Site icon NTV Telugu

Off The Record: తెరపైకి కొత్త పేర్లు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ ఇద్దరు ఎంపీలు..?

Bjp

Bjp

Off The Record: బీజేపీలో దేశ వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల హడావిడి నడుస్తోంది. కమిటీల ఎన్నికల కసరత్తు జోరుగా జరుగుతోంది. కింది స్థాయి కమిటీల సంగతి ఎలా ఉన్నా… రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎవరవుతారంటూ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందునా… ప్రత్యేకించి తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటికి వస్తూ… ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈసారి రాష్ట్రం మీద బీజేపీ అధిష్టానం స్పెషల్‌ ఫోకస్‌ చేస్తోందన్న వార్తల నడుమ తెలంగాణ బీజేపీకి కొత్త సారధిగా ఎవరు వస్తారన్న సస్పెన్స్‌ డబుల్ అవుతోందట రాజకీయ వర్గాల్లో. ఇక పార్టీలో అంతర్గతంగా అయితే… చెప్పే పనేలేదు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా… మాటలన్నీ కొత్త అధ్యక్షుడి గురించేనట. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ… వాళ్ళ ప్లస్‌లు, మైనస్‌ల గురించి డిస్కస్‌ చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు. అదే సమయంలో ఇటువైపు సీరియస్‌గా దృష్టిపెట్టి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు సమాచారం.

ఈ సారి పార్టీ కోణంలో కాకుండా… పొలిటికల్‌ అవసరాల ప్రాతిపదికన అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు ఢిల్లీ పెద్దలు. పక్కాగా పొలిటికల్‌ అవసరాలు తీర్చేలా కొత్త అధ్యక్షుడి సెలక్షన్‌ ఉంటుందన్న వార్తలు పార్టీలోని పాత కాపులకు మింగుడు పడటం లేదట. అలాగే.. ఏదో.. సోసోగా నడిపించే వాళ్ళు కాకుండా… కాస్త దూకుడుగా వెళ్ళే నేతనే పదవి వరిస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత చట్ట సభల సభ్యుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. అందులోనూ… ఎమ్మెల్యేలకన్నా ఎంపీలకే ఛాన్స్‌ ఎక్కువన్నది తెలంగాణ బీజేపీ ఇంటర్నల్‌ వాయిస్‌. ఆ ఎంపీల్లో కూడా ఎవరయ్యా… అంటే…. నాలుగు పేర్లు మాత్రం గట్టిగా విపడుతున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు రేస్‌లో ఉన్నారన్నది బీజేపీ వర్గాల సమాచారం. ఆ నాలుగు పేర్లలో కూడా ఫిల్టర్స్‌ ఉన్నాయట. అర్వింద్‌, రఘునందన్‌రావు పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా పార్టీ పెద్దలకు తమ మనసులోని మాట చెప్పుకుని ఎవరి స్టైల్‌లో వారు లాబీయింగ్‌ చేస్తున్నారన్నది అంతర్గత సమాచారం.

ఎక్కడా గ్యాప్‌ రాకుండా ఎవరికి వారు డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానే పెద్దలకు ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతూ టచ్‌లో ఉంటున్నారట. దీంతో హస్తిన నేతల మనసులో ఏముందోనన్న సస్పెన్స్‌ అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో బీసీ అజెండాతో ముందుకు వెళ్ళాలన్న మరో వాదన సైతం ఉంది. అందుకే ఉత్కంఠ పెరుగుతోందట. కేవలం రాజకీయ అవసరాల ప్రాతిపదిక అంటున్నారు కాబట్టి అందులో క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారా? లేక మరో రకంగా ఆలోచిస్తారా అన్నది కూడా చూడాలి. ఇలా… వివిధ కోణాల్లో మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ కొత్త చర్చలు మొదలయ్యాయి. పార్టీ అధిష్టానం ఏ ఈక్వేషన్‌ని ఫైనల్ చేస్తుందో చూడాలి మరి.

Exit mobile version