయని వైసీపీ హైకమాండ్ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వ్యూహం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. కొన్ని చోట్ల సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి అక్కడి అసెంబ్లీ టికెట్లు వారసులకు ఇవ్వాలన్న ఫార్ములా కూడా పరిశీలనలో ఉందట. దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సీనియర్ నేతలను తప్పించి యువ రక్తంతో ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సహా కూటమి పార్టీలు చూస్తూంటే…. వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా సీనియర్ నేతలతో యుద్ధం చేయాలని అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఫైనల్ ఏం జరుగుతుందో, జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
