Site icon NTV Telugu

Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

Otr Meenakshi Natarajan

Otr Meenakshi Natarajan

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇక ఎక్కడికీ కదలబోదంటూ అమరావతిలో సంబరాలు చేసుకుంటున్నా టైంలో…వైసీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. వాటి చుట్టూ రాజకీయ రచ్చ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఓవైపు అమరావతి పనులు జోరుగా జరుగుతున్న టైంలో… ప్లాన్‌ బీ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్‌ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్‌ ఎందుకు ప్రతిపాదించారంచూ ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే… ఇదే ఆషామాషీగా చేసిన ప్రతిపాదన కాదని, దీని వెనక భవిష్యత్‌ వ్యూహం దాగి ఉందని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఈ మూడు ప్రాంతాలను కలుపుకుంటే 40 లక్షల దాకా జనాభా ఉంటుంది. దాదాపు 110 కిలోమీటర్ల విస్తీర్ణం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నది పైకి చెబుతున్న వాదన. కానీ… ఇన్‌సైడ్‌ లెక్కలు వేరే ఉన్నాయట. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం చేసే అవినీతి వ్యవహారాలపై చర్చించే రోజు భవిష్యత్‌లో ఖచ్చితంగా వస్తుందని, ప్రజలకు మేం చెప్పాల్సింది అప్పుడే చెబుతామని అంటున్నారు వైసీపీ నాయకులు.

సెల్ఫ్ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్‌ అని ఓవైపు చెబుతూనే మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులు తేవడం ఏంటన్నది వైసీపీ క్వశ్చన్‌. ఒక్క రాజధానిలో మౌలిక వసతుల కోసం అంత డబ్బు పెడితే… మిగతా రాష్ట్రం మొత్తం ఏం కావాలని జగన్ ప్రశ్నించటం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. రాజధాని పేరుతో జరిగే వేల కోట్ల అవినీతిని సహించబోమని, రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోవాల్సిందేన‌ని ఇది కూడా ఒక తరహా వార్నింగేనని విశ్లేషిస్తున్నారు. గతంలో మెడికల్‌ కాలేజీల పీపీపీ విషయంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించారు జగన్‌. పీపీపీ పద్ధతిలో ఎవ‌రైనా మెడికల్‌ కాలేజీలు తీసుకుంటే… మేం వ‌చ్చిన వెంట‌నే రద్దు చేస్తామని అప్పట్లో డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చారు జగన్‌. దాని ప్రభావమో, మరోటోగాని ఒక్క కాలేజీకి తప్ప మిగతా వేటికీ బిడ్డింగ్‌ రాలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా జగన్‌ తన వైఖరి చెప్పడం ద్వారా క్లియర్‌ కట్‌ ఇండికేషన్‌ పంపినట్టేనని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. రేపు జగన్ వస్తే పరిస్థితి ఏంటన్న చర్చలు ఇప్పటికీ కొన్ని వర్గాల్లో జరుగుతున్నాయట. ఈ పరిస్థితుల్లో మావిగన్‌ పేరుతో ఆయన తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పేశారన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. దీనితోపాటు… రాబోయే మూడేళ్ళలో మీరు గనకు అమరావతి నిర్మాణాలు పూర్తి చేయకుంటే… 29లో మేం అధికారంలోకి వస్తే… మరో ఆప్షన్ ఉందని చెప్పే ప్రయత్నం కూడా చేసి ఉండ‌వ‌చ్చన్నది కొందరి అభిప్రాయం.

జగన్‌ తాజా ప్రతిపాద‌న‌, వ్యాఖ్యలతో రెండవ విడత భూ సమీకరణకు ఆటంకం కలగవచ్చని, ఆయా ప్రాంతాల రైతులు ధైర్యం చేసి భూములు ఇవ్వకపోవచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే జ‌గ‌న్ వ‌స్తే మళ్ళీ రాజ‌ధాని మ‌ళ్లీ విజ‌య‌వాడ వైపునకు త‌ర‌లుతుంది. ఇప్పటికే తొలి విడత భూములు ఇచ్చిన రైతుల‌కు క్లారిటీ లేదు. ఇక మా పరిస్థితి ఏంటని రెండో విడత పరిధిలోని రైతులు ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో రాజ‌ధానిని కేవలం 23 గ్రామాల‌కు ప‌రిమితం చేయకుండా… రెండు ఉమ్మడి జిల్లాల ప‌రిధిలోకి తీసుకువస్తే త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయా ప్రాంతాల్లో పొలిటికల్‌ పాజిటివిటీ తెచ్చుకునే ప్లాన్‌ కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. అమరావతిలో యాక్టివిటీ పెరిగి జనం వచ్చి పూర్తి స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలంటే… దశాబ్దాలు పడుతుందని, అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు.. అయితే… త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చలు. కానీ… అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజ‌ధానుల పేరుతో జగన్‌ చేతులు కాల్చుకున్నారన్న అభిప్రాయం ఏపీ రాజకీయవర్గాల్లో ఉంది. మరిప్పుడు మావిగన్‌ ప్రతిపాదనకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మద్దతు ఉంటుందా? లేక మరో బూమరాంగ్‌ అవుతుందా అన్న అనుమానాలు మాత్రం చాలామందికి ఉన్నాయి.

Exit mobile version