NTV Telugu Site icon

Off The Record: పవన్‌ను వదిలేసి చంద్రబాబునే జగన్ టార్గెట్ చేశారా..? ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది?

Jagan

Jagan

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రోడ్డెక్కింది. ఎస్… ఒక్కమాటలో చెప్పాలంటే అలాగే మాట్లాడుకోవాలి. ఘోరమైన ఓటమి భారం నుంచి కోలుకుంటున్న ప్రతిపక్షం… మెల్లిగా ప్రజా సమస్యల మీద ఫోకస్‌ పెడుతూ పుంజుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌ కూడా ఇక స్పీడ్‌ పెంచాలని డిసైడైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే….మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్ళారాయన. అప్పుడే సీఎం చంద్రబాబుపై గట్టిగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు జగన్‌. ఆ తర్వాత కొంతమంది మంత్రులు ఆయనకు కౌంటర్లు ఇచ్చారు. అంతవరకు బాగానేఉంది. మామూలుగా చూసే వాళ్ళకు అది ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్యన పొలిటికల్‌ వార్‌లాగా కూడా అనిపించవచ్చు. కానీ… అసలు ట్విస్ట్‌ అందులోనే ఉందని అంటున్నారు ఈ ఎపిసోడ్‌ని నిశితంగా గమనించినవాళ్ళు. ఎన్నికలకు ముందు టీడీపీతో సమానంగా… అప్పుడప్పుడూ అంతకు మించిన స్థాయిలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం జరిగింది. డైరెక్ట్‌గా పవన్‌, జగన్‌ విమర్శించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పుడంతా వ్యవహారం ఉప్పు నిప్పులా ఉండేది. ఇక సీన్ కట్ చేస్తే… ఎన్నికలు అయిపోయాయి.

టీడీపీ-జనసేన-బీజేపీ సారధ్యంలో కూటమి సర్కార్‌ ఏర్పాటైంది. ఆ తర్వాత పవన్, జగన్ మధ్య విమర్శలు కూడా తగ్గిపోయాయి. గతంలో అంతలా వైరం ప్రదర్శించుకున్న రెండు పార్టీలు ఇప్పుడు వీళ్ళు వాళ్లేనా అన్నట్టుగా ఉన్నాయన్నది ఓ పరిశీలన. జగన్‌ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నా… ఆ విమర్శలన్నీ టీడీపీ టార్గెట్‌గానే ఉంటున్నాయి తప్ప కూటమిలో భాగస్వాములైన మిగతా రెండు పార్టీల ఊసే ఉండటం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో జనసేన విషయంలో వైసీపీ సంయమనం వెనక రాజకీయ వ్యూహం ఏదన్నా ఉందా అన్న చర్చ మొదలైంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. గడిచిన 8 నెలల్లో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు జగన్. కానీ… అవన్నీ చంద్రబాబు లక్ష్యంగానే ఉన్నాయన్నది పొలిటికల్‌ పరిశీలకుల మాట. ఇక్కడే డౌట్‌ కొడుతోందట. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనను, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను వదిలేసి కేవలం సీఎం టార్గెట్‌గానే వైసీపీ విమర్శలు ఎందుకు ఉంటున్నాయంటూ పోస్ట్‌మార్టం చేసే పనిలో ఉన్నాయట రాజకీయ వర్గాలు. కేవలం అధిష్టానమేకాకుండా… మిగతా వైసీపీ నేతలు కూడా టీడీపీ మీదే ఫోకస్‌ పెట్టి జనసేనను ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది.

ఎన్నికల ప్రచారంలో పవన్‌కు బీభత్సంగా టార్గెట్‌ చేసి చివరికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా పొలిటికల్‌ అజెండాగా మార్చుకున్న వైసీపీ… సడన్‌గా గ్లాస్‌ పార్టీని సైడ్‌ చేయడం వెనక రాజకీయ వ్యూహం ఉందా అని ఆరా తీస్తున్నారు కొందరు. పవన్‌ని వ్యూహాత్మకంగా విస్మరించడం ద్వారా…చంద్రబాబు మాత్రమే తన రాజకీయ ప్రత్యర్థి అని జగన్‌ చెప్పదల్చుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఎన్నికల ప్రచారంలో పవన్‌కళ్యాణ్‌ని ఆ స్థాయిలో టార్గెట్ చేయడం వల్లే… ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమలో కూడా బలమైన సామాజికవర్గం మద్దతు దూరమైందన్న నివేదికలు వైసీపీ అధిష్టానానికి అందినట్టు తెలుస్తోంది. అందుకే ఫ్యాన్‌ పార్టీ వ్యూహం మారినట్టు కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు మీద గురిపెడితే… మొత్తంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టేనని… అలాంటప్పుడు ప్రత్యేకంగా పవన్‌ని, జనసేనని విమర్శించి కొత్తగా సాధించేదేమీ ఉండకపోగా… నష్టం జరుగుతుందని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. అలాగే… కూటమిలో జరుగుతున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్నది వైసీపీ అభిప్రాయంగా తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే…. సీఎం చంద్రబాబు మీద దాడి తీవ్రత పెంచి డిప్యూటీ సీఎం పవన్‌ని విస్మరిస్తే… రాజకీయంగా అది బాగా వర్కౌట్‌ అవుతుందన్నది వైసీపీ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో అటు పవన్‌ కూడా మౌనంగా ఉంటుండటంతో…పొలిటికల్‌ వార్‌ టీడీపీ వర్సెస్‌ వైసీపీగానే జరుగుతోంది. పవన్ మౌనంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న టైంలో…. ఏపీ పొలిటికల్‌ పిక్చర్‌ ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.