NTV Telugu Site icon

Off The Record: పార్టీ పునర్నిర్మాణంపై వైఎస్‌ జగన్‌ ఫోకస్

Ys Jagan

Ys Jagan

Off The Record: వైసీపీ ఆవిర్భావం నుంచి సవాళ్లతోనే పార్టీని నడుపుతున్నారు అధినేత జగన్మోహన్‌రెడ్డి. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ…67 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలను జగన్…సమన్వయం చేయటంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. పట్టుదలగా పని చేసిన జగన్ పార్టీకి…175 స్థానాలకు 151 సీట్లు కట్టబెట్టారు. 50 శాతం పైగా ఓట్లు సాధించి…అధికారంలోకి వచ్చారు. కేడర్ కూడా పార్టీ అధికారంలోకి రావాలన్న కసితో పనిచేయడంతో వైసీపీకి ఊహించని విజయం లభించింది. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. సీన్‌ కట్ చేస్తే…2024 ఎన్నికల్లో వైసీపీ..జస్ట్‌ 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాలంటరీ సిస్టంతో కేడర్‌కు, నేతలకు పెద్దగా పనిలేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏవైనా వాటిని పక్కన పెట్టేసి…తిరిగి కార్యకర్తలను యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట జగన్. మరోవైపు ఓటమి తర్వాత చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత జగన్ పార్టీని రీసెట్ చేసే పనిలో పడ్డారట. నేతలు పార్టీని వీడినా మొదట్నుంచీ కార్యకర్తల బలంతోనే పార్టీని నడిపిన జగన్‌…గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని మరింత బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్‌. పనిలో పనిగా ఓటమితో డిసప్పాయింట్‌లో ఉన్న కార్యకర్తలకు…నెక్స్ట్ తమ పార్టీ విజన్ ఏంటి ? ఎలా ముందు వెళ్లాలంటూ…ఈ సమావేశాల్లో కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారట.

జనవరి నెలాఖరు నుంచి ప్రతీ జిల్లాలో పర్యటించి…ఆ జిల్లాలో రెండు రోజుల పాటు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రతీ కార్యకర్తలతో మాట్లాడుతానని…జిల్లా సమీక్ష సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారట. పార్లమెంట్ పరిధిలోని ప్రతీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని సంకేతాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని నిర్ణయించారట. ఈ సారి కేడర్‌తో గ్యాప్ లేకుండా చూసేందుకు రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కార్యకర్తలతో మమేకమవుతానని జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పాదయాత్ర శిబిరాల్లో కూడా ముఖ్య నేతలను మాత్రమే కలిసిన జగన్‌…ఈసారి మాత్రం కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారట. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించుకోవటంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంలో మునిగిపోయినట్లు సమాచారం. జగన్‌ తిరిగి జనంలోకి వస్తే కేడర్‌కు ఊపు వస్తుందని భావిస్తున్నారట. పనిలో పనిగా వైసీపీని వీడిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నవారితోనే రాజకీయం చేసి…వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టాలని గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. పార్టీని ఎలా కమ్ బ్యాక్ చేయాలన్న విషయంలో…ఓ క్లారిటీకి వచ్చిన జగన్.. కేడర్‌కు, లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా వారిని సెట్ చేసే పనిలో పడ్డారట. గ్రామ స్తాయిలో ఉండే ప్రతి కార్యకర్తను దగ్గర అయ్యేలా ఆయన కార్యక్రమాలు చేపడితే పార్టీ త్వరగా సెట్ అవుతుందని కార్యకర్తలు, నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. జగన్ తిరిగి జనంలోకి వెళ్తే వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి జగన్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..? పార్టీ స్వింగ్ లోకి వస్తుందా అనేది చూడాలి.

Show comments