Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?

  • ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో అధికారులు విఫలం?..
  • హడావిడి జీవోలు, ఆ తర్వాత ఆపేయడాలు..
  • 22A భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా?..
  • రెవెన్యూ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి..
  • గతంలో ప్రకటించకముందే హిల్ట్‌ పాలసీ వివరాలు విపక్షానికి లీక్‌..
  • జీవో 49కు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఆందోళనలు..
Otr Tg Govt Officers

Otr Tg Govt Officers

Off The Record: తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళయినా… ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంలో అధికారులు విఫలమైయ్యారన్న వాదన బలపడుతోంది. ఈ మూడేళ్ళలో పలు కీలక అంశాలపై హడావుడిగా జీవోలు విడుదల చేయడం, తర్వాత పర్యవసానాలను చూసి ఆపేయడం లాంటివి జరిగాయి. ముఖ్యంగా వరుస భూ వివాదాలు ప్రభుత్వ పెద్దల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. దీంతో… ప్రభుత్వ ఉన్నతాధికారుల పనితీరుపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ నిషేధిత భూముల అంశంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో… రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ప్రజలకు జరిగిన అసౌకర్యంపై బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. లక్షల ఎకరాల ప్రయివేటు భూములు, ఆస్తులను 22ఏలో చేర్చడం ద్వారా ఏ పాపం తెలియని అమాయకులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పెరిగిపోవడంతో… రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎం. ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆస్తులను అధికారులు పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారని… అందుకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నామని ఆ తర్వాత అన్నారు పొంగులేటి.

ఇక నిరుడు రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకు వచ్చింది. అది రూపొందక ముందే.. వివరాలు ప్రతిపక్షాలకు విషయం లీక్ అయ్యాయి. అస్త్రంగా మలవుచుకున్న బీఆర్‌ఎస్‌… లక్షల కోట్ల విలువైన భూములను ప్రభుత్వ పెద్దలు తమ బంధువులకు, నచ్చిన వారికి కట్టబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారంటూ ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం అటు అసెంబ్లీలో ఇటు ప్రజా క్షేత్రంలో సంజాయిషీ ఇచ్చు కోవాల్సి వచ్చింది. మరో ఘటనలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు అటవీ భూముల విషయంలో కూడా అదే తరహా వివాదం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి… ఆ జీవోని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. అటు కొద్ది రోజుల క్రితం hcu భూముల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శేరిలింగంపల్లి పరిధిలోని కంచె గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, వేలం వేయాలని సర్కార్‌ నిర్ణయించింది. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడమేగాక సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఆ 400 ఎకరాలు యూనివర్సిటీవేనంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. జాతీయ స్థాయిలో పర్యావరణ ప్రేమికులు, ఎన్జీవోలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ తీరును తప్పు పట్టాయి. దీంతో… సెంట్రల్‌ యూనివర్శిటీ భూములపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాగే… వికారాబాద్ జిల్లా లగచర్ల, హాకీంపేట గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ సభలకు వెళ్లిన కలెక్టర్, రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ఫార్మా కంపెనీలను రైతులు వ్యతిరేకిస్తున్నా ఆ అంశంలోని సున్నితత్వాన్ని ఉన్నతాధికారులు గుర్తించ లేకపోయారు. దాంతో రచ్చ రచ్చ అయింది. చివరికి లగచర్ల ఫార్మా భూసేకరణపై వెనక్కి తగ్గింది రేవంత్ రెడ్డి సర్కార్.

అలాగే… తమ గ్రామాలకు యమపాశంగా మారుతున్నదన్న కారణంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశఆరు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్, గుండంపల్లి రైతులు. గ్రామాల్లో అధికారులపై భౌతిక దాడులు జరిగాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ విషయంలోనూ అదే సమస్య. గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం సుమారు 20 వేల ఎకరాలు సేకరించింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫైనల్గా అది ఫ్యూచర్‌ సిటీ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు… ఇలా చాలా సందర్భాల్లో హడావిడిగా జీవోలు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం కామన్‌ ఆయిపోయింది. దీంతో… ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు వినడంలేదా? ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో వాళ్ళకు అర్ధం కావడంలేదా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అర్ధమైనా కూడా… కొందరు కావాలనే అలా చేస్తున్నారా అన్న సందేహాలు సైతం వివిధ వర్గాల్లో పెరుగుతున్నాయి. ఒక జీవో విడుదల చేసేప్పుడు సమగ్రమైన వివరాలు, తరువాత జరిగే పర్యవసానాల్ని తెలుసుకోకుండా ఉన్నతాధికారులు కొందరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి కీలకమైన జీవోల విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని… లేదంటే భారీ డ్యామేజ్‌ తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.