Off The Record: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వరుసగా చోటు చేసుకుంటున్న సున్నిత ఘటనలు ప్రతిరోజు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి. ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు ఏదొక గొడవతో సతమతం అవుతున్నారు. వరుస వివాదాలు అపచార ఘటనలు, తప్పులు ఎవరు చేసినా ఏం జరిగినా ఆలయ ఈఓను నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు ఆయనను వెంటాడుతున్నాయి.
Read Also: Maruthi: హారర్ మూవీస్’లో దెయ్యాన్ని చంపడం ఈజీ.. ఎలాగైనా చంపొచ్చు!
పవర్ కట్ వివాదం చల్లారకముందే బ్యాక్ టు బ్యాక్ ఘటనలు ఇంద్రకీలాద్రిపై కలకం రేపుతున్నాయి. శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలలో పురుగులు కనిపించడం భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. అదే సమయంలో ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం దగ్గర భక్తులకు షాక్ కొట్టిన ఘటన విమర్శలకు దారి తీసింది. అంతేకాదు, ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడం వంటి ఘటనలు కూడా పరిపాలన లోపాలను ఎత్తిచూపాయి. వీటికి కారణం ఎవరైనా, చివరికి ఈ ఇష్యూలన్నీ ఈవో చుట్టే తిరుగుతున్నాయి. ఈవో వైఫల్యమే కారణమని కార్నర్ చేస్తున్నారు. ఇలా వరుస ఘటనలతో ఇంద్రకీలాద్రి పరిపాలనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ కట్ ఘటన విషయంలో పూర్తి బాధ్యత ఈఓపైనే పడిపోయింది. ఈఓ నిర్లక్ష్యం వల్లే అ పొరపాటు జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈఓ సమన్వయం చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని, తప్పంతా ఈఓదే అని ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం శారు. దేవాదాయ కమిషనర్ కూడా ఈఓ తీరును తప్పుపట్టారు.
ఇంకోవైపు ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతోంది. చైర్మన్ vs ఈఓ, ఈఓ vs దేవాదాయ కమిషనర్ మధ్య అభిప్రాయ భేదాలు పరిపాలనను గందరగోళానికి నెడుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదాలన్నీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యమంతి టేబుల్‌పైన ఈఓ పాలనా వ్యవహారం, పర్ఫార్మెన్స్ ఇలా ప్రతీది నివేదిక రూపంలో సీఎం దగ్గరకు చేరుతోంది. ప్రభుత్వం దుర్గగుడిలో వరుస వివాదాల నడుమ ఎప్పడు ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు వరుస పరిణామాలు రాజకీయ రంగు పులుముకుంటుండటంతో ప్రతి పక్ష వైసీపీ భగ్గుమంటోంది. దుర్గ గుడిలో వరుస ఘటనలపై హిందూ సంఘాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈ పరిణామాలన్నిటిపై హిందూ సంఘాలు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆలయ ఈఓ శీనా నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసేది ఒకరు… నిందలు మోయాల్సింది మరొకరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈవోగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోవడంతో, చివరికి ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేసే పరిస్థితి వస్తోందని నేతలు అంటున్నారు.