Off The Record: కరవమంటే కప్పకి విడవమంటే పాముకి అన్నట్టుగా ఉందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అదే పార్టీ నాయకులు. ఏరి కోరి అవకాశాలు ఇచ్చిన నాయకులు పార్టీని వదిలిపోతుంటే.. కష్టపడి పని చేసినా గుర్తింపు ఇవ్వలేదని మరో నేత పక్కకి జరిగారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ళ నానికి డిప్యూటీ సీఎం హోదాతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆళ్ళ నాని కామ్ గా పార్టీని వదిలి పక్కకి జరిగారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ని ఓడించిన కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ కు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, పక్క నియోజకవర్గానికి చెందిన నేతలు చులకనగా చూసే ప్రయత్నాలు చేయడంతో ఆయన కూడా ఆళ్లనాని బాటే పట్టారు. కీలకమైన పాలకొల్లు నియోజకవర్గంలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలో దించుతూ వైసిపి వరుసగా చేతులు కాల్చుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే తాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయట. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వడ్డే రఘురాం కి అవకాశం కల్పించారు. వైసిపి అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు మంత్రి పదవి అందించినప్పటికీ కొట్టు సత్యనారాయణ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే విమర్శలు రావడం, 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఖాళీ అవుతున్న పార్టీని పట్టించుకోలేదని విమర్శలతో కొట్టుని నియోజకవర్గ ఇన్చార్జిగా పక్కన పెట్టినట్టు సమాచారం. నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జిల విషయంలో కాపు సామాజిక వర్గ నేతలను కొనసాగించాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా, అధిష్టానం మాత్రం అక్కడ బీసీ నేతలను కొనసాగించడంపై గందరగోళం నెలకొందన్న చర్చ జరుగుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా అవకాశం ఇచ్చిన నేతలు ప్రభావం చూపలేకపోవడం.. అవకాశం దక్కక కీలకమైన నేతలు పక్కకి జరగడం.. అవసరం ఉన్నచోట కాపు సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత కల్పించకపోవడం చూస్తుంటే పశ్చిమగోదావరి జిల్లాలో కాపు నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట పార్టీ నేతలు. పదవులు అనుభవించి పక్కకి జరిగే వారి గురించి కాకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి ఇప్పటినుంచైనా ప్రాధాన్యత పెంచాలని సామాన్య కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారని లోకల్ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.
