NTV Telugu Site icon

Off The Record: ఓ సామాజికవర్గమే పెత్తనం చేస్తుందా..? సీఎస్‌ పేషీలో అసలేం జరుగుతుంది?

Cs

Cs

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్‌లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ… రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్‌లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్‌ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి. చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారికి, సీనియర్‌ ఐఎఎస్‌లకు, ఉద్యోగులు, సిబ్బందికి మధ్య కొందరు అడ్డుగోడలు కడుతున్నారన్న చర్చ జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. గడిచిన ఏడాదిగా… తమకు కూడా సీఎస్ అపాయింట్ మెంట్ దొరకడం లేదంటూ సీనియర్‌ బ్యూరోక్రాట్స్ సైతం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను సీఎస్ తో చర్చించే అవకాశం కూడా పేషీ కల్పించడం లేదని చెప్పుకుంటున్నారు. ఇదేమని ఎవరైనా సీనియర్ ఐఏఎస్‌లు ప్రశ్నిస్తే మేడమ్ బిజీగా ఉన్నారు… వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు, యాంటీ రూమ్‌లో వేరే విషయాలపై డిస్కషన్ జరుగుతోందన్న సమాధానాలే వస్తున్నాయట.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలో పది మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. అందులో ముగ్గురు పర్సనల్ సెక్రటరీలు, ఇద్దరు ఓఎస్డీలు, పర్సనల్ అసిస్టెంట్‌గా చెప్పుకునే స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ సెక్రటరీ, ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఐటి ఉద్యోగులు ఉన్నారు. సాధారణంగా సీఎస్ ఏ విషయాన్నీ నేరుగా కమ్యూనికేట్ చేయరు. ఏదైనా సమాచారంగానీ, మీటింగ్స్, ఇతర విషయాలను ఐఏఎస్ లకు చెప్పాలంటే పీఎస్‌లు, పీఏల ద్వారా కమ్యూనికేట్‌ చేస్తారు. బయట నుంచి ఎవరైనా కలవాలంటే అపాయింట్ మెంట్స్, షెడ్యూల్స్ అన్నీ పీఎస్, ఓఎస్డీలు ఖరారు చేస్తారు. ఇక్కడే అసలు సమస్య ఎదురౌతోందని అంటున్నారు. విషయాన్ని బ్యూరోక్రాట్స్‌కు చేరవేయడంలో పేషీ ఉద్యోగుల చేస్తున్న ఆలస్యం, అలసత్వం… కలగలిసి చివరకు ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగులకు మెమోలు ఇచ్చేదాకా వెళ్తున్నట్టు సమాచారం. దాని ఎఫెక్ట్‌ తమ కెరీర్‌ మీద పడుతోందని వాపోతున్నారట చాలామంది ఉద్యోగులు. ఇటీవల ఓ అంశంపై సంబంధిత మహిళా ఐఏఎస్ అధికారిని వివరాలు అడిగి తనకు ఇవ్వమంటూ పేషీని పురమాయించారట సీఎస్‌. కానీ… ఆ మహిళా ఐఏఎస్‌కు మాత్రం పేషీ నుంచి ఎలాంటి ఫోన్ వెళ్లలేదు. కానీ… సీఎస్‌కు మాత్రం తాము అడిగినా సదరు అధికారిణి వివరాలు ఇవ్వలేదని చెప్పేశారట. దీంతో చీఫ్‌ సెక్రెటరీ సీరియస్‌ అయి ఆ మహిళా ఐఏఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సచివాలయం ఆరో అంతస్థులో చర్చ జరుగుతోంది.

అధికారిక సమాచారం, శాఖలకు సంబంధించిన వివరాలను ఇటు సీఎస్‌కు, అటు ఉద్యోగులకు చేరవేటడంలో పేషీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక సీఎస్ పేషీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం సరైన గౌరవం దక్కడం లేదని అంటున్నారు. సీనియర్ అధికారుల్ని సైతం చిటికెలు వేసి పిలవడం, చేతి వేళ్ళు చూపించి సైగలు చేయడం… పేరు పెట్టి సంభోదించడం లాంటి వ్యవహారాల మీద అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి. అటవీ శాఖలో పని చేసే ఓ ఉద్యోగి సీఎస్‌కు తాను ఎంత చెబితే అంత అంటూ.. తోటి ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు ఫిర్యాదు వెళ్ళింది. సచివాలయానికి సంబంధం లేని వ్యక్తిని సీఎస్ పేషీలో రెగ్యులర్ ఉద్యోగిగా నియమించేలా సీఎంవో ఆఫీసర్స్‌ మీద ఒత్తిళ్లు తెస్తున్నారని… బయటి ఉద్యోగులను సెక్రటేరియట్‌లో పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉద్యోగులు హెచ్చరించినట్లు సమాచారం. కాగా పదవీ విరమణ చేసిన వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా… కన్సల్టెంట్ అడ్మిన్ పేరుతో ఓ ఉద్యోగికి పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. సీఎస్ పేషీలో కూడా కుల వివక్ష ఉందని, ఓ సామాజిక వర్గానికి చెందిన వారే మెజార్టీ రెగ్యులర్ ఉద్యోగులు ఉంటూ ఇతర సామాజికవర్గాల వారిని చిన్నచూపు చూస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు ఉద్యోగులు. సీఎస్ పేషీలో పని చేసే ఉద్యోగులు, అధికారులు తమకు నచ్చిన వ్యక్తులతో మర్యాదగా… నచ్చని వారు ఏ పొజిషన్‌లో ఉన్నాసరే… అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

గతంలో ఓ కీలక ఉద్యోగ సంఘం నేతతో అగౌరవంగా వ్యవరిస్తే ఆయన అందరి ముందు సదరు ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చారంటూ గుర్తు చేసుకుంటున్నారు. సీఎస్ పేషీ ఉద్యోగుల ప్రవర్తన తీరు నచ్చక చాలా మంది ఆరో అంతస్థులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంకు వెళ్లడమే మానుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. చిన్న విషయాలు పెద్దవిగా మారక ముందే పేషీని సీఎస్ ప్రక్షాళన చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందని, లేదంటే… సమస్యలు తప్పవన్న టాక్‌ నడుస్తోంది సెక్రటేరియెట్‌ సర్కిల్స్‌లో.