NTV Telugu Site icon

Off The Record: స్ట్రాంగ్ యాక్షన్ అంటూ సొంత నేతలకే వార్నింగ్స్..! ఇంతకీ ఏం జరుగుతోంది..?

Yelamanchili Mla Vijay Kuma

Yelamanchili Mla Vijay Kuma

Off The Record: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం కాకలు తీరిన రాజకీయాలకు  కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా ఉండేది ఇక్కడ. 2009 పునర్విభజన తర్వాత పార్టీల కంటే వ్యక్తుల బలం కీలకంగా మారింది నియోజకవర్గంలో. మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు… స్థానిక రాజకీయాల మీద పట్టు బిగించారు. అయితే… 2024 ఎన్నికల నాటికి యలమంచిలి పొలిటికల్ పిక్చర్ మొత్తం మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రమణ మూర్తిరాజు అభ్యర్ధిత్వాన్ని వైసీపీ హైకమాండ్ ఖరారు చేయడంతో… ఆయన అయిష్టంగానే బరిలోకి దిగారన్న ప్రచారం జరిగింది. ఓ దశలో కూటమి దూకుడును ఎదుర్కోవడానికి అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరును పరిశీలించినా… కాపు వర్సెస్‌ కాపు అయితేనే ఫలితం తమకు అనుకూలంగా వుంటుందనే అంచనాతో… కన్నబాబును ఖరారు చేసింది వైసీపీ. అయితే… ఆ లెక్కలేవీ వర్కౌట్‌ అవకపోగా… ఎన్నికల్లో కన్నబాబు రాజుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 48వేల 956 ఓట్ల మెజారిటీతో కన్నబాబు రాజు మీద గెలిచారు జనసేన అభ్యర్థి విజయ్ కుమార్. ఈ స్ధాయి విజయం యలమంచిలి నియోజకవర్గంలో ఓ రికార్డ్.

ఇక అధికారానికి కొత్తే అయినా… పాలిటిక్స్‌కు పాత ముఖం కావడంతో ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే దూకుడుగా ఉండటం మొదలెట్టారు విజయ్ కుమార్. తాను సంస్థాగతంగా బలోపేతం అవ్వడంపై కంటే వైసీపీని బలహీనపరచడం ద్వారా కన్నబాబు రాజు రాజకీయ హవాకు బ్రేకులు వేయాలనేది ఎమ్మెల్యే ఆలోచన అట. ఆదిశగా ఎంపీటీసీలు, జడ్పిటిసిలను ఆకర్షించే పనిలో పడ్డారాయన. మరోవైపు పారిశ్రామికంగా కీలక మైన అచ్యుతాపురం, రాంబిల్లి ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు,NAOB వంటి వ్యూహాత్మక రక్షణ స్ధావరం, పూడిమడకలో ఫిషింగ్ జెట్టి సహా అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రస్తుతం యలమంచిలి నియోజకవర్గమే ప్రధాన కేంద్రం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫుల్ పొటెన్షియాలిటీ వున్న ఏరియా. ఇంతటి కీలకమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే సహజంగానే మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సీఎస్ఆర్ సహా వివిధ నిధుల ద్వారా అభివృద్ధికి ఆస్కారం వుంటుంది. అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యాల వైఫల్యాలు, మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు దారితీస్తున్నాయన్న టాక్‌ నడుస్తోంది.

కానీ… నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు కఠినంగా ఉంటే తప్ప వ్యవహారం నడవదనేది విజయ్ కుమార్ అభిప్రాయం. సరిగ్గా ఇక్కడే అసలు మ్యూజిక్ స్టార్ట్ అయిందన్నది లోకల్‌ టాక్‌. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తున్నారని కూటమిలోని ఓ వర్గం కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉందట. ఈ క్రమంలో విజయ్ కుమార్‌ ఏదేదో చేసేస్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ వ్యవహారం హైకమాండ్ వరకు వెళ్ళిందట. ఎమ్మెల్యే దూకుడు కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బంది పడుతుందన్న భావన వచ్చేలా ఫిర్యాదు చేస్తూనే… పనిలో పనిగా ఇటీవల ప్రచారంలోకి వచ్చిన పలు అంశాలను ప్రధాన నాయకత్వం ముందు పెట్టి. కొందరు నేతలు ఆవేదన వెల్ళగక్కినట్టు తెలిసింది. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే లక్ష్మణ రేఖలు గీశారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే చర్యలు వద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత ఎమ్మెల్యే పై కూటమినేతలే పరోక్షంగా ఫిర్యాదులు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోందట. అటు తన మీద చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టడం ఇప్పుడు కాక రేపుతోంది. పదహారేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎమ్మెల్యే అయ్యానని, నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోనని అంటున్నారట ఆయన. అడ్డగోలు పనులు చేసి అడ్డదిడ్డంగా సంపాదించాలన్న యావ తనకు లేదని, అసలు నేనా టైప్‌ కాదని అంటున్నారట ఎమ్మెల్యే. ఆధారాలు లేకుండా ఎవరైనా ఆరోపణలు చేస్తే మాత్రం సీరియస్‌ యాక్షన్ ఉంటుందని సొంత కూటమి నేతలకు సైతం పబ్లిక్‌ వార్నింగ్‌ ఇస్తున్నారట. మరి ఈ వార్నింగ్స్‌తో వ్యవహారం మరో మలుపు తిరుగుతుందా? లేక సెట్‌ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్‌.

Show comments