NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్సీగా సిపాయి ఎంపిక.. వైసీపీలో చర్చ..!

Sipayi

Sipayi

Off The Record: డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. తిరుపతిలోని రష్‌ ఆస్పత్రి అధినేత. తాజాగా ఆయన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. నిన్న మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు ఈ సిపాయి. ఈ మధ్యే టీడీపీ పదవికి.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ సిపాయి చేరింది లేదు. ఇంతలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరపైకి రావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారపార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. వన్యకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ సుబ్రమణ్యం 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీకాళహస్తిలో పోటీ చేశారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో వీలీనం అయ్యాక ఆయన టీడీపీలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కేబినెట్‌ హోదాలో ఓ పదవిని చేపట్టారు సిపాయి. ఆయన రాజీనామా చేస్తే టీడీపీనే షాక్‌ కాలేదు. తమకు సిపాయి అవసరమే లేదన్నట్టుగా పట్టించుకోకుండా ఉన్నారు జిల్లాలోని టీడీపీ నేతలు. జిల్లాలోని వైసీపీ నాయకులు ఆయన్ని లైట్‌ తీసుకున్నాయి. అంతలోనే సిపాయి పేరు జిల్లా రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. వైసీపీ ఆయన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆశ్చర్యపోయారు జిల్లాలోని అధికారపార్టీ నాయకులు.

Read Also: Off The Record: గంటా, అయ్యన్నల మధ్య రాజకీయ సెగలు.. కట్టడి సాధ్యమా?

పార్టీ కండువా కప్పుకోకుండానే లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిపాయి పేరును ఖారారు చేయడం.. ఎలా సాధ్యమైంది? తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు? అని ఆరా తీసే పనిలో పడ్డారు జిల్లా వైసీపీలోని కొందరు నాయకులు. పార్టీ కోసం పనిచేస్తున్న పలువురు జిల్లా నేతలు ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకు పోయారట. ఆవేదన దాచుకోలేని మరికొందరు లోకల్‌ లీడర్స్‌ అయితే.. స్థానిక ఎమ్మెల్యేలను నిలదీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా వచ్చే వారిని ఊరడించడం.. ఓదార్చడం.. బుజ్జగించడం.. అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పడానికి ఎమ్మెల్యేలు నానా పాట్లు పడుతున్నారట. వైసీపీలో మొదటి నుంచి ఉన్న పలానా నాయకుడిని ఎమ్మెల్సీని చేస్తే.. శ్రీకాళహస్తి.. సత్యవేడు.. తిరుపతిలో పార్టీకి లబ్ధి చేకూరేదని అంతరంగిక సమావేశాల్లో చర్చిస్తున్నారట. ఈ అసంతృప్తి పెద్దది కాకుండా.. ఇక్కడి నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పార్టీ పెద్దల వద్దకు తీసుకెళ్లే పనిలో ఉన్నారట. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నిక జిల్లా వైసీపీలో గట్టి అలజడే తీసుకొచ్చింది.

Show comments